Saxophonist: శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి | Sakshi
Sakshi News home page

Saxophonist: శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి

Published Thu, Aug 31 2023 12:22 AM

Indian saxophonist Subbalaxmi success story - Sakshi

సుబ్బలక్ష్మి ఇంటి పేరు ఎవరికీ తెలియదు. ప్రపంచమంతా ఆమెను శాక్సాఫోన్  సుబ్బలక్ష్మి అనే పిలుస్తుంది. మగవారు మాత్రమే వాయించే ఈ వాయిద్యంలో సుబ్బలక్ష్మి స్త్రీగా ఉనికి సాధించింది. పట్టుచీర, వడ్డాణం ధరించి వేదిక మీద సంప్రదాయ ఆహార్యంలో ఈ ఆధునిక వాయిద్యం మీద వెస్ట్రన్, కర్నాటక్‌లో అద్భుత ప్రతిభ చూపుతుంది. డైరీలో ఒకరోజు కూడా ఖాళీ ఎరగని ఈ బెంగళూరు వాద్యకారిణి సక్సెస్‌ స్టోరీ.

40 ఏళ్ల సుబ్బలక్ష్మి ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేయాలంటే సంవత్సరం ముందు బుక్‌ చేసుకోవాలి. ఆమె డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. ఇవాళ చెన్నై, రేపు బెంగళూరు, ఎల్లుండి దుబాయ్‌... ఆమె కచ్చేరీలు సాగిపోతూ ఉంటాయి. భర్త కిరణ్‌ కుమార్‌కు ఐ.టి. రంగంలో మంచి ఉద్యోగం. కానీ ఈమె కచ్చేరీల బిజీ చూసి ఉద్యోగం మానేసి సాయంగా ఉంటున్నాడు. బెంగళూరులో నివాసం ఉండే సుబ్బలక్ష్మి సొంతింట్లో ఉండేది తక్కువ. కచ్చేరీలకు తిరిగేది ఎక్కువ. కాని ఈ విజయం అంత సులువు కాదు సుమా.

ఒక్కతే శిష్యురాలు
సుబ్బలక్ష్మి పూర్తిపేరు ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి. అవును. మహా గాత్ర విద్వాంసులు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మిని జ్ఞప్తికి తెచ్చే పేరు. ఆ పేరు ప్రభావమో, ఇంట్లో సంగీతం ఉండటమో సుబ్బలక్ష్మికి కూడా సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. సుబ్బలక్ష్మి తాత మైసూర్‌ సంస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉండేవాడు. సుబ్బలక్ష్మి తండ్రి సాయినాథ్‌ మంగళూరులో మృదంగ విద్వాంసుడు. అతడు అనేకమంది సంగీతకారులకు కచ్చేరీల్లో వాద్య సహకారం అందించేవాడు.

ఐదో ఏట నుంచే గాత్ర సంగీతం నేర్చుకుంటున్న సుబ్బలక్ష్మి ఒకసారి తండ్రితోపాటు కచ్చేరీకి వెళ్లింది. అది శాక్సాఫోన్‌ విద్వాంసుడు కద్రి గోపాల్‌నాథ్‌ కచ్చేరి. అందులో గోపాల్‌నాథ్‌ అద్భుతంగా శాక్సాఫోన్‌ వాయిస్తుంటే సుబ్బలక్ష్మి మైమరిచిపోయింది. తాను కూడా శాక్సాఫోన్‌ నేర్చుకోవాలనుకుంది. అప్పుడు ఆమెకు 13 ఏళ్లు. ఆ రోజుల్లో ఆడపిల్లలు శాక్సాఫోన్‌ను అంతగా నేర్చుకునేవారు కాదు. గురువులు నేర్పించేవారు కూడా కాదు. అది పూర్తిగా మగవారి వాయిద్యం. కాని సుబ్బలక్ష్మి పట్టుబట్టింది. మొత్తం 16 మంది శిష్యులు ఆ సమయంలో కద్రి గోపాల్‌నాథ్‌ దగ్గర ఉంటే వారిలో ఒకే ఒక శిష్యురాలు సుబ్బలక్ష్మి.

గర్భం దాల్చాక కూడా
సుబ్బలక్ష్మి శాక్సాఫోన్‌ వాయించడంలో ఒక వరుస ఉంటుంది. ఆమె మొదట కర్నాటక సంగీతం వాయించి ఆ తర్వాత ఫ్యూజన్‌లోకి వస్తుంది. వెస్ట్రన్‌ను, కర్నాటక్‌ను మిళితం చేసి కచ్చేరీల్లో ఒక ఊపు తెస్తుంది. అది జనానికి నచ్చుతుంది. ఇది కూడా కొంతమంది శాక్సాఫోన్‌ విద్వాంసులకు నచ్చదు. ఆమెను విమర్శిస్తుంటారు. ‘నన్ను ఎన్నో విమర్శిస్తారు. కాని నేను భయపడలేదు. కచ్చేరీలు కొనసాగించాను. 7 కిలోల శాక్సాఫోన్‌ను రెండు గంటల పాటు పట్టుకుని కచ్చేరి చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆడది అలా చేయలేదు అనేవాళ్లకు సమాధానంగా నిలిచాను. నా ఊపిరితిత్తుల బలం నాకు సహకరించింది.

పెళ్లయి గర్భం దాల్చాక నా శత్రువులు ఇక ఆమె కచ్చేరీలు చేయదు అనే ప్రచారం మొదలెట్టారు. డెలివరీ అయ్యాక కచ్చేరీలు సాధ్యం కాదని ఆర్గనైజర్స్‌ను భయపెట్టారు. దాంతో షోలు బుక్‌ చేసిన ఆర్గనైజర్స్‌ అడ్వాన్సులు వెనక్కు ఇమ్మని అడగడం మొదలెట్టారు. నేను పట్టుదలగా ఆ పుకార్లను తోసి పుచ్చాను. రేపు డెలివరీ అనగా ఇవాళ కూడా కచ్చేరీ చేశాను. నిండు గర్భవతిగా స్టేజ్‌ మీద శాక్సాఫోన్‌ వాయించింది నేనే అనుకుంటా. అలాగే డెలివరీ అయిన 15 రోజులకు మళ్లీ స్టేజ్‌ మీదకు వచ్చాను. ఈ రంగంలో నేనేమిటో నిరూపించుకోవాలనే నా పట్టుదలే నాకు బలాన్ని ఇచ్చింది’ అంటుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి సోదరి లావణ్య కూడా శాక్సాఫోన్‌ విద్వాంసురాలిగా రాణిస్తోంది. వీరు విడివిడిగా కచ్చేరీలు చేసినా కలిసి చేసే కచ్చేరీలు కూడా వీనుల విందుగా ఉంటాయి.
 
ఎన్నో వెక్కిరింతలు
సాధనలో అబ్బాయిలు సుబ్బలక్ష్మిని అస్సలు సహించలేదు. ‘నేను శాక్సా పట్టుకుని సాధన చేస్తుంటే వాళ్లు నవ్వుతుండేవారు. కుర్చీ కిర్రుకిర్రుమన్నట్టు ఉంది అనేవారు. గురువు గారి భార్య మా అమ్మకు స్నేహితురాలు. వీళ్లు నవ్వుతుంటే ఆమె బయటికొచ్చి చూసి– వాళ్లు నవ్వనీ ఏమైనా అననీ... నువ్వు మాత్రం ట్రై చేస్తూనే ఉండు. నీకు వస్తుంది అని ఎంకరేజ్‌ చేసింది. ఆమె ప్రోత్సాహం వల్ల ధైర్యం తెచ్చుకున్నాను. నేను శాక్సాఫోన్‌ నేర్చుకోవడంలో ప్రోత్సాహం కంటే అవమానమే ఎక్కువ. కచ్చేరీల్లో కావాలని నా టైము మధ్యాహ్నం ఇచ్చేవారు. ఆ సమయంలో ఆడియెన్స్‌ ఉండరు. మహా అయితే పది నిమిషాలు కేటాయించేవారు. మగవారు సాయంత్రం నిండు సభలో వాయించేవారు. వారికి గంట సమయం దొరికేది. నన్ను ప్రత్యేకంగా మహిళా శాక్సాఫోనిస్ట్‌ అని విడిగా చూసేవారు’ అని తెలిపింది సుబ్బలక్ష్మి.

Advertisement
Advertisement