చీకటిపై రణం చేసిన... గెలుపు వ్యాకరణం | Sakshi
Sakshi News home page

చీకటిపై రణం చేసిన... గెలుపు వ్యాకరణం

Published Tue, Dec 20 2022 4:44 AM

Instoried announces AI-based text-to-image tool - Sakshi

చిన్నవయసులోనే డిప్రెషన్‌ బారిన పడిన షర్మిన్‌ తల్లిదండ్రుల సహాయంతో ఆ చీకటి నుంచి బయటపడింది. ‘ఆట–మాట–పాట’లలో తన ప్రతిభ చూపింది. సృజనాత్మకతకు మెరుగులు దిద్దే ఏఐ–ఆధారిత ప్లాట్‌ఫామ్‌ ‘ఇన్‌స్టోరీడ్‌’తో ఇన్‌స్పైరింగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకుంది.

‘కస్టమర్స్‌ కొనుగోలు నిర్ణయాలు లాజిక్‌ మీద కాదు ఎమోషన్స్‌పై ఆధారపడి ఉంటాయి’ అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని ఏఐ–ఆధారిత ప్లాట్‌ఫామ్‌ ‘ఇన్‌స్టోరీడ్‌’ను ప్రారంభించింది షర్మిన్‌ అలి. ఈ ప్లాట్‌ఫామ్‌ సోలోప్రెన్యూర్స్, ఫ్రీలాన్సర్స్, కంటెంట్‌ క్రియేటర్స్, క్లయింట్స్‌ కోసం కంటెంట్‌ క్రియేట్‌ చేసే ఏజెన్సీలకు బాగా ఉపయోగపడుతుంది.

‘కంటెంట్‌ రైటర్స్‌ కస్టమర్‌ మనసులోకి పరకాయప్రవేశం చేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది’ అంటున్న షర్మిన్‌ ‘ఇన్‌స్టోరీడ్‌’ ప్రారంభించడానికి ముందు ఎంతోమంది న్యూరో మార్కెటర్స్, న్యూరో సైంటిస్టులతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఏఐ పవర్డ్‌ టూల్‌ను రూపొందించడానికి పద్దెనిమిది నెలల కాలం పట్టింది.ఇంతకీ ఈ టూల్‌ చేసే పని ఏమిటి?

మనం ఏదైనా కంటెంట్‌ క్రియేట్‌ చేసినప్పుడు, మన కంటెంట్‌ మనకు బాగానే ఉంటుంది. ‘నిజంగా ఈ కంటెంట్‌ బాగుందా? మార్పు, చేర్పులు ఏమైనా చేయాలా?’ అనే సందేహం వచ్చినప్పుడు ఈ టూల్‌కు పనిచెప్పవచ్చు.

‘ఈ వాక్యం సరిగ్గా లేదు’ ‘ఈ పదానికి బదులు మరో పదం వాడితే బాగుంటుందేమో’ ‘ఇలాంటి హెడ్‌లైన్స్‌ చాలా వచ్చాయి. వేరే హెడ్‌లైన్‌కు ప్రయత్నించండి’  ‘టు మెనీ నెగెటివ్‌ వర్డ్స్‌. మీ భావం సరిగ్గా చేరడం లేదు’ ‘ఇందులో భాషా దోషాలు కనిపిస్తున్నాయి’.....ఇలాంటి సలహాలు ఎన్నో ఇస్తుంది ఈ  ఏఐ టూల్‌. కొన్నిసార్లు అనుకోకుండా మనం రాసిన వాక్యం, ఎవరో రాసిన వాక్యంలా ఉండి కాపీ కొట్టారు అనే ముద్ర పడడానికి అవకాశం ఉండవచ్చు.  ఇలాంటి సందర్భాల్లో కూడా ‘ఇన్‌స్టోరీడ్‌’ టూల్‌ హెచ్చరించి వేరే వాక్యాలు రాసుకునేలా చేస్తుంది.


‘చాలామంది నన్ను అడిగే ప్రశ్న...మీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కాపీరైటర్స్‌ అవసరం లేకుండా చేయవచ్చా? అది అసాధ్యం అని చెబుతాను. మానవసృజనకు ప్రత్యామ్నాయం లేదు. మా ప్లాట్‌ఫామ్‌ సృజనకు మెరుగులు పెట్టి మరింత చక్కగా తీర్చిదిద్దేలా చేస్తుంది’ అంటోంది షర్మిన్‌.

షర్మిన్‌ ‘ఇన్‌స్టోరీడ్‌’కు శ్రీకారం చుట్టినప్పుడు ‘ఇది సక్సెస్‌ అవుతుందా?’ అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే తన ప్రాజెక్ట్‌ మీద ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు షర్మిన్‌. ఆమె నమ్మకం నిజమైంది. బెంగళూరు కేంద్రంగా మొదలుపెట్టిన ‘ఇన్‌స్టోరీడ్‌’కు వేలాది మంది యూజర్స్‌ ఉన్నారు. ‘ఇన్‌స్టోరీడ్‌’కు ముందు అమెరికాలో డాటాసైన్స్, ఎనలటిక్స్‌ రంగాలలో పనిచేసింది షర్మిన్‌  పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌లో పుట్టిన షర్మిన్‌ అహ్మదాబాద్‌లో పెరిగింది. ‘ఆడుతూ పాడుతూ పెరిగినదే అందమైన బాల్యం’ అంటుంటారు. అయితే షర్మిన్‌ మాత్రం చిన్న వయసులోనే డిప్రెషన్‌ బారిన పడింది. భూకంపం, వరదలు, మతకలహాలు....మొదలైన వాటి ప్రభావంతో కుంగుబాటు అనే చీకట్లోకి వెళ్లిపోయింది.  రకరకాల ప్రయత్నాలు చేసి ఆ చీకటి నుంచి షర్మిన్‌ను బయటికి తీసుకువచ్చారు తల్లిదండ్రులు.

అది మొదలు...ఆటలు, పాటలు, నృత్యాలలో చురుగ్గా పాల్గొనేది. ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌లో ఉన్నప్పుడు ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ ఎలక్టివ్‌గా తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనేది తన కలగా మారింది. ‘ఇన్‌స్టోరీడ్‌’తో సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గెలుపు జెండా ఎగరేసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గానే కాదు నటి, రచయిత్రి, మోటివేషనల్‌ స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది షర్మిన్‌ అలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement