Sakshi News home page

International Jazz Day: జాజ్‌ జాజిమల్లి

Published Sat, Apr 29 2023 3:45 AM

International Jazz Day: Top Dance Classes For Jazz in Mumbai - Sakshi

జాజ్‌ జాజిమల్లికి కొత్త అందాన్ని తీసుకువస్తోంది ముంబైకి చెందిన ఆల్‌–ఉమెన్‌ జాజ్‌ టీమ్‌. పాశ్చాత్య కళకు దేశీయత జత చేసి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. జాజ్‌ డ్యాన్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపుతోంది.

ముంబైలోని ఆల్‌–ఉమెన్‌ జాజ్‌ టీమ్‌లో శ్వేతన్‌ కన్వర్, రాధిక మాయాదేవ్, రోషిణి నాయర్, వేదిక అగర్వాల్, దీక్ష, రియా సూద్‌ అనే డ్యాన్సర్‌లు ఉన్నారు.
‘స్టీరియోటైప్‌ను బ్రేక్‌ చేయడానికి జాజ్‌ టీమ్‌ ప్రారంభించాం’ అంటుంది ఫౌండర్‌ శ్వేతన్‌ కన్వర్‌.\ డెహ్రాడూన్‌కు చెందిన శ్వేతన్‌ ఫ్యాషన్‌ మార్కెటింగ్‌ స్టూడెంట్‌.

ఒకప్పుడు హాబీగా మాత్రమే ఉన్న జాజ్‌ డ్యాన్స్‌ ఇప్పుడు తన కెరీర్‌గా మారుతుందని ఆమె ఊహించలేదు.
‘జాజ్‌ డ్యాన్స్‌ అనేది అందరూ అనుకునేంత సులువైన విద్య కాదు. ఎంతో సాధన చేస్తే తప్ప ఆ విద్య మన సొంతం కాదు’ అంటుంది శ్వేతన్‌.

రాధిక మాయదేవ్‌ పదహారు సంవత్సరాల వయసు నుంచే జాజ్‌ డ్యాన్స్‌ చేయడం ప్రారంభించింది. అయితే తన అభిరుచినే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం ముందు తల్లిదండ్రులు అడ్డుచెప్పినప్పటికీ కూతురు ఉత్సాహాన్ని గమనించి ఆ తరువాత వారు ఆమోదించారు. కూతురికి లభించిన గుర్తింపుకు సంతోషిస్తున్నారు.
కామర్స్‌ స్టూడెంట్‌ అయిన రోహిణి నాయర్‌ మొదట భరతనాట్యం చేసేది. ఆ తరువాత జాజ్‌ డ్యాన్స్‌లోకి వచ్చింది. ఇది వారి తల్లిదండ్రులకు నచ్చలేదు. అయితే వారిని తన మాటలతో మెప్పించింది.

‘మా అమ్మాయి జాజ్‌ డ్యాన్సర్‌’ అని గర్వంగా చెప్పుకునేలా చేసింది రోహిణి.
‘ప్రయోగాలతోనే ఏ కళ అయినా వృద్ధి చెందుతుంది. కళ ఎప్పుడూ నిలవనీరులా ఉండకూడదు’ అంటున్న వేదిక అగర్వాల్‌ జాజ్‌కు దేశీయ సొగసును జత చేయడానికి పలు రకాలుగా ఆలోచిస్తుంది. సాధారణంగా జాజ్‌ డ్యాన్స్‌ అనగానే శాక్స్‌ఫోన్‌ శబ్దాలు, ఇంగ్లీష్‌ పాటల లిరిక్స్‌ వినిపిస్తాయి.

‘అలా మాత్రమే ఎందుకు!’ అంటూ ఈ టీమ్‌ జాజ్‌ డ్యాన్స్‌కు కొత్త లుక్‌ తీసుకువచ్చింది.
ప్రసిద్ధ బాలివుడ్‌ పాటలతో జాజ్‌ డ్యాన్స్‌ చేయడం ప్రారంభిచారు.
‘మొదట ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తరువాత ఆనందిస్తారు. ఆ తరువాత ఆమోదిస్తారు’ అనే మాట ఈ టీమ్‌ విషయంలో నిజమైంది.

‘జాజ్‌ డ్యాన్స్‌లో బాలీవుడ్‌ పాటలు ఏమిటి!’ అని ఆశ్చర్య పోయినవారే వారి ప్రదర్శన చూసిన తరువాత ‘ఆహా! అద్భుతం’ అని మెచ్చుకున్నారు.
‘హిందీ సినిమా పాటలకే కాదు సౌత్‌ ఇండియన్‌ మ్యూజిక్‌కు కూడా జాజ్‌ డ్యాన్స్‌ జత చేయనున్నాం’ అంటుంది రోహిణి నాయర్‌.
‘మీరు చూస్తే లావుగా కనిపిస్తారు. ఇంత చక్కగా ఎలా డ్యాన్స్‌ చేయగలుగుతున్నారు!’ అని చాలామంది రాధిక మాయదేవ్‌ను అడుగుతుంటారు.

ఆమె ఆ  సందేహానికి చెప్పే సమాధానం...
‘ప్రతి బాడీకి తనదైన ప్రత్యేకత ఉంటుంది. రిథమ్‌ ఉంటుంది. ప్రతి బాడీకి డ్యాన్స్‌ చేసే సామర్థ్యం ఉంటుంది. అందుకు అవసరమైనది సాధన మాత్రమే’
జాజ్‌ డ్యాన్స్‌లో కంటెంపరరీ, పుంక్, స్ట్రీట్‌ స్టైల్, లిరికల్‌ అండ్‌ కమర్శియల్‌...అంటూ రకరకాల స్టైల్స్‌ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ అభినందనలు అందుకుంటోంది ఆల్‌–ఉమెన్‌ జాజ్‌ టీమ్‌.

Advertisement
Advertisement