International Peace Day 2022: యంగ్‌ పీస్‌కీపర్స్‌... యువతదే క్రియాశీలక పాత్ర! వారేం చేస్తున్నారంటే..

21 Sep, 2022 12:13 IST|Sakshi

నేడు ప్రపంచ శాంతి దినోత్సవం

‘పీస్‌ ఈజ్‌ ఆల్వేస్‌ బ్యూటిఫుల్‌’ అనేది పెద్దల మాట. మరి యువతరం ఏ బాటలో పయనిస్తోంది? ఐక్యరాజ్య సమితి పీస్‌ కీపింగ్‌ ఆపరేషన్‌లలో యువత క్రియాశీల పాత్ర... 
పైప్రశ్నకు స్పష్టమైన జవాబు చెబుతుంది....

‘మా ప్రపంచం మాది. ప్రపంచం ఎటూ పోతే మాకెందుకు!’ అనుకోవడం లేదు యువత.
ఒకవైపు తమదైన ప్రపంచంలో సరదా సరదాగా ఉంటూనే, ప్రపంచ ధోరణులను నిశితంగా పరిశీలిస్తోంది.

‘శాంతిభద్రతల పరిరక్షణకు మీవంతు సహాయం కావాలి. మీ శక్తిసామర్థ్యాలు కావాలి’ అనే ఐరాస పిలుపు యువతకు వినబడిందా?
‘అవును. వినిపిస్తోంది’ అని కాస్త గట్టిగానే చెప్పుకోవడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

ఐక్యరాజ్య సమితి పీస్‌మిషన్‌ ఆపరేషన్‌లపై ఆసక్తి ప్రదర్శించడమే కాదు రకరకాల పద్ధతుల్లో వాటిలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది యువతరం. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను పణంగా పెట్టి మరీ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు యంగ్‌ పీస్‌కీపర్స్‌.

‘మేము చేపట్టే పీస్‌మిషన్‌ కార్యక్రమాల్లో యువతరం కీలకపాత్ర పోషిస్తుంది. వారిలో సహజంగా ఉండే సులభంగా అందరిలో కలిసి పోయే లక్షణం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఉపకరిస్తున్నాయి’ అంటున్నారు అండర్‌–సెక్రెటరీ ఫర్‌ పీస్‌ ఆపరేషన్స్‌ జీన్‌ లక్రోయిక్స్‌.

రోహిణి ఐరాస తరపున దక్షిణ సుడాన్‌లో పనిచేస్తుంది. వైద్యురాలిగా తన వృత్తిలో భాగంగా ఎంతోమంది యువతీయవకులతో కలిసి పనిచేసే అవకాశం ఆమెకు వచ్చింది.
‘వారి ప్రతిభ, శక్తిసామర్థ్యాలకు నిర్మాణాత్మక రూపం కల్పిస్తే అద్భుతాలు సాధించవచ్చు’ అంటుంది డా.రోహిణి.

ప్రస్తుతం యూత్‌ సోషల్‌ మీడియాను శ్వాసిస్తుంది.
సోషల్‌ మీడియా అనేది ‘పీస్‌ బిల్డింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌’ అనేవారితో పాటు ‘అబ్బే! అదేం లేదు’ అనేవారు కూడా ఉన్నారు. దీనికి కారణం వివిధ రకాల అంశాలలో విద్వేషపూరిత చర్చలు, దుమ్మెత్తి పోసుకోవడాలకు అది వేదిక కావడమే. ఈ వాతావరణంలో యూత్‌ ఎటువైపు నిలబడుతుంది? అనే ఒక కీలక ప్రశ్న ముందుకు వస్తుంది.

విద్వేషప్రేమికుల సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రపంచశాంతిని ప్రేమించే యువతరం తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు. చిన్న సూక్తి లేదా ఒక పుస్తకానికి సంబంధించిన విషయాలను ఉటంకించడం ద్వారా శాంతి సందేశాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న క్రూరమైన యుద్ధానికి సంబంధించిన దృశ్యాలపై కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే యువతరం మనసులో ఏముందో సులభంగా అర్ధమవుతుంది. స్థూలంగా చెప్పుకోవాలంటే వారు ప్రపంచశాంతిని బలంగా కోరుకుంటున్నారు.

‘ఒకప్పుడు నాకు ముక్కుపైనే కోపం ఉండేది. ఫ్రెండ్‌ సలహాపై మహాత్ముడి ఆత్మకథ చదివాను. చదువుతూనే ఉన్నాను. నాలో ఎంత మార్పు వచ్చింది అనేది  చెప్పడానికి మాటలు చాలవు’ అని ఒకరు పోస్ట్‌ పెడితే దీనిపై ఎన్నో కామెంట్స్‌ వచ్చాయి. అవన్నీ హింసను నిరాకరించే కామెంట్స్‌. ప్రపంచశాంతిని ప్రేమించే కామెంట్స్‌.

ఉదాహరణకు ఒక కామెంట్‌...
‘విద్వేషం లేని చోట శాంతి ఉంటుంది. శాంతి ఉన్నచోట సౌభాగ్యం ఉంటుంది’  

చదవండి: Pradnya Giradkar: ఇద్దరు మహిళల వల్ల దేశంలోకి చీతాలొచ్చాయి

మరిన్ని వార్తలు