ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం | Sakshi
Sakshi News home page

ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం

Published Fri, Jan 5 2024 12:08 AM

intract raises web3 builds worlds leading learn earn platform - Sakshi

‘కాలంతో పాటు నడవాలి’ అంటారు పెద్దలు.‘కాలంతో పాటు నడుస్తూనే భవిష్యత్‌పై ఒక కన్ను వేయాలి’ అంటారు విజ్ఞులు. అభిషేక్‌ అనిత, అపూర్వ్‌ కుషాల్, సంభవ్‌ జైన్‌... అనే ముగ్గురు మిత్రులు రెండో కోవకు చెందిన దార్శనికులు. లెర్న్‌ అండ్‌ ఎర్న్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఇంట్రాక్ట్‌’తో వెబ్‌3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు...

ఐటీఐ–దిల్లీలో చదువుకున్న అభిషేక్‌ అనిత, అపూర్వ్‌ కుషాల్, సంభవ్‌ జైన్‌ సంభాషణాల్లో సరదా విషయాల కంటే సాంకేతిక విషయాలే ఎక్కువగా చోటు చేసుకునేవి. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? వివిధ దేశాల్లో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? ఏ రంగాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మన దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు, ఇంటర్నెట్‌ అభివృద్ధిలో మూడు ప్రధాన దశలు, వెబ్‌3 టెక్నాలజీతో అపారమైన ఉద్యోగావకాశాలు...ఇలా ఒకటా రెండా బ్లాక్‌చైన్, క్రిప్టో టెక్నాలజీ, వెబ్‌3 టెక్నాలజీ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు.

వారు మాట్లాడుకున్న విషయాలేవి వృథా పోలేదు.‘ఇంట్రాక్ట్‌’ ప్లాట్‌ఫామ్‌కు పునాదిగా ఉపయోగపడ్డాయి.ప్రజలకు బ్లాక్‌ చెయిన్, క్రిప్టో టెక్నాలజీని చేరువ చేయాలనే లక్ష్యంతో 2022లో ‘ఇంట్రాక్ట్‌’ అనే స్టార్టప్‌ స్టార్ట్‌ చేశారు ముగ్గురు మిత్రులు. ‘వెబ్‌3 టెక్నాలజీకి సంబంధించి కేవలం సమాచార వేదికగానే కాకుండా ప్రతిఫలదాయక వేదికగా ఇంట్రాక్ట్‌ని నిర్మించాం.

లెర్నింగ్‌ అండ్‌ ఎర్నింగ్‌ అనేది ఇంట్రాక్ట్‌ లక్ష్యం. క్వెస్ట్, ఇంటరాక్టివ్‌ టాస్కుల ద్వారా బ్లాక్‌ చెయిన్, క్రిప్టో, వెబ్‌3 టెక్నాలజీతో యూజర్‌లను ఎడ్యుకేట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్‌ అభిషేక్‌.సంక్లిష్టమైన రీతిలో కాకుండా ఫన్‌ అండ్‌ ఇంటరాక్టివ్‌ పద్ధతిలో కొత్త ప్రాడక్టులు, సర్వీసులను యూజర్‌లకు పరిచయం చేయడంలో ‘ఇంట్రాక్ట్‌’ విజయం సా«ధించింది. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేసిన యూజర్‌లకు క్రిప్టో, ఎన్‌ఎఫ్‌టీ, లాయల్టీ పాయింట్స్‌ రూపంలో  ప్రోత్సాహకాలు’ అందిస్తోంది.

ఎన్నో కలలతో ముగ్గురు మిత్రులు ‘ఇంట్రాక్ట్‌’ను ప్రారంభించారు. ఆ కలలకు కష్టాన్ని జోడించారు. ఆ కష్టం వృథా పోలేదు. లక్షలాది యూజర్‌లతో ‘ఇంట్రాక్ట్‌’ వెబ్‌3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తూప్రాఫిటబుల్‌ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. ‘ఇంట్రాక్ట్‌’ ఇన్వెస్టర్‌లలో ఆల్ఫా వేవ్‌ గ్లోబల్, గుమీ క్రిప్టోస్, ఆల్కెమీ, మూన్‌ పే, వెబ్‌ 3 స్టూడియోస్, కాయిన్‌ బేస్‌...మొదలైన కంపెనీలు ఉన్నాయి. సమీకరించిన నిధులలో కొంత మొత్తాన్ని తమ టీమ్‌ సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయడానికి, సాంకేతిక అవసరాలకు ఉపయోగించారు. సాధించిన విజయంతో సంతృప్తి పడడం లేదు ముగ్గురు మిత్రులు. భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.

వెబ్‌3 టెక్నాలజీపై మార్కెటింగ్‌ నిపుణులు, కంపెనీల ఫౌండర్‌లు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగావశాలు లేదా ఆవిష్కరణల కోణంలో యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎన్నో కంపెనీలు మార్కెట్‌లోకి రావచ్చు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల గురించి ఆలోచించాలనేది ముగ్గురు మిత్రులకు తెలియని విషయం కాదు.‘వెబ్‌3 క్రియేట్‌ చేసిన సరికొత్త  ఆర్థిక అవకాశాలు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థల గురించి పరిచయం చేసి యూజర్‌లకు ఉపయోగపడాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు సంస్థ కో–ఫౌండర్, సీయీవో సంభవ్‌ జైన్‌.

Advertisement
Advertisement