వద్దమ్మా.. తప్పూ! | Sakshi
Sakshi News home page

వద్దమ్మా.. తప్పూ!

Published Sun, Mar 31 2024 6:35 AM

Introducing Guiding Hands for Mobile Phones video viral - Sakshi

వైరల్‌

ఈ మధ్య ‘గైడింగ్‌ హ్యాండ్స్‌’ అంటూ ఒక వీడియో వచ్చింది. అది వెక్కిరింత వీడియో.  ఫోన్‌ చూసుకుంటూ తల ఎల్లవేళలా కిందకు దించి ఉండేవారిని చేయి పట్టి చేరవలసిన చోటుకు చేర్చే‘సహాయక చేతులను’ భవిష్యత్తులో ఉపాధిగా చేసుకోవచ్చని అందులో చూపుతారు. అంటే అంధులను చేయి పట్టి నడిపించేవారికి మల్లే ఈ ఫోన్‌ బానిసలను చేయి పట్టి నడిపించి చార్జ్‌ తీసుకునే వ్యక్తులు భవిష్యత్తులో వస్తారన్న మాట.

మనం ఫోన్‌కు శ్రుతి మించి ఎడిక్ట్‌ అయ్యామని చెప్పేందుకు ఈ వీడియో చేశారు. బండి మీద వెళుతూ ఫోన్‌ మాట్లాడితే ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినడం లేదు. కొందరు హెల్మెట్‌లో దూర్చి మరీ ఫోన్‌ మాట్లాడుతూ ప్రమాదం బారిన పడతారు. మరికొందరు హెడ్‌ఫోన్స్‌తో మాట్లాడుతూ వెనకొచ్చే వాహనాల హారన్‌ వినక ప్రమాదంలో పడుతున్నారు.

మొన్నటి మార్చి 26న బెంగళూరు విద్యారణ్యపురలో ఒక మహిళ ఇలా ఫోన్‌ బిగించి కట్టి మాట్లాడుతూ ఒక వ్యక్తి కెమెరాకు చిక్కింది. అతను షూట్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది. అందరూ ఇలా చేయడం ప్రమాదం అన్నారు. ఈ ఎండల్లో ఫోన్‌ వేడెక్కి పేలినా ప్రమాదమే అని మరికొందరు హెచ్చరించారు. పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. చివరకు వీడియో పోలీసుల వరకూ వెళ్లింది. బండి నంబర్‌ ఆధారంగా ఆ మహిళను గుర్తించి యలహంక ట్రాఫిక్‌ స్టేషన్‌ వారు 5 వేల రూపాయల ఫైన్‌ వేశారు. అవసరమా ఇదంతా?
 

Advertisement
Advertisement