Valentina Petrillo: అతడే ఆమె

10 Jun, 2021 18:48 IST|Sakshi
వాలెంటినా

ఆమె ట్రాన్స్‌జెండర్‌ మహిళ. దివ్యాంగురాలు.. చిన్నతనంలోనే చూపు కోల్పోయారు. ఇప్పుడు ఆమె వయసు 47 సంవత్సరాలు. ట్రాన్స్‌ పారాలింపిక్‌ అథ్లెట్‌ కావాలన్న తన కోర్కెను భార్యకు చెప్పారు. విమర్శకులు మాత్రం ఆమె ఈ పోటీలో పాల్గొనటం అనైతికం అంటున్నారు.

2019లో పూర్తిగా ట్రాన్స్‌ ఉమన్‌గా మారక ముందు పురుషులతో పోటీపడ్డారు వాలెంటినా. వాలెంటీనా ఇటలీ దేశస్థురాలు. వాలెంటినాకు చిన్నతనం నుంచి పరుగు పోటీలంటే చాలా ఇష్టం. కాని వాలెంటినాకు 14 వ ఏట స్టార్‌గార్డ్‌ట్‌ వ్యాధి వచ్చినట్టు గుర్తించారు. ఈ వ్యాధికి చికిత్స లేదు. క్రమేపీ చూపు పూర్తిగా మందగిస్తుంది. తన స్వస్థలం నేపుల్స్‌లో స్కూల్‌ చదువు పూర్తయ్యాక, అంధుల కోసం ప్రత్యేకంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదవటం కోసం బోలోనా చేరుకున్నారు. అప్పటికి వాలెంటినా వయసు 20 సంవత్సరాలు. అక్కడ ఆటలు ఆడటం ప్రారంభించారు. ఇటలీ జాతీయ అంధుల ఫుట్‌బాల్‌ టీమ్‌లో సభ్యులయ్యారు. ఆ తరవాత మళ్లీ 41 సంవత్సరాల వయసులో వాలెంటినా రన్నింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొనటం ప్రారంభించి, కేవలం మూడు సంవత్సరాల కాలంలో జాతీయ స్థాయిలో మొత్తం 11 అవార్డులు సాధించారు. అది కూడా పురుషుల టి – 12 విభాగంలో పాల్గొని సాధించారు. ఇప్పుడు వాలెంటినా వయసు 47 సంవత్సరాలు.

పొడవు 5 అడుగుల 10 అంగుళాలు. పారాలింపిక్స్‌లో పాల్గొనడానికి ఇదే ఆఖరి అవకాశం. టోక్యోలో పాల్గొనే అవకాశం వస్తుందో రాదో తెలియనప్పటికీ వాలెంటినా ప్రతిరోజూ పరుగు పోటీ కోసం సాధన చేస్తూనే ఉన్నారు. వాలెంటినాకు తొమ్మిది సంవత్సరాల వయసున్నప్పుడు తన తల్లి ధరించే స్కర్ట్‌ ధరించారు. ‘‘ఆ రోజు నాలో ఏదో తెలియని భావోద్వేగం కలిగింది. మన చేతులతో స్వర్గపుటంచులు తాకిన భావన కలిగింది’’ అంటున్న వాలెంటినా ఆ విషయాన్ని ఎవ్వరితోనూ పంచుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తనకు ఒక ట్రాన్స్‌జెండర్‌ కజిన్‌ ఉంది. ఆమె విషయం తెలుసుకున్న తండ్రి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. ఎవరితోనైనా తన విషయం చెబితే, తన జీవితం కూడా అలాగే అవుతుందనే ఉద్దేశంతో వాలెంటినా పురుష వస్త్రధారణలోనే జీవితం గడిపారు.

భార్య అంగీకారంతో..
దశాబ్దాల కాలంగా పురుష వేషధారణలో ఉన్న వాలెంటినా ఎలాగైనా తన గురించి భార్యకు వివరించాలనుకున్నారు. అప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు. చదువులో మంచి ర్యాంకులు సాధించారు, మంచి ఉద్యోగం, మంచి భార్య, ఇద్దరు పిల్లలు. కాని ఏదో తెలియని అసంతృప్తి. ఇక తనలోని స్త్రీ గుణాలను దాచుకోలేక, జూలై 17, 2017న భార్యకు విషయం చెప్పారు వాలెంటినా. ఆమె ముందు అవాక్కయ్యింది. కాని తరవాత అర్థం చేసుకోవటంతో, ఆమె సహకారంతో 2018 నుంచి వాలెంటినా మహిళగా జీవించటం ప్రారంభించారు. 2019 జనవరిలో హార్మోన్‌ థెరపీ తీసుకున్నారు. అందువల్ల శరీరం, మనసు కూడా మార్పు చెందాయి. ‘‘నా మెటబాలిజమ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. నేను ఇంతకు ముందులా బలంగా లేను. ఇంతకు ముందు తిన్నట్లు తినలేకపోతున్నాను. రక్తహీనత వచ్చింది. హెమోగ్లోబిన్‌ తగ్గిపోయింది. నిరంతరం జలుబు చేస్తోంది. అంతకు ముందులా నిద్రపోలేకపోతున్నాను. నా మూడ్స్‌ కూడా తరచుగా మారిపోతున్నాయి’’ అంటున్న వాలెంటినా, ఒక స్పోర్ట్స్‌ పర్సన్‌గా ఓటమిని కూడా అంగీకరించాలంటారు. తన వ్యక్తిగత ఆనందం కోసం మహిళగా మారిన వాలెంటినాకు ఇప్పుడు శారీరక శక్తి బాగా తగ్గిపోయింది.

టోక్యో కోసం..
ఏడాది క్రితం జరిగిన ఇటాలియన్‌ పారాలింపిక్స్‌ అథ్లెటిక్‌ పోటీలలో మొట్టమొదటి మహిళా పారాలింపిక్‌ అథ్లెట్‌గా బహుమతులు అందుకున్న తరవాత, వాలెంటినాకు ఇటలీ తరఫున పారాలింపిక్‌ గా టోక్యోలో పాల్గొనాలనే కోరిక కలిగింది. ‘‘ఒక మహిళగా పరుగు పందెంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. నాలో ఏదో ఒక తెలియని ఫైర్‌ ఉంది. అదే నన్ను ముందుకు తోస్తోంది. ఏదో తెలియని భావోద్వేగం కూడా ఉంది. అయితే 20 సంవత్సరాల వయసులో ఉన్న శక్తి లేదు నాలో. కాని నాలోని సంతోషమే నా హద్దులు దాటమని నన్ను ముందుకు తోస్తోంది’’ అంటారు వాలెంటినా.

అందరితోనూ గొడవలు..
1970 ప్రాంతంలో నేపుల్స్‌లో ఉన్న రోజుల్లో వాలెంటినా ప్రతిరోజూ వీధిలో ఎవరో ఒకరితో గొడవ పెట్టుకునేవారు. ‘‘నేను చేసే గొడవలకు మా అన్నయ్య ఎప్పటికప్పుడు నన్ను రక్షిస్తూ ఉండేవాడు. అన్నయ్య నా కంటె మూడు సంవత్సరాలు పెద్ద’’ అంటున్న వాలెంటినా... నలుగురిలో ఉన్నప్పుడు మహిళల గురించి చాలా అసభ్యంగా మాట్లాడేవారు. కాని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మహిళగా జీవించేవారు.

ఎన్నో సవాళ్లు...
ఇటీవలి కాలం వరకు వాలెంటినా పారాలింపిక్‌ టి 12 విభాగంలో పాల్గొన్నారు. ఇందులో టి అంటే ట్రాక్‌ అని, 12 అంటే అంధులకు సంబంధించిన మూడు గ్రూపులలో ఒక గ్రూపు. తన జీవితంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు వాలెంటినా. వ్యక్తిగత జీవితం, క్రీడా జీవితం, వైవాహిక జీవితం... అన్ని రకాలుగా సవాళ్లను అధిగమించారు. ఆమె జీవితం ఆధారంగా డాక్యుమెంటరీ తీయటానికి ఫిల్మ్‌ – 5 నానేమోల్స్‌ కి అంగీకారం తెలిపారు. ‘‘నా జీవితం మీద సినిమా వస్తుందని నేను ఊహించలేదు. నాలాంటి వారికి నా జీవితం ఒక సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటారు వాలెంటినా పెట్రిలో. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు