Kothagudem: A Tribal Student Who Cracked JEE And Got Seat In IIT Patna - Sakshi
Sakshi News home page

korsa lakshmi : ఐసులమ్మే తండ్రి, తల్లి కూలి.. ఆమె మాత్రం చదువుల సరస్వతి.. ఐఐటీలో సీటు

Published Sat, Aug 19 2023 10:14 AM

Kothagudem Tribal Student Who Cracked IIT Jee And Got Seat In IIT Patna - Sakshi

జె.ఇ.ఇ. ఎంట్రన్స్‌లో ర్యాంకు కొట్టడం సామాన్యం కాదు.అందుకై కొందరు రాజస్తాన్‌ వెళ్తారు. కొందరు హైదరాబాద్, విజయవాడ చేరుకుంటారు.తల్లిదండ్రులు గైడ్‌ చేస్తారు. కాని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు పుట్టిన కోయ విద్యార్థిని కొర్సా లక్ష్మి గురుకుల పాఠశాలలో చదువుకునే మంచి ర్యాంకు సాధించింది.పాట్నా ఐఐటీలో సీటు సాధించింది. కోయలలో ఒక అమ్మాయి సాధించిన స్ఫూర్తినిచ్చే విజయం ఇది. కొర్సా లక్ష్మి పరిచయం.


కొంతమంది ఇళ్లల్లో, నిజానికి చాలామంది ఇళ్లల్లో పిల్లలు జె.ఇ.ఇ. ఎంట్రన్స్‌ రాయడానికి తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెడతారు. బాగా చదివించే కోచింగ్‌ సెంటర్‌ కోసం అవసరమైతే రాజస్థాన్‌లోని కోటాకు వెళతారు లేదా హైదరాబాద్, విజయవాడలలో ప్రఖ్యాత కోచింగ్‌ సెంటర్‌లలో వేస్తారు. ఇక పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటుంటే టీవీలు బంద్‌ చేస్తారు. మాటా పలుకూ లేకుండా పిల్లలు ఇరవై నాలుగ్గంటలూ చదువుకునేలా చేస్తారు. మెటీరియల్‌ తెచ్చిస్తారు. చాలా హైరానా పడతారు. అదేం తప్పు కాదు. కాని ఇలాంటివన్నీ లేకుండా కూడా కొంతమంది విజయం సాధిస్తుంటారు. కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుకున్న కోయ విద్యార్థిని కుర్సా లక్ష్మి అలాంటి విజేతే. పట్టుదలతో చదువుకుని ర్యాంకు సాధించిన విజేత.

ఐసులమ్మే తండ్రి కూతురు
కొత్తగూడెం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన తండా కాటాయగూడెం. 300 గడపలున్న గ్రామం ఇది. అందరూ కోయలే. వ్యవసాయ కూలీలే. ఏ కొద్దిమందికో కాసింత భూమి ఉంటుంది. కొర్సా లక్ష్మి తండ్రి కన్నయ్యకు ఎకరం భూమి ఉంది. కాని వాన పడితేనే పండుతుంది. కన్నయ్య వ్యవసాయ కూలీగా వెళతాడు. తల్లి శాంతమ్మ కూడా. వ్యవసాయ పనులు లేనప్పుడు తన టీవీఎస్‌ ఎక్సెల్‌ మీద ఐస్‌ బాక్స్‌ పెట్టుకుని ఐసులమ్ముతాడు. ముగ్గురు పిల్లలు. కాని పెద్ద కొడుకు చదువు ఇష్టం లేక 7వ తరగతిలో ఇంట్లో నుంచి పారిపోయాడు. రెండో కొడుకు మామూలు చదువే. చివరి అమ్మాయి లక్ష్మి బాగా  చదువుకోవాలని నిశ్చయించుకుంది.

పిన్ని స్ఫూర్తి
కన్న తల్లిదండ్రులు చదువు లేని వారు కావడంతో లక్ష్మికి చదువులో ఏ సాయమూ చేయలేకపోయేవారు. ఆరవ తరగతి నుంచి కొత్తగూడెం గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న లక్ష్మికి పిన్ని సుమలత స్ఫూర్తిగా నిలిచింది. డిగ్రీ చదువుకున్న సుమలత హాస్టల్‌లో ఉన్న లక్ష్మిని తరచూ కలుస్తూ చదువు విలువ చెబుతూ వచ్చింది. డబ్బుకు విలువ ఇవ్వని వారు కూడా చదువుకు విలువ ఇస్తారని తెలిపింది. సెలవుల్లో ఇంటికి తీసుకువచ్చి లక్ష్మి మంచి చెడ్డలు చూసేది. ఆమె మాటలు లక్ష్మి మనసులో నాటుకుపోయాయి. ‘ఏ రోజూ కూడా రాత్రి ఒంటి గంట లోపు లక్ష్మి పుస్తకం మూయగా చూడలేదు’ అని లక్ష్మి బాబాయ్‌ రవి తెలిపాడు.

గురుకుల పాఠశాలలో
కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో దాదాపు వేయి మంది అమ్మాయిలు 6 నుంచి ఇంటర్‌ వరకూ చదువుతున్నారు. ప్రిన్సిపాల్‌ దేవదాసు, ఉపాధ్యాయులు వీరి చదువు మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు. చురుకైన విద్యార్థినులను ఎంపిక చేసి జె.ఇ.ఇలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్‌లో ఎం.పి.సి తీసుకున్న లక్ష్మి 992 మార్కులు సాధించింది. దాంతో ఇంకా ఉత్సాహంతో జె.ఇ.ఇకి ప్రిపేర్‌ అయ్యింది. జె.ఇ.ఇ అడ్వాన్స్‌డ్‌లో 1371వ ర్యాంకు సాధించింది. పాట్నా ఐ.ఐ.టిలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో మొన్నటి ఆగస్టు మొదటివారంలో సీటు  పొందింది. గురుకుల పాఠశాల నుంచి ఈ ఘనత సాధించిన అమ్మాయి లక్ష్మీ.

ఐ.ఏ.ఎస్‌ చేయాలని...
బాగా చదువుకుని ఐ.ఏ.ఎస్‌ చేయాలనేది తన లక్ష్యమని కొర్సా లక్ష్మి చెప్పింది. జె.ఇ.ఇలో మంచి ర్యాంకు సాధించి ఐ.ఐ.టిలో సీటు పొందడంతో ఐ.టి.డి.ఏ అధికారులు లక్ష్మిని ప్రశంసించారు. ట్యాబ్‌ ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. లక్ష్మి ఇంత బాగా చదవడంతో ఇంకా కొంతమంది ఆమె చదువును ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. ఆ ప్రోత్సాహం వల్ల లక్ష్మి ఐ.ఏ.ఎస్‌ చదివి పేద వర్గాల కోసం పని చేయాలని నిశ్చయించుకుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement