Femina Miss India 2023: Who Is 2nd Runner Up Strela Thounaojam, Know Her Inspiring Journey - Sakshi
Sakshi News home page

Femina Miss India 2023: వెక్కిరింతలు తట్టుకుని.. మూర్ఛ నుంచి మిస్‌ ఇండియా వరకు

Published Tue, Apr 18 2023 1:15 PM

Miss India 2023: 2nd Runner Up Strela Thounaojam Inspiring Journey - Sakshi

From Epilepsy to Pageant Triumph- Strela Thounaojam: రెండు రోజుల క్రితం ‘మిస్‌ ఇండియా 2023’ ఫైనల్స్‌ జరిగాయి. రాజస్థాన్‌ సుందరి నందిని గుప్తా విజేత. ఢిల్లీకి చెందిన శ్రేయా పూజా ఫస్ట్‌ రన్నరప్‌. కాని మణిపూర్‌ అమ్మాయి స్టెర్లా లువాంగ్‌ సెకండ్‌ రన్నరప్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది.

మణిపూర్‌ నుంచి మిస్‌ ఇండియా ఫైనల్స్‌ వరకూ చేరిన వారు ఇప్పటి దాకా లేరు. అదీగాక టీనేజ్‌లో మూర్ఛవ్యాధి వల్ల తీవ్రంగా బాధ పడిన స్టెర్లా తన అందాల కల కోసం ఆ వ్యాధితో పోరాడి గెలిచింది. స్ఫూర్తిగా నిలిచింది.

టీనేజ్‌లో మూర్ఛ వ్యాధి
‘అది నా భవిష్యత్తుకు అడ్డంకి అనుకోలేదు. ఒక ఆశీర్వాదం అనుకున్నాను’ అంది టీనేజ్‌లో మూర్ఛ వ్యాధి బారిన పడ్డ స్టెర్లా. ‘అడ్డంకులు వస్తేనే కదా మనం పోరాడి మరింత శక్తిమంతులం అయ్యేది’ అందామె.

అతి చిన్న రాష్ట్రం నుంచి మొదటిసారి
ఇప్పుడు స్టెర్లా మణిపూర్‌లో క్షణం తీరిక లేకుండా జనం అభిమానంతో ఇస్తున్న విందుల్లో పాల్గొంటోంది. సీఎం ఆమెను ఆహ్వానించి ప్రభుత్వ పెద్దలతో కలిసి డిన్నర్‌ ఇచ్చాడు. కారణం మణిపూర్‌లాంటి అతి చిన్న రాష్ట్రం నుంచి మొదటిసారి ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో ఒకరుగా ఆమె నిలవడం.

ఏప్రిల్‌ 15న ఇంఫాల్‌లో జరిగిన ‘మిస్‌ ఇండియా 2023’ ఫైనల్స్‌లో 28 రాష్ట్రాలు 2 కేంద్ర ప్రాంతాల నుంచి 30 మంది పోటీ పడితే వారితో తలపడి మూడో స్థానంలో నిలిచింది స్టెర్లా. అయితే ఈ విజయం అంత ఈజీగా రాలేదు. మానసికంగా ఆరోగ్యపరంగా ఆమె చాలా పోరాటం చేయాల్సి వచ్చింది.

వెక్కిరింతలు తట్టుకుని
14 ఏళ్ల వయసులో స్టెర్లాకు మిస్‌ ఇండియా కావాలన్న లక్ష్యం ఏర్పడింది. కాని ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎవరూ అలాంటి కలను కనరు. ఇంకా చెప్పాలంటే ‘నిర్వచనాల ప్రకారం ఉండే ముక్కు, రూపు’ వారికి లేవన్న భావన వారిలో బలంగా ప్రవేశపెట్టి చాలా కాలం అవుతోంది.

అందుకే అందరూ ఏడ్పించేవారు స్టెల్లాను. అది వొత్తిడిగా మారి ఆ తర్వాత నరాల జబ్బుగా పరిణమించింది. తరచూ మూర్ఛలు వచ్చేవి. ఒక్కోసారి మంచానికి అతుక్కు పోయేదాన్ని. అలాంటి స్థితిలో కూడా ఇదంతా దాటుతాను... నాకో అందమైన భవిష్యత్తు ఉంటుంది అని గట్టిగా అనుకునేదాన్ని. అదే నిజమైంది. ఇవాళ నా జబ్బును జయించాను. ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను’ అంటుందామె.

క్యాబిన్‌ క్రూగా పని చేసి
బిజినెస్‌ స్టడీస్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కొనసాగిస్తూనే మోడల్‌గా పని చేస్తోంది స్టెల్లా. కొంతకాలం ఒక ఎయిర్‌ లైన్స్‌ సంస్థలో క్యాబిన్‌ క్రూగా చేసింది. ‘ఇంతకు ముందు అందం నిర్వచనం వేరే ఉండేది. ఇప్పుడు సహజ రూపాలను కూడా అందంగా చూస్తు్తన్నారు. అందుకే నేను టాప్‌ 3గా నిలిచానని అనుకుంటున్నాను.’ అంది స్టెర్లా.  

చదవండి: 1994లో తెల్లవెంట్రుకలను నల్లగా చేసే హెర్బల్‌ మందు కనిపెట్టాం! ఇప్పుడిలా..

                                                                                              

Advertisement
Advertisement