ఆ శబ్దం వారికే వినిపిస్తుంది, వెంటాడుతుంది! వేలల్లో కేసులు నమోదు! | Mysterious Stories In Telugu: The Hum The Hears Have You Ever Heard This Terrible Sound - Sakshi
Sakshi News home page

మిస్టరీ: మీరెంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట!

Published Sun, Mar 24 2024 1:58 PM

Mistory: The Hum The Hears Have You Ever Heard This Terrible Sound - Sakshi

మీరెప్పుడైనా రాత్రి పూట చెవి చుట్టూ దోమ తిరగడం గమనించారా? అది తిరిగిన కాసేపు చిర్రెత్తుకొస్తుంది. లైటు వేసి దాన్ని చంపేదాకా నిద్రపట్టదు. కానీ ప్రపంచంలో చాలామందికి ఓ విచిత్రమైన కొత్తశబ్దాన్ని.. అసంబద్ధంగా వింటూ.. నిద్రకు దూరమవుతున్నారట. లైట్‌ తీసినా, వేసినా.. మెలకువగా ఉన్నా.. నిద్రపోయినా.. పోనీ ఆ చోటుని వదిలి ఎంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. వారు వినే ఆ శబ్దం.. తమ వెంట ఉన్నవారికి కూడా వినిపించకపోవచ్చు. అదే ‘ది హమ్‌’ మిస్టరీ. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఈ కేసులు వేలల్లో నమోదయ్యాయి.

శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య అస్పష్టమైన ఓ అలికిడి ఉంటుందని.. రాత్రివేళ దాన్ని స్పష్టంగా వింటున్నామని చెప్పే వాళ్లే ఈ మిస్టరీకి సృష్టికర్తలు. వీరిని ‘ది హియర్స్‌’ అంటారు. సాధారణంగా మనిషి చెవులు.. 20 ఏ్డ (తక్కువ పిచ్‌) నుంచి 20 జుఏ్డ (అత్యధిక పిచ్‌) మధ్య ఫ్రీక్వెన్సీలను గ్రహిస్తాయి. కానీ ‘ది హియర్స్‌’ మాత్రం తమకు ఇంకాస్త తక్కువ ఫ్రీక్వెన్సీలో అస్పష్టమైన నాయిస్‌ వినిపిస్తోందని వాదిస్తారు. వారు వినే శబ్దాన్ని.. అతి తక్కువ–ఫ్రీక్వెన్సీ హమ్మింగ్‌లా, రంబ్లింగ్‌ (దూరంగా ఉన్న పెద్దపెద్ద వాహనాల నుంచి వచ్చే ప్రతిధ్వని) నాయిస్‌గా భావించారు నిపుణులు. ప్రశాంతమైన నగరాల్లో, పల్లెటూళ్లలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ హమ్మింగ్‌కి బ్రిస్టల్‌ హమ్, టావోస్‌ హమ్, విండ్సర్‌ హమ్‌ వంటి పలు పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి.

బ్రిస్టల్‌ హమ్‌..
ఇంగ్లాడ్‌లోని బ్రిస్టల్‌లో 1970లో తొలి కేసు నమోదైంది. అక్కడి నివాసితులు కొందరు.. రాత్రి పూట ఏదో శబ్దం నిద్రకు భంగం కలిగిస్తోందని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. మొదట్లో ఈ హమ్‌ సమీపంలోని ఫ్యాక్టరీలు, ఎలక్ట్రిక్‌ పైలాన్‌లు కారణం అయ్యి ఉండొచ్చని భావించారట. అయితే మరికొందరు నివాసితులు.. ఆ శబ్దాలన్నీ గ్రహాంతర అంతరిక్ష నౌకల నుంచి వస్తున్నాయని భావించారు. ఇంకొందరైతే.. రహస్య సైనిక చర్యల్లో భాగం కావచ్చని నమ్మారు. అయితే చాలామంది ఈ హమ్‌ ఈ లోకానికి చెందినది కాదని, మరో లోకానికి సంబంధించిందని ప్రచారం చేశారు. కొన్ని నెలలకు ఆ హమ్‌ హఠాత్తుగా ఆగినట్లే ఆగి.. బ్రిట¯Œ లోని ఇతర ప్రదేశాలకు వినిపించడం మొదలైంది. అదే హమ్‌ని ఇప్పటికీ చాలామంది వింటూనే ఉన్నారట.

టావోస్‌ హమ్‌..
ఇక అమెరికాలోని న్యూ మెక్సికోలో 1990లో ఈ హమ్‌ ఫిర్యాదులు మొదలయ్యాయి. అయితే ఈ హియర్స్‌ ఒకే రకమైన శబ్దాన్ని వినడం లేదని అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరూ ఒక్కో ప్రత్యేకమైన శబ్దాన్ని వింటున్నట్లు వివరించడం మొదలు పెట్టారు. దాంతో శాస్త్రవేత్తలు వారు నివేదించిన శబ్దాలను వినేందుకు.. వారి వారి ఇళ్లల్లో.. ప్రత్యేకమైన పరికరాలను కూడా అమర్చారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. శాస్త్రవేత్తలకు ఎలాంటి అసాధారణ కంపనాలు చిక్కలేదు.

విండ్సర్‌ హమ్‌..
ఇంగ్లాడ్‌లోని విండ్సర్‌లో వినిపించే ఈ హమ్‌.. మొదటిగా ఎప్పుడు గుర్తించారో తెలియదు కానీ.. 2012 నుంచి ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. విన్నవారంతా ఇది ఎక్కువ సేపు వినిపిస్తోందని.. బిగ్గరగా వినిపిస్తోందని వాపోతుంటారు. ఈ శబ్దం కిటికీలను కదిలిస్తోందని.. పెంపుడు జంతువుల్ని భయపెడుతోందని ఆరోపించారు. ఇది మానసికస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని మొరపెట్టుకు న్నారు. ఈ శబ్దాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు చేసినా.. ఆ శబ్దం వారిని వెంటాడుతూనే ఉందట. ఈ హమ్‌ కేసులో స్త్రీ పురుషులు సమానంగా ఇబ్బంది పడుతున్నారు.

కొందరు ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలు.. తాము హమ్‌ కేసును పరిష్కరించామని.. అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసునని చెప్పారు. పెద్ద పెద్ద అలల కారణంగా సముద్రపు అడుగుభాగం కంపించడమే ఈ హమ్మింగ్‌కు మూలమని ప్రకటించారు. అయితే ఆ వాదనను మరికొందరు శాస్త్రవేత్తలు ఖండించారు. సముద్రం లేని చోట కూడా ఇలాంటి ధ్వనులు వినిపిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయంటూ కొట్టిపారేశారు.

ఇది ఒక మానసికమైన సమస్య అని కొందరు వైద్యులు చెబితే.. ఇది దూరంగా నడిచే ట్రాఫిక్‌ నుంచి కానీ, విమానాశ్రయాల నుంచి కానీ, నౌకాయానాల నుంచి కానీ, గాలి మరల నుంచి కానీ కావచ్చు అని కొందరు నిపుణులు అంచనా వేశారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ఈ శబ్దానికి మిడ్‌షిప్‌మ్యాన్‌ ఫిష్‌ లేదా టోడ్‌ ఫిష్‌లు కారణం కావచ్చని భావించారు. ఈ చేపలు తన సహచరిని సంభోగానికి పిలుపునిచ్చినప్పుడు కొన్నిసార్లు చిన్నగానే హమ్మింగ్‌ చేస్తాయి కానీ.. కొన్నిసార్లు చాలా పెద్దగా ఎక్కువ సేపు హమ్మింగ్‌ చేస్తుంటాయట. అది సుమారు గంట ప్రక్రియ అని.. ఆ శబ్దాలే.. ఈ హియర్స్‌ చెవిన పడుతున్నాయని వాదించారు.

మరోవైపు ఈ హమ్మింగ్‌ బాధితులకు కేవలం ఒత్తిడి, ఆందోళనల వల్లే అలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయని ఇంకొందరు శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు. ఏది ఏమైనా ఈ హమ్‌(శబ్దం) ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వినిపిస్తోంది? అనేది వినేవాళ్లకు కూడా తెలియకపోవడంతో మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన

ఇవి చదవండి: ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..

Advertisement

తప్పక చదవండి

Advertisement