Sakshi News home page

జలుబు, దగ్గు, గొంతు నొప్పి వేధిస్తున్నాయా?

Published Tue, Jan 30 2024 4:36 PM

Natural and home Remediesfor cold and Cough  - Sakshi

వాతావరణం కొద్దిగా మారిందంటే చాలు  జలుబు,  దగ్గు, గొంతు నొప్పి  చుట్టుముడతాయి.  చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ సీజనల్‌ వ్యాధుల బారిన పడతారు. ముఖ్యంగా   జలుబు,  దగ్గు ఒక్క పట్టాన తగ్గదు. దీనికి తోడు   చాలా నీరసం, అలసట.  అయితే సాధారణ జలుబు, దగ్గును చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. యాంటీ బయాటిక్స్ అవసరాన్ని దాదాపు నివారించవచ్చు.

సాధారణ జలుబును వైద్యపరంగా వైరల్ ఇన్ఫెక్షన్ లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటారు. జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు కనిపించే మరో లక్షణం దగ్గు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలను దాదాపు  వంట ఇంట్లోని దినుసులతోనే తగ్గించు కోవచ్చు. అల్లం, తులసి, వాము ఆకులతో కషాయాన్ని చేసుకొని, కొద్దిగా తెనె కలుపుకుని తాగవచ్చు.  అలాగే  వేడి పాలల్లో  సేంద్రీయ పసుపు  కలుపుకొని తాగవచ్చు.

 నల్ల మిరియాల టీ
నల్ల మిరియాల్లో విటమిన్ సి కూడా సమృద్ధిగా  ఉంటుంది. ఇది సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కనుక నల్ల మిరియాలు, బెల్లం, నాలుగు తులసి ఆకులు వేసుకొని  టీ కాచుకొని తాగవచ్చు.

అలాగే ధనియాల కషాయం కూడా. ఇది చేసుకోవడం చాలా సులభం కూడా. మరి ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటో తెలుసు కుందాం.

ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ వాము, జీల కర్ర, యాలకులు, ఐదు లవంగాలు, ఐదు మిరియాలు, అర టీ స్పూన్ శొంఠి పొడి, చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని తడి లేని మిక్సీ జార్‌లో మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలి. ఈ పౌడర్‌ని ఓ గాజు సీసాలో భద్ర పరుచుకోవాలి.

తయారీ విధానం
ఒక గిన్నెలో  ఒక గ్లాసు నీళ్లు  తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ పొడిని వేయాలి. ఇలా ఐదు నుంచి 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ మిశ్రమానికి ఒక స్పూన్ తేనె కలుపు కోవచ్చు. దీన్ని వేడి, వేడిగా తాగాలి.  దీంతో ముక్కు దిబ్బడ తగ్గి శ్వాస సాఫీగా అవుతుంది.  వాస్తవానికి తేనె దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే వాతావరణం మార్పుల ద్వారా వచ్చే వ్యాధులు ఉంచి ఉపశమనం మాత్రమే కాదు,  రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.   ఈ హోమ్ టిప్స్ వల్ల ప్రయోజనాలే కానీ సైడ్ ఎఫెక్ట్స్  పెద్దగా ఉండవు. 

ఆవిరి పట్టడం
యూకలిప్టస్ లేదా  రోజ్‌మేరీ ఆయిల్‌ లేదా కాస్తంత పసుపు వేసి,  బాగా  కాగిన వేడి నీటి ఆవిరి పడితే మంచిది. సుమారు 10-15 నిమిషాలు పాటు స్టీమ్‌  పడితే  గొంతులోని కఫం కరిగి, గొంతు నొప్పితోపాటు,  దగ్గు కూడా తగ్గుతుంది. రోజుకు రెండు సార్లు ఇలా ఆవిరి పట్టవచ్చు.  

నోట్‌: జలుబు ఏమాత్రం తగ్గకుండా, దగ్గు మరీ ఎక్కువగా వేధిస్తుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. లేదంటే ఒక్కోసారి ఈ ఇన్ఫెఫెక్షన్‌ ఇతర భాగాలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. 
 

Advertisement

What’s your opinion

Advertisement