మంచి మాట.. అంతరంగ జ్ఞానం అంటే..?

14 Feb, 2022 03:32 IST|Sakshi

ఈ భౌతిక ప్రపంచంలో మనసు ద్వారానే మనం జీవితం కొనసాగిస్తున్నాÆ.. మనసే మనిషికి ఆధారం. మనసు లేకుండా మనిషి జీవితం, జీవన విధానం కూడా లేదు. అలాగని మనస్సుతో కుస్తీ పడవలసిన పని లేదు. మన మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది.

ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనసు నియంత్రణ చేయలేని విధంగా అంతులేని ఆలోచనలతో నిండి ఉంది. వీటితో మనల్ని మనం గుర్తించు కుంటున్నాం. అయితే అది సరికాదు... మనస్సు ఎప్పుడూ స్వచ్ఛంగా... నిర్మలంగా ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం.

మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. ఇది విడిచి పెట్టిన క్షణాన మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. మీ మనస్సులో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది.

వ్యతిరేకించేది ఏదైనా మనసులో బలపడుతుంది. అది మనస్సుని బలహీనపరుస్తుంది. స్వీకరించేది ఏదైనా శక్తిని పెంచుతుంది. మనస్సు ఈ భౌతిక ప్రపంచంతో పెనవేసుకున్న సమాచారం వస్తుంది. ఈ సమాచారంలో అనుకూలమైనది, ప్రతికూలమైనది రెండూ ఉంటాయి. మనిషి జ్ఞానపరంగా ఎదగనపుడు ప్రతికూలమైన దానికి భయపడతాడు, తనకు అనుకూలమైన దానిని ఆశిస్తాడు. కానీ పరిపూర్ణమైన జ్ఞాని అనుకూలమైన వాటిని, ప్రతికూలమైన వాటి సమాచారాన్ని వదిలేస్తాడు. ప్రతికూలమైన దానిని వ్యతిరేకిస్తే అది మన అంతరంగమందు బలపడుతుంది. అనుకూలమైన దానికి స్పందిస్తే అది అందకపోతే అసంతృప్తి కలుగుతుంది.

జ్ఞాని అంతరంగం ఎప్పుడూ స్వచ్ఛంగా నిర్మలం గా ఉండాలి. అనుకూల ప్రతికూల విషయాలు రెండు లేనప్పుడు మనస్సు ఖాళీ (శూన్య) స్థితి ఏర్పడి నిర్మలత ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమా అంటే సాధన ద్వారా ఏదైనా సాధ్యమేనంటారు మహానుభావులు, సిద్ధపురుషులు. వారు దానిని తమ సాధన ద్వారా నిరూపించి చూపారు కూడా.

మనం ఈ భౌతిక ప్రపంచంలో అందరి మధ్య అందరిలో ఉండాలి కానీ వాస్తవ పరిస్థితిని జ్ఞానంతో నిరంతరం విశ్లేషించాలి. భావోద్వేగాలకు తావులేకుండా సంఘటనలు వాటంతట అవే జరుగుతుంటాయి వెళుతుంటాయి కానీ మనం భావోద్వేగాలకు లోనుకారాదు. బాహ్యంగా కనిపించేది వినిపించేది వాస్తవం కాదు, దాని వెనుక వేరే ఉంటుంది. జ్ఞాని దానిని కనిపెట్టగలగాలి.

అదే అజ్ఞాని అయితే ఫలితం వచ్చిన తర్వాత బాధపడతాడు. మన విచక్షణతో ఏది చేయాలో అది చేయాలి, ఏమి చెయ్యకూడదో అది చేయకూడదు. ఈ ప్రకృతిలో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎలా ఉండకూడదో అలా ఉండకూడదు అనే విచక్షణ జ్ఞానంతో మెలగాలి. జ్ఞానం వచ్చేవరకూ అన్ని గమనిస్తూ  ఫలితం ఆశించకుండా ఏమి జరుగుతుందో గమనిస్తూ ప్రయాణం చేయాలి. ఇది ఏమీ సామాన్యమైన విషయం కాదు.

 రకరకాల మనుషుల మధ్య జీవిస్తున్నప్పుడు ప్రతి ఎదుటి వ్యక్తి తనలాగే అందరూ జీవించాలి తన మాటే వినాలి అనుకుంటాడు. అది తప్పు. ముందుగా నీ దృష్టిని సరి చేసుకోవాలి.
ఇది చదువుతున్నప్పుడు చాలా అనుమానాలు రావాలి వాటికి మీ అంతరంగం నుండే జవాబులూ రావాలి. అలా సంతృప్తికరమైన సమాధానం వచ్చినప్పుడు మనసు తేలిక అవుతుంది. సందేహాలు లోపల ఉంటే మనస్సు భారమవుతుంది. విశ్లేషణతో విచారణ ఎవరు చేస్తారో వారికి అద్భుతమైన ఫలితం వస్తుంది.

 ఎవరు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా గుడ్డిగా నమ్మరాదు. అనుభవం పొంది సత్యాన్ని గ్రహించాలి. అనుభవంలోకి వచ్చి సత్యంగా మారిన నాడు అది మార్పు చెందే అవకాశమే లేదు. సిద్ధాంతపరంగా స్పష్టత ఉంటే ఆ అనుభవం సులభమవుతుంది.

సమదృష్టితో – సత్యదృష్టితో ప్రపంచాన్ని చూస్తూ ఉండటం తో క్రమంగా మన మనస్సు ప్రశాంతమవుతుంది. అప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుంది. నిజంగా ఈ ప్రపంచం ఎంతో ఆకర్షణీయమైనదిగా కనిపిస్తుంది. సుఖాన్నిచ్చేదిగా కనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. ఆ నిజం తెలిస్తే ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు చూస్తే మనలో వస్తువులపై గాని, విషయాలపై గాని, భోగాలపై గాని ఏ విధమైన కోరికగానీ, వ్యామోహం గానీ లేకుండా తటస్థంగా ఉండగలుగుతాం. అలా ఉన్నప్పుడు మనస్సులో కోరికల వత్తిడి లేకపోవటాన్ని గమనించవచ్చు. ఎటువంటి ఆందోళన లేకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

ఈ ప్రపంచాన్ని మనం రాగద్వేషాలనే రంగుటద్దాల నుండి చూస్తున్నాం. కొన్నింటిపై రాగం – కొన్నింటిపై ద్వేషం. బుద్ధిలో ఈ రాగద్వేషాలుంటే వస్తువులు ఉన్నవి ఉన్నట్లు కనిపించవు. మనకు ఇష్టమైన వ్యక్తి ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా, అందవిహీనంగా ఉన్నా మనకు బాగానే ఉంటాడు. అదే ఇష్టం లేని వ్యక్తి ఎంత బాగా మాట్లాడినా – ఏమి అన్నా వాటిల్లో నుండి తప్పులను వెతుకుతాం. కనుక ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటమే సత్య దర్శనం అంటారు. అటువంటి నిష్ఠలోనే నిరంతరం ఉండాలి.

– భువనగిరి కిషన్‌ యోగి

మరిన్ని వార్తలు