జంగిల్‌ రాణి..పద్మిని మాఝీ: అడవిని చేరాలంటే ఆమెను దాటాలి | Sakshi
Sakshi News home page

జంగిల్‌ రాణి..పద్మిని మాఝీ: అడవిని చేరాలంటే ఆమెను దాటాలి

Published Tue, Feb 28 2023 5:13 AM

Odisha Jungle Rani is protecting 100 hectares of forest - Sakshi

చేత గొడ్డలి కళ్లల్లో తీక్షణత ‘అడవికి నేను కాపలా’ అనే ప్రకటన. 65 ఏళ్ల పద్మిని మాఝీ ఒరిస్సాలో తన పల్లె చుట్టూ ఉన్న 100 హెక్టార్ల అడవిలో పుల్ల కూడా పోకుండా ఒక్క కొమ్మా తెగి పడకుండా కాపలా కాస్తోంది. కలప మాఫియా ఆమె దెబ్బకు తోక ముడిచింది. అందుకే ఆమెను ఆ ప్రాంతంలో జంగిల్‌ రాణి అని పిలుస్తుంటారు.

ఉదయం ఆరూ ఆరున్నరకంతా పద్మిని మాఝీ ఇంటి పనులన్నీ అయిపోతాయి. ఆ తర్వాత ఆమె తన అసలైన ఇంటికి బయలుదేరుతుంది. అంటే దాపున ఉన్న అడవికి. అదే ఆమె రోజంతా గడిపే ఇల్లు. ఒరిస్సాలోని నౌపడా జిల్లాలో బిర్సింగ్‌పూర్‌ అని చిన్న పల్లె ఆమెది.

ఆ పల్లెకు ఆనుకునే చిన్న కొండ. దాని చుట్టుపక్కల విస్తారమైన అడవి. అందులో చాలా విలువైన కలప చెట్లు, మందు మొక్కలు, అడవి పళ్లు అన్నీ దొరుకుతాయి. ‘మేము అడవి మీద ఆధారపడి బతుకుతాము. అడవిని నరికి, అడవిలో ఉండే జంతువులను చంపి కాదు’.. అంటుంది పద్మిని.

కిరాసాగర్‌ మాఝీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ముప్పై ఏళ్ల క్రితం ఆ అడవి పక్క ఊరికి కోడలిగా వచ్చింది పద్మిని. అడవికి వెళ్లి వంట చెరుకు, తేనె, దుంపలు... ఇవన్నీ తెచ్చుకుని బతకడం తొందరగా నేర్చుకుంది. ‘కాని అడవిలో ఆ రోజుల్లో కలప దొంగలు విచ్చలవిడిగా తిరిగేవారు.

వేటగాళ్లు ఉండేవారు. వారి వల్ల అడవి నాశనమవుతోందని నాకు అర్థమైంది. అడవి పచ్చగా ఉంటే మేము పచ్చగా ఉంటాము. అడవి ఉంటేనే వానలు పడతాయని మా నాన్న నా చిన్నప్పుడు చెప్పేవాడు. అందుకే అడవిని కాపాడాలనుకున్నా’ అంటుందామె.

తనకు తానుగా వేసుకున్న ఈ డ్యూటీని పాతికేళ్లు గడిచినా ఆమె వదల్లేదు. రోజూ ఉదయం ఆరున్నరకంతా భుజాన గొడ్డలి వేసుకొని అడవిలోకి బయలుదేరుతుందామె. పుట్టి బుద్ధెరిగాక ఆమె చెప్పులు వేసుకోలేదు. ఇన్నాళ్లుగా ఆమె అడవిలో ఉత్త పాదాలతోనే తిరుగుతుంది. అడవిలోని ప్రతి అడుగు తెలిసినవారే ఉత్త పాదాలతో తిరగ్గలరు.

అడవిని ఆమె ఐదారు భాగాలుగా చేసుకుంది. ఒకోరోజు ఒకో భాగంలో తిరుగుతుంది. దారిలో తనకు కనపడిన ఎండుపుల్లల్ని ఒకచోటకు చేరుస్తుంది. అడ్డంగా ఉన్న కొమ్మలను, తీగలను కొట్టి దారి చేస్తుంది. నిన్న ఉన్న అడవే ఇవాళా ఉందా అని చెక్‌ చేస్తుంది. ఇక పరాయి వ్యక్తి ఎవరైనా కనిపించాడో గొడ్డలి చేతికందుకుంటుంది.

‘మొదట వాణ్ణి భయపెడతాను. నన్ను చూడగానే చాలామంది పారిపోతారు. అడ్డం తిరిగితే పెద్దగా అరిచి సాయం వచ్చేలా చేస్తాను. ఊరి వాళ్లు ఎవరో ఒకరు అడవిలో తిరుగుతూనే ఉంటారు. వారొచ్చి పట్టుకుంటారు. ఊర్లోకి తీసుకెళ్లి వాణ్ణి కట్టేస్తాం.

వాడు క్షమాపణలు చెప్పి మళ్లీ అడవి ముఖం చూడను అని ప్రమాణం చేస్తే వదిలేస్తాం. అడవిలో రోజూ నేను తిరుగుతానని ఎదురు పడతానని కలప దొంగలకు, వేటగాళ్లకు తెలిసిపోయింది. అందుకే రావడం మానేశారు. మా అడవి మాకు మిగిలింది’ అంటుంది పద్మిని.

ఇన్నేళ్లుగా ఆమె ఒక పైసా ఎవరి నుంచి ఆశించకుండా, ఏ జీతం తీసుకోకుండా ఈ పని చేస్తున్నందు వల్ల ఊళ్లో పద్మిని అంటే చాలా గౌరవం. ఆమెను జంగిల్‌ రాణి అని పిలుస్తారు. ఫారెస్ట్‌ రేంజర్లు, గార్డులు ఆమె కనిపిస్తే గౌరవంగా మాట్లాడతారు. ‘నాకు జీతం ఎందుకు? ఇది ప్రతి మనిషి బాధ్యత’ అంటుంది మాఝీ.

ఈ అడవి పచ్చగా ఉండటం వల్ల వీకెండ్స్‌లో విహారానికి వచ్చేవారి సంఖ్య ఎక్కువ. వారి ఆనందానికి కారణం ఒక బక్కపలుచని ఆదివాసి మహిళ అని వారికి తెలియకపోవచ్చు. ఇలాంటి తెలియని మహానుభావుల వల్లే మన దేశంలో ప్రకృతి ఈ మాత్రమైనా మిగిలి ఉంది. ఇలాంటి స్పూర్తిదాయక కథలు ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.  పద్మిని మాఝీతో పాటు ఆమెలాంటి మహిళా మణులందరికీ ముందుగానే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!! 
 
నన్ను చూడగానే చాలామంది పారిపోతారు. అడ్డం తిరిగితే పెద్దగా అరిచి ఊరివాళ్లు సాయం వచ్చేలా చేస్తాను. ఊర్లోకి తీసుకెళ్లి వాణ్ణి కట్టేస్తాం. వాడు క్షమాపణలు చెప్పి మళ్లీ అడవి ముఖం చూడను అని ప్రమాణం చేస్తే వదిలేస్తాం.

Advertisement
Advertisement