The Power of Organ Donation to Save Lives Through Transplantation - Sakshi
Sakshi News home page

Organ Donation: అలా చేయండి!.. మరణించినా మరోసారి జీవించే అరుదైన అవకాశం..!

Published Sun, Aug 13 2023 12:25 PM

The Power of Organ Donation To Save Lives  - Sakshi

మనిషికి ఒకటే జన్మ.. అదే మనిషి అవయవాలకు మాత్రం రెండు జన్మలు.  అవయవదానం చేస్తే మరణించినా మరోసారి జీవించే అవకాశం ఉంది. ఒక్క మనిషి చనిపోతే గుండె, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చేతులు, ముఖం, కణజాలం, ఎముకమజ్జ, మూలకణాలు దానం చేసి మరో 8 మంది ప్రాణాలు కాపాడొచ్చు.

దేశంలో మరణాల సంఖ్య అధికంగా ఉన్నా.. అవయవదాతలు ఆ స్థాయిలో ఉండడం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువుల ఆలోచనలు, ఆచారాలు, కట్టుబాట్లు, అవగాహన రాహిత్యంతో చాలామంది ముందుకు రావడం లేదు. 18ఏళ్లు దాటినవారు ఆర్గాన్స్‌ డొనేట్‌ చేయొచ్చు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ప్రాణం పోసిన.. దాతల సహకారంతో  బతుకుతున్న వారిపై..

అన్నకు తమ్ముడి కిడ్నీ 
సిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్‌రెడ్డి(53) రైతు. షటిల్‌ ఆడేవాడు. ఉన్నట్టుండి వాంతులయ్యా యి. ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీలు ఫెయిలయ్యాయని వైద్యులు నిర్ధారించారు. డయాలసిస్‌కు నెలకు రూ.40వేల నుంచి రూ.60వేల వరకు ఖర్చయ్యాయి. మూడు నెలలు గడిచాయి. విజయేందర్‌రెడ్డిని ఆస్పత్రిలో ఆ స్థితిలో చూసిన అతని తమ్ముడు జితేందర్‌రెడ్డి(50) తన రెండు కిడ్నీల్లో ఒకటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. హైదరాబాద్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ అయింది. మృత్యువు ముంగిట అసహాయంగా నిల్చున్న అన్నకు ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది. విజయేందర్‌రెడ్డి ప్రస్తుతం జిల్లెల్లలో వ్యవసాయం, తమ్ముడు జితేందర్‌రెడ్డి
హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

తొలి డోనర్‌ లక్ష్మి
సిరిసిల్లకల్చరల్‌: సిరి సిల్లలోని గాంధీనగర్‌కు చెందిన ఇప్పనపల్లి నారాయణ, లక్ష్మి దంపతులు. మిర్చి బండి పెట్టుకుని జీవించేవారు. 12 ఏళ్లక్రితం పనులు ముగించుకుని ఇంటికెళ్లారు. అర్ధరాత్రి దాటాక విపరీతమైన తలనొప్పితో లక్ష్మి కింద పడిపోయింది. ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చేర్పించారు. ఆమె బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అవయవదానంపై అవగాహన కల్పించారు. ఆమె కుమారులు సంతోష్, రమేశ్‌ అంగీకారం మేరకు లక్ష్మి ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, మూత్రపిండాలు సేకరించి నలుగురు వ్యక్తులకు అమర్చారు. జిల్లాలోనే తొలి అవయవ దాతగా లక్ష్మి గుర్తింపుపొందారు.

తండ్రి.. భార్య ఇద్దరూ దాతలే
కోరుట్ల: తండ్రి.. భార్య ఇద్దరూ కిడ్నీ దాతలుగా నిలిచారు. కోరుట్లకు చెందిన గీత కార్మికుడు పోతుగంటి శ్రీనివాస్‌ 2017లో వెన్నునొప్పితో అవస్థ పడడంతో తండ్రి రఘుగౌడ్‌ వైద్యులతో పరీక్షలు చేయించాడు. శ్రీనివాస్‌కు కిడ్నీ సమస్య ఉందని తేలడంతో కలవరపడ్డాడు. వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయకతప్పదని చెప్పడంతో రఘుగౌడ్‌ తన కిడ్నీదానం చేశాడు. శ్రీనివాస్‌ ఆరోగ్యం కుదుటపడింది. ఐదేళ్ల తరువాత 2022లో మళ్లీ వెన్నునొప్పి మొదలైంది. మరోసారి పరీక్షించిన వైద్యులు మళ్లీ కిడ్నీ మార్పిడి చే యాల్సిందేనని చెప్పడంతో అతడి భార్య లావణ్య కిడ్నీ ఇచ్చింది. శ్రీని వాస్‌ తేరుకుని ప్రస్తుతం ఏ సమస్య లేకుండా తన పనులు తాను చేసుకుంటున్నాడు.

అవయవదాతల‘అబ్బిడిపల్లె’
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లె వాసులు మూకుమ్మడిగా అవయవదానానికి అంగీకరిస్తూ తీర్మానం చేశారు. సదాశయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అప్పటి కలెక్టర్‌ సంగీతకు లేఖ అప్పగించారు. అబ్బిడిపల్లెలో 600 జనాభా ఉంటుంది. సదాశయ ఫౌండేషన్‌ జిల్లా అధ్యక్షుడు భీష్మాచారి ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కల్పించగా.. సర్పంచ్‌ ఒజ్జ కోమలత ఆధ్వర్యంలో తీర్మానం చేసి శభాష్‌ అనిపించుకున్నారు.

మెడికల్‌ కాలేజీకి మృతదేహం
కోల్‌సిటీ: గోదావరిఖని శివాజీనగర్‌కు చెందిన దేవకి పార్థసారథి (85) తన మరణానంతరం అవయవాలు దానం చేస్తానని సదాశయ ఫౌండేషన్‌కు అంగీకార పత్రం రాసిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న అనారోగ్యంతో మృతి చెందగా.. కుటుంబసభ్యులు ఆమె నేత్రాలను ఐ బ్యాంక్‌కు, పార్థివదేహాన్ని రామగుండం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అప్పగించారు.



బతికుండగానే..
సారంగాపూర్‌: బీర్‌పూర్‌ మండలం కొల్వాయికి చెందిన పానగంటి స్వప్న(45) అంగన్‌వాడీ టీచర్‌. తాను చనిపోయాక తన అవయవాలు దానం చేయాలని భర్త నర్సయ్యతో చెబుతుండేది. తీవ్ర జ్వరంబారిన పడి చనిపోయిన ఆమె కోరిక మేరకు ఆమె రెండు కిడ్నీలు, గుండెను దానం చేశారు కుటుంబసభ్యులు.

నలుగురికి ప్రాణం
కోల్‌సిటీ: గోదావరిఖనిలోని ఎల్బీనగర్‌కు చెందిన మింగాని సంపత్‌(41) ఎమ్మెస్సీ, బీఈడీ చదివారు. ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీ డైరెక్టర్‌. 2019 జనవరి 14న రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లి మరణించారు. నలుగురికి లివర్, రెండు కిడ్నీలు, గుండె అమర్చారు. 

ఏడుగురికి పునర్జన్మ
కోల్‌సిటీ: తాను మరణించి మరో ఏడుగురికి పునర్జన్మిచ్చారు గోదారిఖనిలోని విద్యానగర్‌కు చెందిన సిరిసిల్ల ఇమానుయేల్‌(33). హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసే ఆయన 2019 జనవరి 3న బైక్‌పై ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వారంపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఆయన కుటుంబసభ్యులు ఆయన అవయవాలను దానం చేయగా.. ఏడుగురికి  పునర్జన్మ లభించింది. 

దేహదానానికి నిర్ణయం
కోల్‌సిటీ: గోదావరిఖని చంద్రబాబుకాలనీలో నివాసం ఉంటున్న మేరుగు లింగమూర్తి ఓసీపీ–3లోని బేస్‌ వ ర్క్‌షాప్‌లో ఆపరేటర్‌. ఎనిదేళ్ల క్రితం రెండు కిడ్నీలు చెడిపోయా యి. డయాలసిస్‌పై ఉన్న భర్త లింగమూర్తిని బతికించుకోవడానికి అతని భార్య విజయ తన కిడ్నీని దానంచేసింది. ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో తమ మరణానంతరం తమ దేహాలను మెడికల్‌ కాలేజీ 

కొడుకు కళ్లు సజీవం.. 
కోల్‌సిటీ: నా కొడుకు విజయ్‌పాల్‌రెడ్డి 2018 సెప్టెంబర్‌ 27న చనిపోయాడు. నేను, భార్య సుశీలతోపాటు నా కుటుంబ సభ్యులు దుఃఖంలో కూడా విజయపాల్‌రెడ్డి నేత్రాలను ఐ బ్యాంక్‌కు దానం చేశాం. నా భార్య, నేను కూడా మా మరణానంతరం నేత్రదానం చేస్తామని అంగీకారం తెలిపాం.  చనిపోయిన వారి అవ యవాలు మరికొందరికి ఉపయోగకరంగా ఉంటాయి. వారిలో మనవారిని చూసుకోవచ్చు.
– మారెల్లి రాజిరెడ్డి, యైంటింక్లయిన్‌కాలనీ, గోదావరిఖని 

తమ్ముడు తోడుండాలని..
కోరుట్లరూరల్‌: మాది మండలంలోని సంగెం. నాకు ఒక అన్న. ఇద్దరు తమ్ముళ్లు. చిన్న తమ్ముడు చీటి రాంచందర్‌రావుకు 18ఏళ్ల క్రితం అనారోగ్యంతో రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. డయాలసిస్‌ చేసినా ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్పారు. తమ్ముడిని కాపాడుకునేందుకు ఒక కిడ్నీ ఇచ్చా. కొంతకాలానికి తమ్ముడు అనారోగ్యంతో చనిపోయాడు. కిడ్నీ ఇచ్చిన నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. అన్ని పనులు చేసుకుంటున్నా. తమ్ముడే దక్కలేదు.
– చీటి మురళీధర్‌ రావు, సంగెం, కోరుట్ల

రాష్ట్రం మొదటిస్థానం
కోల్‌సిటీ: అవయవదానంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. మన రాష్ట్రం దేశంలో అవయవదానంలో మొదటిస్థానంలో నిలిచింది. గోదావరిఖని ప్రాంతంలో ఎక్కువ మంది ముందకు వస్తున్నారు. 2008లో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో పురుడుపోసుకున్న సదాశయ ఫౌండేషన్‌.. రాష్ట్రవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అవయవదాతల కుటుంబాలకు, స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి.  


– టి.శ్రవణ్‌కుమార్, సదాశయ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు

మా ఆయన్ను దక్కించుకోవాలని..
విద్యానగర్‌(కరీంనగర్‌): మా వారు వారాల ఆనంద్‌. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రíహీత. 2013లో ఆయనకు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. వారానికి మూడుసార్లు డయాలసిస్‌ ఏడాదిపాటు చేయించుకోవాల్సి వచ్చింది. ఆయన్ను దక్కించుకునేందుకు నేను ఒక కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యా. నా కిడ్నీని ఆనంద్‌కు 15 జూలై 2014లో ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. నా జీవితంలో ఆయన లేని లోటును ఊహించలేను. నాలో భాగమైన ఒక కిడ్నీ ఇచ్చి బతికించుకున్నాను. ఇప్పుడు నేను, మావారు పిల్లలతో ఆనందంగా ఉన్నాం.


– వారాల ఇందిరారాణి, గృహిణి, కరీంనగర్‌

కొడుకు ప్రాణం పోశాడు
వేములవాడ: మాది వేములవాడ. కొన్నేళ్లక్రితం లివర్‌వ్యాధి ఉండేది. ఆపరేషన్‌ చేసినా ఫలితం లేకపోయింది. నా కొడుకు మారుతి లివర్‌ నాకు సరిపోయింది. 17 నవంబర్‌ 2017న మారుతి లివర్‌లోని కొంతభాగాన్ని నా లివర్‌కు జతచేశారు. ఇప్పుడు ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం. నా కొడుకు లివర్‌ ఇచ్చి నాకు ప్రాణం పోశాడు.
– కుమ్మరి శంకర్, వేములవాడ 

Advertisement
Advertisement