వర్షాలలో  ఎలుకలతో  వచ్చే జబ్బు!  | Sakshi
Sakshi News home page

వర్షాలలో  ఎలుకలతో  వచ్చే జబ్బు! 

Published Sun, Jul 9 2023 8:13 AM

Rodent Borne Diseases During Monsoon - Sakshi

చినుకు రాలే కాలమిది. వానలతో నేల తడిసే సమయమిది. దాంతో బొరియల్లోని ఎలుకలు బయటకు వస్తాయి. ఆహారం కోసం.. మెతుకుల్ని వెతుక్కుంటూ కిచెన్‌లో ప్రవేశిస్తాయి. వర్షాలు ఎక్కువగా ఉండి, కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఎలుక కనిపించిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎందుకంటే. వాటి నుంచి వ్యాప్తిచెందే లెప్టోస్పైరా జాతికి చెందిన బ్యాక్టీరియాతో ఈ ఇన్ఫెక్షన్‌ వస్తుంది. చాలా సందర్భాల్లో పెద్దగా ప్రమాదం లేకపోయినా... కొన్నిసార్లు మాత్రం ప్రాణాంతకం అయ్యే ప్రమాదమూ ఉంది. మనం వర్షాకాలం ముంగిట్లో ఉన్న ప్రస్తుత సమయంలో ‘లెప్టోస్పైరోసిస్‌’ ఇన్ఫెక్షన్‌పై అవగాహన కోసం ఈ కథనం. 

లెప్టోస్పైరా ఇంటెరొగాన్‌ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఆరోగ్య సమస్య కాబట్టి దీనికి ‘లెప్టోస్పైరోసిస్‌’ అని పేరు. ఇది ఎక్కువగా ఎలుకలు,  కొన్ని పెంపుడు జంతువులైన కుక్కలూ, ఫామ్‌లలో పెంచే జంతువులతోనూ  వ్యాపిస్తుంది. దీన్ని ‘వీల్స్‌/ వెయిల్స్‌ డిసీజ్‌’ అని కూడా అంటారు. వ్యాప్తి ఇలా.. ఎలుకలు, ఇతర రోడెంట్స్‌ల (ఎలుక జాతికి చెందిన జీవుల) మూత్రవిసర్జనతో పొలాల్లోని నీరు కలుషితమవుతుంది. ఆ నీరూ, మట్టీ కలిసిన బురదలో పనిచేసేవారి ఒంటిపై గాయాలుంటే.. వాటి ద్వారా ఈ బ్యాక్టీరియా. మనిషి దేహంలోకి ప్రవేశించి లెప్టోస్పైరోసిస్‌ను కలుగజేస్తుంది.

అందుకే చేలలో పనిచేసే రైతులు, పశువుల డాక్టర్లు (వెటర్నేరియన్స్‌), అండర్‌గ్రౌండ్‌ సీవరేజ్‌ వర్కర్లు వంటి వాళ్లలో ఇది ఎక్కువ. కలుషితమైన చెరువులు, వాగులు, సరస్సుల్లో ఈదేవారిలోనూ కనిపిస్తుంది. 

నివారణ: ఆహారాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో (ఎలుకల వంటివి చేరలేని చోట్ల) సురక్షితంగా ఉంచాలి. రోడ్లపై మలమూత్రాలతో కలుషితమైన నీళ్లు (సీవరేజ్‌) ప్రవహించే చోట్ల నడవకపోవడం (కాళ్లకు పగుళ్లు, ఇతర గాయాలు ఉంటే వాటి ద్వారా బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది); వీలైనంతవరకు జంతుమూత్రాలతో కలుషితమైన బురదనీటిలో, బురదనేలల్లో తిరగకుండా ఉండటం; పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. 

చికిత్స: పెన్సిలిన్, డాక్సిసైక్లిన్‌ వంటి మామూలు యాంటిబయాటిక్స్‌తో చికిత్స అందించడం ద్వారా దీన్ని తేలిగ్గానే నయం చేయవచ్చు. కాకపోతే లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందించాల్సి రావచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కిడ్నీ ఫెయిల్యూర్, మెదడువాపు కలిగించే మెనింజైటిస్, లంగ్‌ ఫెయిల్యూర్‌  వంటి కాంప్లికేషన్లకు దారితీసే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో గుండె కండరాలు, అంతర్గత రక్తస్రావం వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా అరుదు.

లక్షణాలు:

  • బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించిన రెండువారాల్లో లక్షణాలు బయటపడవచ్చు.
  • కొన్ని సందర్భాల్లో అసలు లక్షణాలే కనిపించకపోవచ్చు.
  • తీవ్రమైన తలనొప్పి (కొన్నిసార్లు కొద్దిగా జ్వరంతో)
  • ఛాతీ నొప్పి, కండరాల నొప్పి
  • కొందరిలో కామెర్లు (కళ్లు, చర్మం పచ్చబడటం)
  • వాంతులు, విరేచనాలు 
  • కొందరిలో చర్మంపై ర్యాష్‌తో.

నిర్ధారణ: రక్తపరీక్షల్లో బ్యాక్టీరియా తాలూకు యాంటీబాడీస్‌తో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. మరింత ఖచ్చితమైన నిర్ధారణ కోసం డీఎన్‌ఏ పరీక్ష కూడా అవసరం పడవచ్చు. అయితే లక్షణాలు,ఆయా సీజన్‌లలో ఇది వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జబ్బును అనుమానించి చికిత్స 
అందిస్తారు.


డాక్టర్‌ గురుప్రసాద్‌,
సీనియర్‌ ఫిజీషియన్‌ అండ్‌ ఇంటర్నల్‌ 
మెడిసిన్‌ స్పెషలిస్ట్‌  

(నిర్థారణ: బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్‌ వల్ల..)

Advertisement
Advertisement