Sakshi News home page

మన్యం థెరిసా

Published Sat, Feb 25 2023 2:16 AM

 Rupali to stand firmly with the people and fight for their rights - Sakshi

‘ఆమె చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలి’ అని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇటీవల ట్విటర్‌లో కామెంట్‌ చేశారు. 75 ఏళ్ల రూపాలి జకాకాను రాయగడ జిల్లాలోని మన్యంప్రాంతంలో మన్యం థెరిసాగా పిలుచుకుంటారు. దానికి కారణం గవర్నమెంట్‌తో ఏ పని జరగాలన్నా ఈమె సాయం చేయాల్సిందే.

మేము అడవిలో ఉంటాము గనుక అధికారులు వచ్చేవారు కాదు. నేనే రాయగడకు తిరిగి వారిని రప్పించేలా చేశాను. – జకాకా


మన్యంలోని సాహి అనే గ్రామంలో చీకటి పడి భోజనాలు అయ్యాక ఒక్కొక్కరుగా రూపా లి జకాకా ఇంటికి చేరుకుంటారు. అక్కడ సభ తీరి తమ కష్టసుఖాలు చెప్పుకుంటారు. ఆమె అన్నీ వింటుంది. ఎవరికి ఏ సాయం కావాలో, ఏ పథకం ద్వారా సాయం అందించాలో జ్ఞాపకం పెట్టుకుంటుంది. తెల్లవారి లేచి ఇంట్లో పనులు ముగించుకుని ఊర్లో ఉన్న స్కూల్‌ దగ్గరకు వెళుతుంది. అక్కడి హెడ్మాస్టర్‌కు ఆమె ఏ పని మీద వచ్చిందో తెలుసు.

ఒక్కొక్కరి పేరు ఆమె  చెబుతుంటే వారి పేరుతో అప్లికేషన్లు రాసి సహాయం చేస్తాడు. ఆమె వాటిని అధికారులకు చేరవేయడానికి బయలుదేరుతుంది. దాదాపుగా ఇది ఆమె దినచర్య.ఒరిస్సా రాయగడ జిల్లాలోని హలువా పంచాయతీలో సాహితో సహా 18 గ్రామాలు ఉన్నాయి. అన్నీ ఆదివాసీ గ్రామాలే. పెద్ద వాళ్లంతా దాదాపుగా నిరక్షరాస్యులే. వారందరి సమస్యలు తీర్చే స్వచ్ఛంద కార్యకర్త రూపా లి జకాకా. 

భర్త మరణంతో
రూపా లి జకాకాకు 35 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె భర్త అంతర్‌ జకాకాకు జబ్బు చేసింది. హలువాలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చేతనైన వైద్యం చేశారుగాని అది సరిపోలేదు. ఇంతకు మించి వైద్యం చేయాలంటే రాయగడ వెళ్లాలి. ఉచిత వైద్యం  పొందాలి. అది ఎలాగో చెప్పమని వారినీ వీరినీ బతిమాలింది. ఎవరూ సాయం చేయలేదు. భర్త మరణించాడు. కూతురితో జకాకా మిగిలింది. ‘మన బతుకులు ఇంతేనమ్మా. దిక్కులేని బతుకులు. వీరి కోసం ఏదైనా చేయి నువ్వు’ అని ముసలి తండ్రి అన్నాడు.

ఆ మాటలు జకాకా మీద పని చేశాయి. అప్పటికి ఆమె వంట చెరకు సేకరించి అమ్మి బతుకుతోంది. ఇల్లు కూడా సరిగా లేదు. అయినా సరే తన బాగు చూసుకోక అందరి కోసం పని చేయడం మొదలుపెట్టింది. గత 40 ఏళ్లుగా చేస్తూనే ఉంది. ప్రభుత్వం ప్రజల కోసం, ఆదివాసీల కోసం ఏమేం పథకాలు నిర్వహిస్తోందో కనుక్కుని అవన్నీ అందేలా సాయం చేస్తోంది జకాకా.

‘మేము అడవిలో ఉంటాము గనుక అధికారులు వచ్చేవారు కాదు. నేనే రాయగడకు తిరిగి వారిని రప్పించేలా చేశాను’ అంటుంది జకాకా. పథకాలు అందాలంటే డెత్‌ సర్టిఫికెట్, బర్త్‌ సర్టిఫికెట్‌ చాలా ముఖ్యమని ఆమె తెలుసుకుంది. అందుకే తన పంచాయతీలో చావు, పుట్టుక జరిగితే సర్టిఫికెట్లు తీసుకోమని  వెంట పడుతుంది. అవి వచ్చేలా చూసి వారి కుటుంబ సభ్యులకు వాటిని అందిస్తుంది.

5000 మందికి సాయం
ఇంత వయసు వచ్చినా జకాకాలో చరుకుదనం పోలేదు. ఎంత దూరమైనా నడుస్తుంది. కంటి చూపుకు ఢోకా లేదు. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఊళ్లోనో చుట్టుపక్కల పల్లెల్లోనో తిరుగుతూనే  ఉంటుంది. ఇప్పటికి ఆమె 5000 మందికి సాయం అందించినట్టు అధికారులే లెక్క తేల్చడం కాదు... ఇటీవల రాయగడకు పిలిచి సన్మానం కూడా చేశారు.

ఒరిస్సా ముఖ్యమంత్రి ఆమెను మెచ్చుకుంటూ ట్వీట్‌ చేసి ‘ప్రజల కోసం ఉద్దేశించిన పథకాలు అట్టడుగు స్థాయికి చేరాలంటే ఇటువంటి వారు చేసే కృషి స్ఫూర్తి కావాలి’ అన్నారు. జకాకా ఇప్పుడు తన కూతురు, మనవరాలు, మనవడితో కలిసి జీవిస్తోంది. పంట  పొలాల్లో పని ఉంటే చేస్తోంది. అధికారులు ఆమెకు 20 కేజీల బియ్యం, 500 రూపా యల నగదు ప్రతి నెలా అందేలా శాంక్షన్‌ చేశారు. ఇప్పటికీ ఆమె ఇల్లు అంతంత మాత్రంగానే ఉంది. అయినా సరే తన కోసం కాకుండా ఊరి జనాల కోసం ఆమె తిరుగుతూనే ఉంటుంది. సాటి వారికి సాయం చేయడంలో  సంతృప్తే ఆమెకు సంజీవనిలా పని చేస్తున్నట్టుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement