Pillala Katha: ఎవరు నిజాయితీ పరుడు? | Sakshi
Sakshi News home page

Pillala Katha: ఎవరు నిజాయితీ పరుడు?

Published Sun, Feb 4 2024 5:40 AM

Sakshi Funday this week 04 02 2024 Childrens story

సింహగిరిని హిమవంతుడు పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు.. మంత్రి వసంతుడితో ‘ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మంది పనివాళ్లలో ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవాలని ఉంది మంత్రివర్యా! అందుకు వజ్రాలను వారికి దొరికేలా చేద్దాం. వాటికి ఆశపడని వాడే నిజాయితీపరుడు. ఏమంటారు?’ అని అడిగాడు. ‘అలాగే మహారాజా.. మీరన్నట్టే చేద్దాం! నిజాయితీపరుడెవరో తేలుతుంది’  అన్నాడు మంత్రి.

మరుసటిరోజే మంత్రితో చెప్పి ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మందీ పనిచేసే ప్రాంతంలో ఒక్కొక్కరికీ ఒక్కో వజ్రం దొరికేలా ఏర్పాటు చేయించాడు రాజు. ఒక గంట తరువాత ఉద్యానవనం చూసుకునే అధికారి ఆ పది మందినీ పిలిచి ‘పొరపాటున ఉద్యానవనంలో   పది వజ్రాలు పడిపోయాయి. దొరికిన వాళ్లు వాటిని తీసుకెళ్లి రాజు గారికి ఇస్తే వారికి రాజు గారు ఐదు వెండి నాణేలు ఇస్తారు’ అని చెప్పాడు.

అది విన్న పది మందిలో తొమ్మిది మంది అతి సులువుగా ఒక్కో వజ్రాన్ని స్వంతం చేసుకున్నారు. వారిలో ఒకడు ‘మనమేమన్నా పిచ్చివాళ్లమా? వజ్రానికి వెండి నాణేలు తీసుకోవడానికి? మనకు దొరికిన వజ్రాన్ని అమ్ముకుంటే ఎంతో ధనం వస్తుంది’ అన్నాడు. ‘అవునవును’ అన్నారు మిగతావారు. అందరూ మాట్లాడుకుని నేరుగా బంగారు అంగడి భూషయ్య వద్దకు బయలుదేరారు.

పదవ వాడైన రామయ్య వద్దకు ఆ అధికారి వచ్చి ‘నేను వజ్రాల గురించి చెబుతున్నా వినకుండా నీ పాటికి నువ్వు పనిచేసుకుంటూ పోతున్నావేంటీ’ అని కసురుకున్నాడు. ‘నాకు పని ముఖ్యం. పనైపోయాక విరామ సమయంలో వెతుకుతాను’ అని బదులిచ్చాడు రామయ్య. అన్నట్టుగానే రామయ్య.. విరామ సమయంలో భోజనం చేసి వజ్రాన్ని వెతికి తీసుకెళ్లి ‘మహారాజా! ఇదిగోండి నాకు దొరికిన వజ్రం’ అంటూ రాజుకు ఇచ్చి ‘తోటలో పని ఉంది’ అంటూ వెంటనే వెళ్లిపోయాడు.

దారిలో తొమ్మిది మందిలో ఒకడు ‘ఉద్యానవనంలో పనికి మనకిచ్చే జీతం చాలా తక్కువ. అందుకే ఈ వజ్రాన్ని అమ్మితే వచ్చే ధనంతో నేను పొరుగు దేశం వెళ్లి వ్యాపారం చేసుకుంటాను’ అన్నాడు. మరొకడు ‘పంట పొలం కొంటాన’న్నాడు. ఇలా మిగిలిన వాళ్లూ తమ తమ ఆలోచనలను పంచుకుంటూ భూషయ్య అంగడికి చేరుకున్నారు. వజ్రాలు అమ్మడానికి వచ్చామంటూ భూషయ్యకు తమ దగ్గరున్న వజ్రాలను ఇచ్చారు. వాటిని పరీక్షించిన భూషయ్య ‘ఇవి వజ్రాలు కావు. నాసిరకం రంగు రాళ్లు. నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు’ అని తేల్చాడు.

‘ఒరే! మనం పొరబడ్డాము. తిన్నగా కోటకు వెళ్లి వీటిని రాజు గారికి ఇచ్చి వెండినాణేలు దక్కించుకుందాము’ అన్నాడు వారిలో ఒకడు. ‘అవునురా’ అంటూ వంత పాడారు మిగిలిన వాళ్లు. వెంటనే కోటకు పయనమయ్యారు. రాజు గారి కొలువుకు చేరుకొని ‘మహారాజా! ఇవిగోండి.. మాకు దొరికిన వజ్రాలు’ అంటూ ఆ తొమ్మండుగురూ వాటిని రాజుకిచ్చారు.

‘మీకు భోజన సమయానికి ముందు వజ్రాలు దొరికితే.. అవి అసలైనవనుకుని అమ్మడానికి భూషయ్య వద్దకు వెళ్లారు. అక్కడవి నకిలీవని తేలగానే ఇటు వచ్చారు కదా’ అని గద్దించాడు రాజు. సమాధానమివ్వలేక పోయారు వాళ్లు. ‘రామయ్య ఒక్కడే పని చూసుకుని వజ్రం దొరికిందని ఇచ్చి వెళ్ళాడు. మీలో నిజాయితీపరుడు ఎవరో తెలుసుకోవడం కోసం  నేను ఆడిన నాటకం ఇది’ అన్నాడు రాజు.

‘నిజాయితీతో పని చేయలేని మీ అందరినీ మహారాజు గారు కొలువు నుండి తొలగిస్తున్నారు. మీరు పక్షం రోజులు పనిచేసినా మాసం జీతం ఇస్తున్నారు. తీసుకుని వెళ్ళండి’ అన్నాడు మంత్రి. తరువాత రామయ్యను పిలిచి ‘వృత్తికి విలువ ఇచ్చిన తరువాతనే నిజాయితీగా వజ్రం తెచ్చి ఇచ్చావు. అన్న మాట ప్రకారం నీకు ఐదు వెండినాణేలు ఇవ్వాలి. కానీ పది బంగారు నాణేలు ఇస్తున్నాను’ అన్నాడు రాజు.

‘మహారాజా! నాది కానిది పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు. దొరికిన వజ్రం మీకు తెచ్చిచ్చాను. నాకిచ్చిన కొలువు బంగారం కంటే విలువైనది. మీరిచ్చే జీతం నాకు చాలు’ అని వందనం చేసి వెళ్లిపోయాడు రామయ్య. మరొక్కమారు రామయ్య నిజాయితీని ప్రశంసించి ‘చూశారుగా మంత్రీ.. మన పథకం ఎలా పారిందో!’ అన్నాడు రాజు గర్వంగా. ‘అవును మహారాజా!’ అన్నాడు మంత్రి మెచ్చుకోలుగా!    - యు.విజయశేఖర రెడ్డి

Advertisement
Advertisement