అమ్మాయిలను కాపాడుకుందాం... | Sakshi
Sakshi News home page

అమ్మాయిలను కాపాడుకుందాం...

Published Tue, Mar 19 2024 6:07 AM

Sakshi Interview About women rights activist DR Rukmini Rao

గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్‌ రుక్మిణీ రావు. ఏళ్ల తరబడి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆమె. డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ డైరెక్టర్‌గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయవేదిక మకాం సహ వ్యవస్థాపకులుగానూ ఉన్నారు.   నారీ శక్తి పురస్కార గ్రహీత, హైదరాబాద్‌ వాసి, సామాజిక కార్యకర్త రుక్మిణీరావుతో మాట్లాడినప్పుడు స్త్రీ సంక్షేమానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె ఇలా మనముందుంచారు.

‘‘ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఆపకూడదు, ఆగకూడదు. ఈ రోజుల్లో మన అమ్మాయిలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మేం తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 50 గ్రామాల్లోని 8 నుంచి 17 ఏళ్ల వయసు లోపు అమ్మాయిల సంక్షేమానికి  గ్రామ్య రిసోర్స్‌ సెంటర్‌లో భాగంగా వర్క్‌ చేస్తున్నాం. మహిళల సంక్షేమానికి కృషి చేద్దామని చేసిన ప్రయత్నంలో ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల 15–16 ఏళ్ల లోపు అమ్మాయిలు తెలిసిన, తెలియని అబ్బాయిల మాటలు నమ్మి ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలను ఎక్కువ చూస్తున్నాం. దీంతో స్కూల్‌ నుంచి డ్రాపౌట్‌ అయిన వాళ్లకు, ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వాళ్లను తిరిగి వచ్చేలా, కౌన్సెలింగ్స్‌ చేస్తున్నాం.

ఇద్దరు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు అమ్మడం గురించి తెలిసి మా స్నేహితురాలు జమునతో కలిసి నేనూ అక్కడకు వెళ్లాను. ఆ అమ్మకం కార్యక్రమాన్ని అడ్డుకుని, వారికి సహాయం చేయాలనుకున్నప్పుడు ‘గ్రామ్య రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్’’ని ప్రారంభించాం. ఈ సంస్థకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరు మండలాల్లో దాదాపు 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి, ఆడపిల్లల పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి వర్క్‌ చేస్తున్నాం. ఏళ్లుగా ఆడ శిశుహత్యలతో పాటు అంతర్జాతీయ దత్తత ద్వారా కూడా ఆడపిల్లల అక్రమ రవాణాకు విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉందని కనుక్కొన్నాం. ప్రచార పద్ధతిలో పని చేస్తూ, అనేక అక్రమ దత్తత కేంద్రాలను మూసివేయించాం.

వివక్ష లేని చోట పెంపకం
నా చిన్నతనంలో మా అమ్మమ్మ, అమ్మ, అత్తల మధ్య పెరిగాను. ఆ విధంగా ఇంటిని నడిపే సమర్థ మహిళల గురించి నాకు తెలుసు. మా ఇంట్లో అబ్బాయిలు, అమ్మాయిలు అనే వివక్ష ఉండేది కాదు.  నేను బాగా చదువుకోవాలన్నది అమ్మ ఆలోచన. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్‌ కాలేజీ నుండి సైకాలజీలో మాస్టర్స్‌ పూర్తి చేశాను. చదువు చెప్పాలనే ఆలోచనతో హైదరాబాద్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్స్ లో టీచింగ్‌ చేశాను. ఆ తర్వాత ఢిల్లీలో సైకాలజీలో పీహెచ్‌డీ చేశాను.

1970 – 1980ల మధ్య వరకు ఢిల్లీలోని నేషనల్‌ లేబర్‌ ఇన్స్ స్టిట్యూట్, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ సెంటర్‌ ఫర్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్స్ లో కెరియర్‌ స్టార్ట్‌ చేశాను. అప్పుడే జీవితం ఒక మలుపు తీసుకుందనిపిస్తుంది. వరకట్న మరణాలు తీవ్ర సమస్యగా ఉన్న రోజులవి. ఇది సమాజానికే అనారోగ్యం అనిపించేది. మా స్నేహితులతో కలిసి ఎడతెగని చర్చలు జరిపేవాళ్లం.  వరకట్న వ్యతిరేక ప్రదర్శనలలో విస్తృతంగా పాల్గొన్నాం. అప్పుడు 1981లో మహిళల కోసం ‘సహేలీ రిసోర్స్‌’ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. అక్కణ్ణుంచి ఈ మార్గంలో ఏళ్లుగా ప్రయాణిస్తున్నాను. నాతో పాటు ఎన్నో అడుగులు తోడయ్యాయి. సేవా కార్యక్రమాలు చేసేవారితో నేనూ కలుస్తున్నాను.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా...
పదేళ్లక్రితం ఒక విషయం మమ్మల్ని కదిలించింది. కౌమార దశలో గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. దానివల్ల వచ్చిన సైడ్‌ ఎఫెక్ట్స్‌ మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. అక్కడ ఆ అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మేం స్వయంగా చూశాం. దీంతో ఇది సరైన పద్ధతి కాదని మా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి సుప్రీం కోర్టులో కేసు వేశాం. విదేశాలలో ఒక వ్యాక్సిన్‌ గురించి నిర్ణయం తీసుకుంటే వాళ్లు సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. అలాంటిది మన దగ్గర లేదు. ఇప్పుడు వ్యాక్సిన్‌ ఖరీదు తగ్గిందన్నారు. వ్యాక్సిన్‌ వేయాలంటున్నారు. డాక్టర్లు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. అయితే, ఆ తర్వాత వచ్చే సమస్యలపైన కూడా దృష్టి పెట్టమని, మెడికల్‌ సిస్టమ్‌ను కరెక్ట్‌ చేయమని ప్రభుత్వాలను కోరుతున్నాం. అప్పుడే, ఈ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళితే బాగుంటుంది’’ అని తన అభిప్రాయలను వెలిబుచ్చారు రుక్మిణీరావు.

గ్రామీణ మహిళలతో కలిసి...
1989లో ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాను. పుట్టిపెరిగిన ప్రాంతం, పరిచయమున్న సాంçస్కృతిక నేపధ్యంలో సమర్థంగా పని చేయగలనని భావించాను. న్యాయం కోసం కోర్టులకు వచ్చే మధ్యతరగతి మహిళలకు సహాయం చేయడం ప్రారంభించాం. వారి స్థితి చూశాక ఇంకా ఎంతో చేయాల్సింది ఉందనిపించింది. అక్కణ్ణుంచి గ్రామీణ మహిళల సంక్షేమానికి శ్రద్ధ వహించాల్సిన అవసరం గుర్తించి అటువైపుగా అడుగులు వేశాం. 30 ఏళ్లుగా మహిళా రైతుల హక్కులను ప్రోత్సహించడానికి డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాను. సంస్థలో మహిళా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, వర్క్‌షాప్‌ల నిర్వహణ ముఖ్యంగా తీసుకున్నాను.

సొసైటీలో డైరెక్టర్, బోర్డ్‌ మెంబర్‌గా ఉన్నాను. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులతో ‘మకాం’ అనే వేదిక ద్వారా విస్తృత కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు అనగానే ట్రాక్టర్‌పైన మగవాళ్లు ఉండటమే కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆడవాళ్లు కూడా ట్రాక్టర్లు నడపడం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల తయారీలో అగ్రభాగాన ఉండేలా కృషి చేస్తున్నాం. ఒంటరి మహిళల కోసం సమాఖ్యను ఏర్పాటు చేశాం. ఇందులో సంఘాలున్నాయి. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి కో ఆర్డినేషన్‌ చేస్తున్నాం. లెప్రసీ వ్యాధి అనేది దాదాపుగా కనుమరుగైందని అంతా అనుకుంటున్నారు. కానీ, లెప్రసీతో బాధపడుతున్న వారిని మేం గుర్తించాం. ఈ వ్యాధి ముదరకుండా ముందస్తు నివారణకు సాయం అందిస్తున్నాం.

– నిర్మలా రెడ్డి
ఫొటో: అనిల్‌ కుమార్‌ మోర్ల

Advertisement
Advertisement