వంటల డాక్టర్.. యోగమ్బాళ్‌ సుందర్‌‌

23 Feb, 2021 09:53 IST|Sakshi

లంచ్‌ బాక్సులో రోజుకో రకం పెట్టాలి. ఎన్ని రకాలని వండను? ఈ గృహిణికి పరిష్కారం యోగమ్బాళ్‌ చానెల్‌లో దొరుకుతుంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఏమేమి తినాలి? ఏం తినాలో డాక్టర్‌ చెబుతుంది... ఎలా వండాలో యోగమ్బాళ్‌ చెబుతుంది.

యోగమ్బాళ్‌ సుందర్‌... సెలబ్రిటీ షెఫ్‌. అంటే ఆమె సెలబ్రిటీల షెఫ్‌ కాదు, చక్కగా వండుతూ సెలబ్రిటీ అయ్యారు. రెండేళ్ల కిందట మొదలైన ఆమె సొంత యూ ట్యూబ్‌ చానెల్‌కు ఈ రోజు మూడు లక్షల ఎనభై ఆరు వేల మంది సబ్‌స్క్రైబర్‌లున్నారు. వాళ్లు ఆమె కొత్తగా విడుదల చేసే వంట కోసం ఎదురు చూస్తుంటారు. మరికొందరు కామెంట్‌ బాక్సులో తమ ఆరోగ్య సమస్యను తెలియచేస్తూ ఏం తినాలో, ఎలా వండాలో చెప్పమని అడుగుతుంటారు. గర్భిణిగా ఉన్నప్పుడు ఏం తినాలో, ఎలా వండాలో చేసి చూపిస్తారామె. అలాగే పాలిచ్చే తల్లి తినాల్సిన ఆహారాన్ని కూడా చెప్తారు, చేసి చూపిస్తారు.

సాధారణంగా పాలిచ్చే తల్లి అనగానే పాలు సమృద్ధిగా ఉండడానికి తగిన ఆహారం మీదనే దృష్టి పెడతారు. కానీ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ దేహం తిరిగి శక్తి పుంజుకోవడం మీద ఇంట్లో వాళ్లు కూడా పెద్దగా ఆసక్తి చూపించరు. యోగమ్బాళ్‌ అందుకు కూడా వంటలను సూచిచస్తారు. దీంతో ఒకప్పుడు ఆమెను తమిళ టీవీలో వంటల ప్రోగ్రామ్‌లో చూసి ‘తెర నిండుగా’ అని పరిహసించిన వాళ్లు కూడా ఆమె వంటల చానెల్‌కు అభిమానులయ్యారు. బాడీ షేమింగ్‌ను తట్టుకుని నిలబడడం కష్టమైనందని, అందుకు తగిన మానసిక స్థిరత్వాన్ని సాధించడానికి ఎంతగానో ప్రయాసపడినట్లు చెప్పారు యోగమ్బాళ్‌. తననీ రోజు సెలబ్రిటీగా నిలబెట్టింది నాలుగు వందల రకాలు వండగలిగిన పాకనైపుణ్యం కంటే షేమింగ్‌ను తట్టుకోగలిగిన మానసిక స్థయిర్యమేనన్నారామె.

యాభై ఐదేళ్లకు కొత్త మలుపు
యోగమ్బాళ్‌ సొంతూరు తమిళనాడులోని తిరువన్‌మియూర్‌. తండ్రి న్యూస్‌ పేపర్‌ ఏజెంట్, తల్లి గృహిణి. స్కూలు, సంగీతం ఈ రెండే ఆమె బాల్యంలో ఉన్నవి. సంగీత ప్రముఖుల దగ్గర వీణాగానంలో శిక్షణ తీసుకున్నది. ఆ శిక్షణ అలాగే కొనసాగి ఉంటే ఆమె సంగీతంలో సెలబ్రిటీ అయ్యేవారేమో. పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేశారు, భర్త ఉద్యోగం ముంబయిలో కావడంతో ఆమె జీవితం గొప్ప మలుపు తీసుకోవడంలో తడబడింది.

భర్త భోజన ప్రియుడు కావడంతో రకరకాల ప్రయోగాలతో ఆమె జీవితం వంటగది కే అంకితమైపోయింది. దక్షిణాది, ఉత్తరాది వంటల్లో చెయ్యి తిరిగింది. ఒంటిచేత్తో అరవై మందికి వండగలిగే నైపుణ్యం సాధించింది యోగమ్బాళ్‌. భర్తకు ఇష్టమైన వంటను, తనకు ఇష్టమైన వీణసాధననూ కొనసాగిస్తూ వచ్చింది. హటాత్తుగా భర్త కాలం చేశాడు. జీవితం ఊహించని స్తబ్ధత. విపరీతమైన శూన్యత. ఆ శూన్యతను ఏదో ఒక వ్యాపకంతో భర్తీ చేయడానికి యోగమ్బాళ్‌ చెల్లెలు ఓ ప్రయత్నం చేసింది. అలా యోగమ్బాళ్‌ 2017లో టీవీలో వంటల ప్రోగ్రామ్‌లో కనిపించింది.

రుచి రాగం
‘‘నా దేహాకృతిని చూసి హేళన చేసినప్పుడు కలిగిన ఆవేదనను మాటల్లో చెప్పలేను. సంగీత సాధనతో బాధను మరిచిపోదామన్నా కూడా సాధ్యమయ్యేది కాదు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. నా పిల్లలు ఓ సలహా ఇచ్చారు. టీవీలో వండడానికి కొన్ని పరిమితులుంటాయి. ఆ ప్రోగ్రామ్‌ రూపకర్తలు నిర్దేశించినట్లు వండాల్సి ఉంటుంది. ఆ టీవీ వీక్షకులు మాత్రమే నీ వంటల ప్రోగ్రామ్‌ను చూస్తారు.

అలా కాకుండా నువ్వే సొంత వంటల చానెల్‌లో వంటల కాన్సెప్ట్‌ను నీకు నచ్చినట్లు, వీక్షకులకు ప్రయోజనం ఉండేటట్లు రూపొందించుకోవచ్చు. నీ వంటలను ఇష్టపడే వాళ్లే నీ చానెల్‌ చూస్తారు. కాబట్టి కాలక్షేపంగా టీవీ ముందు కూర్చుని నోటి దురుసుతో మాటలు తూలే వాళ్ల బాధ నీకు ఉండదు... అని చెప్పారు. అదే జరిగింది. నా చానెల్‌ను చూసే వాళ్లు నన్ను అభిమానిస్తున్నారు. నాలో మేనత్తను, పిన్నిని చూసుకుంటున్నారు. సంగీత సాధనలో కూడా సాధించలేని ఆత్మీయత ను ఇందులో పొందగలుగుతున్నాను’’ అన్నారు యోగమ్బాళ్‌ సంతోషంగా.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు