శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా! | Sakshi
Sakshi News home page

శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

Published Tue, Feb 6 2024 10:34 AM

Shilpa Shetty Recommends The Chakki Chalasana Pose For Its Benefits - Sakshi

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి వయసు 50కి దగ్గర పడ్డ వన్నెతగ్గని సోయగంతో పేరుకు తగ్గట్టు శిల్పంలా ఉంటుంది. అంతేగాక ఆమె మంచి ఫిట్‌నెస్‌ ఔత్సాహికురాలు కూడా. ఇక ఫిట్‌నెస్‌కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడూ నెటిజన్లతో షేర్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాల్లో చురుగ్గా ఉంటారు. అలానే ఈసారి కూడా ఫిట్‌నెస్‌కి సంబంధించిన ఓ సరికొత్త విషయాన్ని షేర్‌ చేశారు శిల్పా. ఆమె పలు యోగాసనాలు వేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ సారి ఆమె సరికొత్త వ్యాయామ భంగిమ, దాని ప్రయోజనాల గురించి చాలా ఆసక్తికర విషయాలను ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేశారు. రాజస్తాన్‌ పర్యటనలో ఉన్న ఆమె 'చక్కి చలసానా' భంగిమ విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ఏంటీ 'చక్కీ చలసానా' అనుకుంటున్నారా..?

అదేనండి తిరగలి తిప్పుతున్నట్లు చేసే ఆసనం. అంతేకాదండోయ్‌ మన పూర్వకాలం బామ్మలు తిరగలితో బియ్యం, గోధుమలు పిండిగా విసిరేవారు. అలా చేయడం వల్ల వాళ్ల నడుములు, పిక్కలకు మంచి వ్యాయామం చేకూరి ఆరోగ్యంగా ఉండేవారిని నిపుణులు గుర్తించారు. ఆ విషయాన్ని శిల్పాశెట్టి కూడా చెబుతున్నారు.  ఆ భంగిమ ప్రయోజనాలు వివరిస్తూ తిరగలి విసిరి మరీ చూపించారు. ఇలా చేస్తే నడుము, తొడలు, పిక్కల వద్ద ఉండే కొవ్వు కరిగి ఎలా ఫిట్‌గా ఉంటారో వెల్లడించారు నటి శిల్పా.  ఈ భంగిమని యోగా ఆననాల్లో గ్రైండింగ్‌ పోజ్‌ అని పిలుస్తారని అన్నారు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరానికి, మనస్సుకి మంచి ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ఈ ఆసనాన్ని రెగ్యూలర్‌గా వేస్తే చేకూరే ప్రయోజనాలేంటో సవివరంగా వెల్లడించారు కూడా. అవేంటంటే.

బలాన్ని వృద్ధి చేస్తుంది:
ఈ చక్కి చలసానా(తిరగిలి తిప్పే ఆసనం) ఉదరకండరాలను బలోపేతం చేయడంలో సహయపడుతుంది. వదులుగా బాన పొట్టలా కానివ్వకుండా కాపాడుతుంది. ఇందులో వృత్తాకార కదలికలో కేవలం మొండెం మాత్రమే కదలడంతో ఉదరం చుట్టూ ఉండే కండరాలు సక్రియం అవుతాయి. దీంతో శరీరాన్ని సరైన విధంగా బ్యాలెన్స్‌ చేయగలిగే శక్తి ఆటోమెటిక్‌గా వస్తుంది. 

ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది
ఈ యోగా భంగిమలో ఎగువ శరీరం మాత్రమే వృత్తాకార కదలికలో పాల్గొంటుంది కాబట్టి వెన్నెముక, భుజాలు  తుంటిల ఆరోగ్యాన్ని బలోపేతం చేసేందుకు మంచి ఉపయుక్తమైన ఆసనం. ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల ఆయా భాగాలు త్వరితగతిన గాయాల బారిన పడకుండా  దృఢంగా ఉండేలా చేస్తుంది. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ఈ చక్కి చలాసానాలో వృత్తాకార కదలిక కారణంగా ఉదర అవయవాల్లో ముఖ్యంగా జీర్ణ అవయవాలకు మంచి అవసరమైన వ్యాయామం​ అనే చెప్పాలి. దీంతో ఇది జీర్ణక్రియను ప్రేరేపించి అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మనసు ఆహ్లదంగా ఉండేలా చేస్తుంది
చక్కి చలసానాలో ఏకాగ్రతతో చేసే ఆసనం కాబట్టి మనస్సుపై ప్రభావం ఏర్పడి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ భంగిమ ధ్యానానికి సంబంధించిన నియంత్రిత శ్వాసపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. అందువల్ల ఈ ఆసనం వేయడం అనేది మనస్సుకు ప్రశాంతనిచ్చే ధ్యానం చేసినట్లుగా మంచి సత్ఫలితాలనిస్తుంది.
ఈ వ్యాయమాన్ని క్రమం తప్పకుండా చేసి మంచి ప్రయోజనాలను పొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడని చెబుతోంది నటి శిల్పాశెట్టి. ఇం​కెందుకు ఆలస్యం ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఆసనాన్ని వెంటనే మొదలు పెట్టేయండి మరీ. 

(చదవండి: 'గోబీ మంచూరియా'ని ఆ నగరం పూర్తిగా బ్యాన్‌ చేసిందట! ఎందుకో తెలుసా?)

Advertisement

తప్పక చదవండి

Advertisement