పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి! | Sakshi
Sakshi News home page

పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!

Published Thu, Feb 1 2024 2:10 PM

Silk Sarees Can Be Marked With This Method - Sakshi

శుభకార్యం ఏదైనా వధూవరులు, మహిళలు, పురుషులు, పిల్లలు అని తేడా లేకుండా అందరూ పట్టు వస్త్రాలను ధరించడం సాంప్రదాయంగా భావిస్తారు. పట్టు వస్త్రాలు ధరించడం వల్ల హుందాతనం, అందం ఉట్టిపడుతుంది. దీంతో మార్కెట్లో పట్టు వస్త్రాలకు మంచి ధర, డిమాండ్‌ ఉంది. వస్త్ర దుకాణాల్లో లైట్ల వెలుగులో పట్టు వస్త్రాలు దగదగా మెరుస్తుంటాయి. కానీ, అందులో ఏది అసలు, ఏది నకిలీ పట్టు వస్త్రమనేది వినియోగదారులు కనిపెట్టడం చాలా కష్టం. వస్త్ర దుకాణాదారులు కూడా వినియోగదారుడిని బురిడీ కొట్టించే అవకాశాలు లేకపోలేదు.

కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ స్వచ్చమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్‌ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్‌ మార్క్‌, మగ్గంపై నేసిన వస్త్రాలకైతే హ్యాండ్లూమ్‌ మార్క్‌ను అందజేస్తుంది. సిల్క్‌ మార్క్‌, హ్యాండ్లూమ్‌ మార్క్‌ లేబుల్‌ ఉన్నట్లయితే అది స్వచ్చమైనదిగా గుర్తించవచ్చు. రిజిస్ట్రేషన్‌ చేసుకొన్న వస్త్ర వ్యాపారులకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి లోగోలను అందజేస్తారు.

పట్టులో పలు రకాలు..

  • పట్టులో అనేక రకాలున్నాయి. అందులో సహజసిద్ధమైన మల్బరీ సిల్క్‌ను ‘క్వీన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌’గా పిలుస్తారు. ఇది మల్బరీ పట్టు పురుగైన బాంబేక్స్‌ మోరె నుంచి తయారవుతుంది. ఇది చాలా ఖరీదైనది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని 90 శాతం వినియోగిస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్‌ పట్టు వస్త్రాలన్నీ మల్బరీ పట్టుతోనే తయారవుతున్నాయి.
  • ‘టస్సార్‌ సిల్క్‌’ కాపర్‌రంగులో ఉంటుంది. అడవుల్లో ఉండే పట్టు పురుగుల నుంచి తయారు చేస్తారు. టస్సార్‌ పట్టును ఎక్కువగా హోం ఫర్నీషింగ్‌, ఇంటీరియర్‌ డెకరేషన్‌లో వినియోగిస్తారు.
  • ఇందీ పట్టు పరుగుల నుంచి ‘ఈరీ సిల్క్‌’ తయారవుతుంది. ఈరీ పట్టును కాటన్‌, ఉన్ని, జనపనారతో కలిపి ఫ్యాషన్‌, ఇతర అస్సెస్సరీస్‌, హోం ఫర్నీషింగ్‌ తయారు చేస్తారు.
  • ‘ముంగా పట్టు’ బంగారు వర్ణంలో ఉంటుంది. దీనిని తయారు చేసే పట్టు పురుగులు అడవుల్లో ఉంటూ సోమ్‌ అండ్‌ సోఆలు అనే చెట్ల ఆకులను తింటాయి.

అసలైన పట్టును ఇలా గుర్తించవచ్చు..

  • పట్టు పోగుని వెలిగించినప్పుడు నిరంతరంగా కాలకుండా ఆరిపోతుంది.
  • పట్టు కాలినప్పుడు వెంట్రుకలు, ఈకలు కాలిన వాసన వస్తుంది.
  • పోగు కొనలో చిన్న నల్లపూసలా మారుతుంది.
  • పూసను నలిపినప్పుడు పొడి అయ్యి పోగు గరుకుగా మారుతుంది.
  • పట్టు వస్త్రాలను ఎల్లప్పుడు సిల్క్‌మార్క్‌ అధీకృత షాపుల్లోనే కొనాలి.
  • పట్టు వస్త్రాలకు ఉన్న సిల్క్‌మార్క్‌ లేబుల్‌ 100 శాతం పట్టు ప్రామాణికతను సూచిస్తుంది.
  • పట్టు వస్త్రాలని సిల్క్‌మార్క్‌ వారిచే ఉచితంగా పరీక్షింప జేసుకోవచ్చు.
  • స్వచ్ఛమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్‌ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్‌ మార్క్‌ ఉంటుంది.
  • మగ్గంపై నేసిన పట్టుకు హ్యాండ్లూమ్‌ మార్క్‌ ఉంటుంది.

ఇవి చదవండి: బడ్జెట్‌ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్‌ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే!

Advertisement

తప్పక చదవండి

Advertisement