Simar Sangla Giving Training For Acid Attack Survivors To Make Hand Made Soap - Sakshi
Sakshi News home page

సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్‌ బాధితులకు ఉపాధిగా..!

Published Thu, Aug 10 2023 10:00 AM

Simar Sangla Giving Training Acid Attack Survivors Make Hand Made Soap - Sakshi

మాట్లాడే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెబుతుంటారు. ఆదుకోవాలని మనసు ఉండాలేగానీ, సరికొత్త దారులు అనేకం కనిపిస్తాయని చేసి చూపెడుతోంది పదిహేడేళ్ల సీమర్‌ సంగ్లా. యాసిడ్‌ దాడి బాధితులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు సబ్బుల తయారీలో శిక్షణ ఇస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.

ఢిల్లీకి చెందిన సీమర్‌ ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఒకసారి పూనమ్‌ అనే అమ్మాయి మీద యాసిడ్‌ దాడి జరిగింది. దీంతో ఆమె ముఖం మొత్తం కాలిపోయింది. అయితే ఆమె మామూలు సబ్బులతో స్నానం చేస్తే యాసిడ్‌ దాడి జరిగిన ప్రదేశంలో బాగా మంట పుట్టేది. ఈ విషయం తెలిసిన యాసిడ్‌ దాడి బాధితులకు సాయం చేసే సీమర్‌ తల్లి... పూనమ్‌ను ఆదుకునే క్రమంలో ... మంట రాని సబ్బు తయారు చేయాలనుకుంది. ఈ క్రమంలోనే సీమర్‌ అమ్మ, అమ్మమ్మలు కలిసి, సబ్బు తయారు చేశారు. యాసిడ్‌ దాడికి కాలిపోయిన పూనంకు ఈ సబ్బు స్వాంతన కలిగించింది.

వాడుకోవడానికి చాలా అనువుగా అనిపించింది. ఇదంతా దగ్గర నుంచి చూసిన సీమర్‌ యాసిడ్‌ బాధితుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం మొదలు పెట్టింది. పూనమ్‌లా ఎంతోమంది యాసిడ్‌ దాడికి గురైనట్లు తెలుసుకుని, వాళ్లందరికి తాను ఏదోరకంగా సాయపడాలనుకుంది. గతేడాది యాసిడి బాధితుల అవసరాలకు తగినట్లుగా ‘సేఫ్‌ కేవ్‌’ పేరిట సబ్బులు తయారు చేయడం ప్రారంభించింది.

అలోవెర, తేనెలతో సబ్బులు తయారు చేసి యాసిడ్‌ బాధితులకు ఇచ్చేది. ఈ సబ్బులు బాధితులకు సాంత్వననిచ్చేవి. వారి ఆసక్తిని గమనించిన సీమర్‌... సబ్బుల తయారీలో శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టింది. శిక్షణ తీసుకున్న వారంతా సబ్బులు తయారు చేసి మార్కెట్లో విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో వాళ్లకంటూ ఒక గుర్తింపుతోపాటు, సాధారణ అమ్మాయిల్లా జీవించగలుగుతున్నారు.

సీమర్‌.. ఇప్పటిదాక ఇరవైమందికిపైగా సబ్బుల తయారీలో శిక్షణ ఇచ్చింది. యాసిడ్‌ బాధితుల గురించి తన స్నేహితులు, ఇతర పిల్లలకు చెబుతూ వారికి సాయం చేయాలని కోరుతోంది. ఇది చిన్నపనే అయినప్పటికీ వారి జీవితాల్లో పెద్ద మార్పుని తీసుకొస్తుంది సీమర్‌. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన బాధితులంతా సీమర్‌ శిక్షణతో ధైర్యాన్ని కూడగట్టుకొంటూ జీవితంపై కొత్త ఆశలతో ముందుకు సాగుతున్నారు. 
  

Advertisement

తప్పక చదవండి

Advertisement