Vinayaka Chavithi Special: గజముఖాసుర వధ

29 Aug, 2022 18:13 IST|Sakshi

వజ్రదంతుడిగా పేరుమోసిన మూషికాసురుడు వినాయకుడి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. వినాయకుడు తోక పట్టుకుని విసిరితే పడ్డ పాటుకు ఒళ్లునొప్పులు తీరక ముక్కుతూ మూలుగుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో నారదుడు కైలాసం నుంచి నేరుగా మూషికాసురుడి దగ్గరకు వచ్చాడు. మూలుగుతూనే నారదుడికి ఉచితాసనాన్ని చూపించాడు మూషికాసురుడు.

నారదుడు సుఖాసీనుడై, ‘వజ్రదంతా! నిన్ను దారుణంగా పరాభవించిన వినాయకుడు గణాధిపతిగా వర్ధిల్లుతున్నాడు మరి...’ అంటూ అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. పుండు మీద కారం చల్లినట్లయింది వజ్రదంతుడికి. ‘ఇప్పుడేం చెయ్యమంటావు నారదా?’ ఉక్రోషంగా అడిగాడు.‘వరాల దేవుడు మా తండ్రి బ్రహ్మదేవుడు ఉండనే ఉన్నాడు కదా! ఆయన కోసం తపస్సు చెయ్యి. ప్రతీకారం సాధించు’ అని చెప్పి, చల్లగా అక్కడి నుంచి నారాయణ నామస్మరణ చేస్తూ నిష్క్రమించాడు.

భార్య ధవళ ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా, ఉన్నపళాన బయలుదేరాడు వజ్రదంతుడు. ఒక కీకారణ్యంలోకి చేరుకుని ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు. వజ్రదంతుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘ఏం కావాలో కోరుకో’ అన్నాడు. ‘విఘ్నానికి రూపం కల్పించి, నా ఆజ్ఞానువర్తిగా చెయ్యి’ అడిగాడు వజ్రదంతుడు.‘తథాస్తు’ అన్నాడు బ్రహ్మదేవుడు. విఘ్నాన్ని ఆవాహన చేసి, వజ్రదంతుడి ముందు నిలిపాడు. అతడికేమీ కనిపించలేదు.

బ్రహ్మ అతడికి సూక్ష్మదర్శన దృష్టిని అనుగ్రహించాడు. అప్పుడు అతిచిన్న నలుసు రూపంలో ఉన్న విఘ్నాన్ని చూడగలిగాడు వజ్రదంతుడు. నల్లని ఆ నలుసును చూసి, ‘ఈ నలుసును నేనేం చేసుకోను?’ అని ఆశ్చర్యంగా బ్రహ్మను అడిగాడు. ‘విఘ్నబీజం కంటికి కనిపించదు. ఇది కామరూపి. ఏ రూపమైనా ధరించగలదు. ఎంతటి అనర్థాన్నయినా సృష్టించి, లోకాలను అల్లకల్లోలం చేయగలదు. దీన్ని ఏం చేసుకుంటావో చేసుకో!’ అని చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమైపోయాడు. 

మూషికాసురుడు విఘ్నంతో ‘నువ్వు మహా గజముఖాసుర రూపం దాల్చి వెళ్లి వినాయకుణ్ణి నాశనం చెయ్యి’ అని ఆజ్ఞాపించాడు. అప్పుడే వినాయకుడు కైలాసం నుంచి తాను పుట్టిపెరిగిన విశ్వకర్మ నిర్మించిన భవంతికి చేరుకున్నాడు. అక్కడ సింహద్వారం ఎదుట చంద్రశిలా వేదికపై తీరికగా కూర్చుని, ప్రశాంతంగా పరిసరాలను తిలకిస్తూ సేదదీరుతున్నాడు.  అలాంటి సమయంలో ‘వినాయకుడెక్కడ?’ అంటూ భీకర గర్జన వినిపించింది.

మహా గజముఖాసుర రూపంలో విఘ్నం వినాయకుడి ఎదుట వాలింది. ‘నువ్వు గజముఖుడివైతే, నేను మహా గజముఖాసురుణ్ణి. నిన్ను చంపవచ్చాను. చంపితీరుతాను’ అంటూ హూంకరించాడు. వినాయకుడు ఆ మాటలు వినిపించనట్లే అమాయకంగా చూస్తూ, ‘అబ్బాయ్‌! ముక్కలు నరుక్కుని చెరుకుగడ తినాలనుంది. నా గొడ్డలి కాస్త పదునుపెట్టి ఇస్తావంటే నీకు కుడుములు పెడతాను’ అంటూ వాటంగా చేతిలోని పరశువును అతడికేసి విసిరాడు.

దెబ్బకు కాళ్లుతెగి, గజముఖాసురుడు పర్వతంలా కుప్పకూలిపోయాడు. ‘మహాప్రభో! నేను విఘ్నాన్ని. వజ్రదంతుడైన మూషికాసురుడికి బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల నేను ఈ రూపంలో నీ ముందుకొచ్చాను. తగిన శాస్తి జరిగింది. రక్షించు’ అంటూ గావుకేకలు పెట్టాడు. ‘నేను విఘ్ననాశకుణ్ణి. నిన్ను తుత్తునియలు చేయక తప్పదు. నీ తునకలు నన్ను, నిన్ను ఏమార్చిన వాళ్లనే పట్టి పీడిస్తాయి’ అంటూ విఘ్నాన్ని సూక్ష్మతి సూక్ష్మ ఖండాలుగా చెండాడాడు వినాయకుడు. 

మరిన్ని వార్తలు