జలియన్‌వాలాబాగ్‌ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా.. | Sakshi
Sakshi News home page

జలియన్‌వాలాబాగ్‌ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా..

Published Sun, Oct 3 2021 12:14 PM

Some Shocking Facts About Jallianwala Bagh Massacre - Sakshi

1919 ఏప్రిల్‌ 13: ఆ రోజు జరిగిన నెత్తుటికాండను అంచనా వేయడంలో నాటి ప్రపంచం, విఖ్యాత మేధావులు అవమానకరంగా విఫలమయ్యారు. కాలమే చెప్పింది, మానవాళి చరిత్రలో అదెంత బీభత్సమో! అదే జలియన్‌వాలాబాగ్‌ దురంతం. అది భారతీయ ఆత్మ మీద దాడి. ఆ కాల్పులలో 379 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పింది. మృతుల సంఖ్య 1500 వరకు ఉంటుందని నాటి భారతీయుల వాదన. 

ఈ ఘటన మీద విచారణకు నియమించినదే విలియం హంటర్‌ కమిషన్‌. సాక్షులను ఢిల్లీ, అహ్మదాబాద్, బొంబాయి, లాహోర్‌లకు పిలిచారు. లాహోర్‌లోని అనార్కలీ బజార్‌లో ఉన్న టౌన్‌హాలు అందుకు వేదిక. 1919 నవంబర్‌ 19న అక్కడికే వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు జనరల్‌ రెజినాల్డ్‌ ఎడ్వర్డ్‌ హ్యారీ డయ్యర్‌. నిరాయుధుల మీద 90 మంది సైనికుల చేత కాల్పులు జరిపించినవాడు ఇతడే. చాలా ఆలస్యంగా ఘటన వివరాలు బయటకు వచ్చాయి. జాతీయ కాంగ్రెస్‌ కూడా విచారించింది. తుపాకీ గుళ్లకు బలైన వాళ్లలో ఏడుమాసాల పసిగుడ్డు సహా 42 మంది చిన్నారులూ ఉన్నారని మదన్‌మోహన్‌ మాలవీయ చెప్పారు. ప్రభుత్వం లెక్క కూడా దీనికి దగ్గరగానే ఉంది.

ఇక వెలుగు చూడని అంశాలూ ఎన్నో! 1919 ఆఖర్లో ఓ రోజు నెహ్రూ అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించారు. రాత్రి బండి. ఆయన ఎక్కిన బోగీ దాదాపు నిండిపోయి ఉంది. ఒక్క బెర్త్, అదీ అప్పర్‌ బెర్త్, ఖాళీగా ఉంది. ఎక్కి నిద్రపోయారు. తెల్లవారుతుంటే తెలిసింది, ఆ బోగీలో ఉన్నవారంతా సైనికాధికారులని. అప్పటికే వాళ్లంతా పెద్ద పెద్ద గొంతులతో మాట్లాడుకుంటున్నారు. ఒకడు మరీ పెద్ద గొంతుతో, కటువుగా మాట్లాడుతున్నాడు. అతడు అంత బిగ్గరగా చెబుతున్నవి, అప్పటికి దేశాన్ని కుదిపేస్తున్న అమృత్‌సర్, జలియన్‌వాలాబాగ్‌ అనుభవాలే. అసలు ఆ పట్టణమంతా తనకి ఎలా దాసోహమైందో చెబుతున్నాడు. తిరుగుబాట్లూ, ఉద్యమాలూ అంటూ అట్టుడికినట్టుండే పంజాబ్‌ తన ప్రతాపంతో ఎలా మోకరిల్లిందో వర్ణిస్తున్నాడు. ముదురు ఊదారంగు చారల దుస్తులలో ఉన్నాడతడు.

మొదటి ప్రపంచ యుద్ధంలో పదిలక్షల మంది భారతీయులు పోరాడారు. 60వేల మంది చనిపోయారు. యుద్ధం తరువాతైనా ఏదో ఒరుగుతుందని ఎదురుచూశారు. ఏం లేకపోగా, అణచివేత ఎక్కువయింది. అందుకే ఒక తిరుగుబాటు మనస్తత్వం వచ్చింది. రాజ్యాంగ సంస్కరణలు జరుగుతాయన్న ఆశ మధ్య తరగతిలో ఉంది. అంటే స్వయంపాలనకు అవకాశం. దీని గురించి ప్రజలు మాట్లాడుకోవడం ఆరంభించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇది బాగా ఉండేది. ఇక పంజాబ్‌లో అయితే మొదటి ప్రపంచ యుద్ధం కోసం రకరకాల పేర్లతో తమ యువకులను సైన్యంలో చేర్చుకున్న సంగతి గుర్తు చేసుకుంటున్నారు. 

అదే కాకుండా కామగాటమారు నౌక ఉదంతం, అనంతర పరిణామాలు వారిని బాధిస్తున్నాయి. ప్రపంచ యుద్ధం నుంచి తిరిగి వచ్చిన సైనికులు గతంలో మాదిరిగా లేరు. దేశదేశాల సైనికులతో కలసి పనిచేసి ప్రపంచ జ్ఞానంతో వచ్చారు. దశాబ్దాలుగా భారతీయ సైనికులకు జరుగుతున్న అన్యాయం పట్ల గుండె మండిపోతోంది. అలాంటి సందర్భంలో రౌలట్‌ చట్టం వచ్చింది. ఎలాంటి విచారణ, ఆరోపణ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఈ చట్టంతో అధికారులకు వచ్చింది. దేశమంతా ఆగ్రహోదగ్రమైంది. మితవాద కాంగ్రెస్‌ నాయకులకు కూడా ఆవేశం వచ్చింది.

రౌలట్‌ చట్టాన్ని తీసుకురావద్దని గాంధీజీ కోరారు. ఆ చట్టానికి వ్యతిరేకత తెలియచేయడానికి సత్యాగ్రహ సభ పేరుతో ఉద్యమం ప్రారంభించారు. పంజాబ్‌ మరీ ఉద్రేకపడింది. ఫలితం జలియన్‌వాలాబాగ్‌. పంజాబ్‌కూ మిగిలిన దేశానికీ మధ్య బంధం తెగిపోయింది. సైనిక శాసనం నడుమ చిన్న వార్త కూడా రావడం లేదు. ఆ దురంతం జరిగిందని తెలుసు. అది ఎంత ఘోరంగా ఉందోనని దేశంలో గుబులు. సైనిక శాసనం ఎత్తేశారు. దీనితో కాంగ్రెస్‌ నాయకులు వెల్లువెత్తారు. పండిట్‌ మదన్‌మోహన్‌ మాలవీయ, స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో పునరావాస కార్యక్రమం ప్రారంభించారు. వాస్తవాల సేకరణ పనిలో మోతీలాల్, చిత్తరంజన్‌దాస్‌ ఉన్నారు. దాస్‌కు సహాయకుడు నెహ్రూ (నెహ్రూ స్వీయచరిత్ర, 1936 నుంచి).

పది నుంచి పదకొండు నిమిషాలు సాగిన కాల్పులే. కానీ ఆ తుపాకుల నెత్తుటి చరిత్ర అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది. దీనితో పాటు ఆనాటి ఆర్తనాదాలు కూడా. కాల్పులు జరపకుండా జనం అక్కడ నుంచి వెళ్లిపోవడానికి అవకాశం ఉన్నా అలా చేయని సంగతిని హంటర్‌ కమిషన్‌ ముందు జనరల్‌ డయ్యర్‌ ఒప్పుకున్నాడు. ఎందుకు? అలా చేస్తే వాళ్లు తనను చూసి నవ్వుతారన్న అనుమానం. ఇంకా ఎక్కువ మందిని చంపాలంటే మిషన్‌ గన్‌లే ఉపయోగించేవాడినని అన్నాడు. గాయపడిన వాళ్ల సంగతి పట్టించుకోవడం తన పని కాదనీ అన్నాడు. ఆ ఘట్టం గురించి చెబుతున్నప్పుడు ‘బీభత్సమైనది’ అనేవాడు. ‘ది బుచర్‌ ఆఫ్‌ అమృత్‌సర్‌: జనరల్‌ రెజినాల్డ్‌ డయ్యర్‌’ పేరుతో నీజెల్‌ కోలెట్‌ రాసిన జీవితకథలో విస్తుపోయే విషయాలు ఉన్నాయి. తాను ఎంత చట్టవిరుద్ధంగా ప్రవర్తించాడో డయ్యర్‌కూ తెలుసు. అందుకే ఘటన జరిగిన రెండుమూడు రోజులు కథనాలు మార్చి వినిపించాడు. 

కానీ పంజాబ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఓడ్వయ్యర్‌ నుంచి మద్దతు లభించింది. తరువాత చాలామంది బ్రిటిష్‌ ప్రముఖులు గొప్ప పని చేశాడని పొగడ్తలతో ముంచెత్తారు. స్వర్ణదేవాలయం పెద్దలు జనరల్‌ డయ్యర్‌ను ‘గౌరవ సిక్కు’ను చేశారు (రిచర్డ్‌ కావెండిష్, హిస్టరీ టుడే వాల్యూమ్‌ 59, ఇష్యూ 4, ఏప్రిల్‌ 2009). 

1920 జూలై 8న బ్రిటిష్‌ పార్లమెంట్‌ ప్రభువుల సభలో చర్చ జరిగింది. ఎక్కువమంది డయ్యర్‌ను సమర్థించారు. యుద్ధ వ్యవహారాల కార్యదర్శి విన్‌స్టన్‌ చర్చిల్‌ మాత్రం అది బ్రిటిష్‌ విధానం కాదని అన్నాడు. హంటర్‌ కమిషన్‌ తీవ్ర విమర్శలతో డయ్యర్‌ని ఆ ఏడాదే ఉద్యోగం నుంచి తొలగించి ఇంగ్లండ్‌ పంపేశారు. అయినా ‘బాగ్‌ హీరో’గా ‘మార్నింగ్‌ పోస్ట్‌’ అనే బ్రిటిష్‌ పత్రిక తన నిధితో డయ్యర్‌ను సత్కరించదలిచింది. ఇంగ్లండ్‌ పత్రికలు సరే, బ్రిటిష్‌ ఇండియా నుంచి ‘కలకత్తా స్టేట్స్‌మన్‌’, ‘మద్రాస్‌ మెయిల్‌’ వంటి పత్రికలూ నిధి సేకరించాయి. మొత్తం 28,000 పౌండ్లు.

కానీ అది తీసుకోవడానికి డయ్యర్‌ నిరాకరించాడు. అప్పటికే అతనిలో అభద్రతాభావం పేరుకుపోయింది. పైగా ఆర్టియోసెరిలోసిస్‌ వ్యాధి. చిన్నపాటి ఉద్వేగానికి గురైనా చావు తప్పదు. అంతేకాదు, బాగ్‌ ఘటన పేరుతో తాను మళ్లీ ప్రపంచానికి గుర్తుకు రావడం ఇష్టం లేదన్నాడు. బ్రిస్టల్‌ పట్టణం శివార్లలో ఎవరికీ పట్టనట్టు ఉండే సోమర్‌సెట్‌  కుగ్రామంలోని చిన్న కొండ మీద కట్టిన కాటేజ్‌లో భార్య అనీతో కలసి రహస్యంగా జీవించాడు. అక్కడే 1927 జూలై 23న చనిపోయాడు. మొదట గుండెపోటు వచ్చింది. అప్పుడు కూడా అతడు బాగ్‌ గురించే ప్రస్తావించాడంటారు జీవితకథ రాసిన కోలెట్‌. డయ్యర్‌కు రెండుసార్లు అంత్యక్రియలు జరిగాయట. మొదట అతని స్వగ్రామంలో, మళ్లీ సైనిక లాంఛనాలతో. అలా ముగిసింది అతని జీవితం.

ఆరోజు రైలు ప్రయాణంలో నెహ్రూ చూసిన ఆ ఊదారంగు చారల దుస్తులలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో దిగిపోయాడు. లాహోర్‌లో ఏర్పాటు చేసిన విచారణ సంఘం ముందు హాజరై వస్తున్నాడు.
అతడే జనరల్‌ డయ్యర్‌.  

- డా. గోపరాజు నారాయణరావు

Advertisement
Advertisement