ఈ రోజుల్లో ట్రెండ్‌ ఇదే.. ప్రణయం@ పార్క్‌ | Sakshi
Sakshi News home page

ఈ రోజుల్లో ట్రెండ్‌ ఇదే.. ప్రణయం@ పార్క్‌

Published Sun, Dec 19 2021 4:31 PM

Special Interesting Today Trending Love Story - Sakshi

‘ఇంట్లోవాళ్లకి ఏం చెప్పి వచ్చావు?’ ‘చెప్పడానికి బోలెడు అబద్ధాలుంటాయి. స్నేహితురాలికి ఆరోగ్యం బాగోలేదని చెప్పాను. నమ్మేసి ఉత్త చేతులతో వెళ్లకూడదని, పళ్లు పట్టుకెళ్లమని డబ్బులు కూడా ఇచ్చింది మా అమ్మ’ పర్సులో ఉన్న డబ్బుల్ని చూపిస్తూ చెప్పి మళ్ళీ అతని వైపు తిరిగి ‘ఇంతకీ నువ్వేమని చెప్పావు?’ అడిగింది చంచల నవ్వుతూ. ‘ఫ్రెండుకి యాక్సిడెంట్‌ అయిందని చెప్పాను. నాకూ డబ్బులిచ్చారు’ అంటూ  పకపకా నవ్వాడు విశాల్‌. అతని వైపు ఆరాధనగా చూసింది చంచల. అతని నవ్వు ప్రవాహపు ఒరవడిలా పెద్దగా చప్పుడు చేస్తూ సాగుతుంది. మధ్య మధ్యలో ఆగుతూ శరీరాన్ని మొత్తంగా కదిలిస్తూ అతను నవ్వుతుంటే ఆమెకి ఎంతో ఇష్టం. అతను నవ్వుతున్నప్పుడల్లా చంచల మనసు చంచలమవుతుంది.

దేహాన్ని ఎవరో ఈడ్చుకుని కొత్తదారుల వెంట లాక్కుపోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. పరిచయం కొద్దికాలానిదే అయినా పరవశం జీవితకాలపు పరిమళంలా అనిపిస్తుంటుంది. ‘ఇలా కలవడానికి ఇంకెంతమందిని చంపాలో? ఎంతమందికి యాక్సిడెంట్లు జరగాలో?’అంది చంచల అతని వైపు చూస్తూ. ‘అబద్ధాలు చెప్పకపోతే ఇంటరు ఆఖరులో ఉన్న నువ్వు, డిగ్రీ మొదట్లో ఉన్న నేను కలవడాన్ని ఎవరు ఒప్పుకుంటారు? అందరితో పోలిస్తే మనం చాలా బెటర్‌. కనీసం కాలేజీ మెట్లయినా ఎక్కాం. లోకమంతా ఏడు, ఎనిమిది తరగతుల్లోనే కళ్లుతెరుస్తోంది. అవసరాలు తీర్చుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పడంలో తప్పులేదని పెద్దలు ఏనాడో చెప్పారు. అయినా ఇలా అబద్ధాలు చెప్పి దొంగచాటుగా కలవడం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో చెప్పలేను. ఇప్పటికే మా క్లాస్‌మేట్స్‌ అందరూ మనిద్దరినీ చూసి కుళ్లుకుని చచ్చిపోతున్నారు’ అన్నాడు విశాల్‌. ‘ఏమంటున్నారో మన గురించి నీ క్లాస్‌మేట్స్‌?’ అడిగింది.

‘ఇంత అందగత్తెని ఎలా పడగొట్టావో టిప్స్‌ చెప్పమంటున్నారు’ అన్నాడు ఆమె కళ్లల్లోకి చూస్తూ. చంచల పెద్దగా నవ్వింది. తుఫానుగాలికి తెరచాప ఊగినట్లుగా కదిలిపోయాడు విశాల్‌.  ఆ నవ్వుని ఆపుకుంటూ ‘వాళ్ల కేం చెప్పావు?’ అడిగింది. ‘నీకు తెలియదా? నేను ఎంత కష్టపడితే నువ్వు నా పక్కనున్నావో!’ చిలిపిగా ఆమె కళ్లల్లోకి చూస్తూ అన్నాడు. కొద్దిరోజుల కిందట జరిగిన సంఘటనలన్నీ ఆమె మనసులో మెదిలాయి. కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎదురుపడే విశాల్‌ని చూసి తల దించుకునేది. కావాలని ఎదురుగా వచ్చి ‘తలెత్తి చూస్తే మాలాంటి ప్రాణాలు కొన్ని నిలబడ తాయిగా’ అన్నాడొకరోజు. ఎంతాపుకుందామన్నా నవ్వాగలేదు చంచలకు. ఏమీ మాట్లాడకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అది మొదలు  చంచల కనబడినప్పుడల్లా ఆమె నవ్వు మీదో, కళ్లమీదో, పలువరుస మీదో ఏదో ఒకటి మాట్లాడి నవ్వించేవాడు. అలా మొదలైన పరిచయం ఏ పేరు పెట్టుకోవాలో తెలియకుండానే చంచలను విశాల్‌కి దగ్గర చేసింది. చేతివేళ్ళతో చిటికె వేస్తూ ‘ఎక్కడికెళ్దాం ఇప్పుడు?’ అడిగాడు. ఆలోచనలో నుంచి బయటికి వచ్చి ‘నీకెలా తోస్తే అలానే! నాదేముంది?’ అంది చంచల. ‘సరే అయితే... పార్కుకెళ్దాం’ అన్నాడు విశాల్‌. అతని వంక కంగారుగానూ, భయంగానూ చూస్తూ ‘అమ్మో... పార్కుకా? నేను రాను’ అంది. ‘ఇష్టమైనవాణ్ణి చూడడానికి ఇన్ని అబద్ధాలు చెప్పిన నీకు పార్కంటే భయమెందుకు?’ అడిగాడు విశాల్‌.

     
‘నాలుగ్గోడల మధ్య అబద్ధం చెప్తున్నామని, నలుగురిలోనూ అలాగే తిరుగుతామా? తెలిసినవాళ్ల కంట్లో పడితే అంతే సంగతులు. రేపటినుంచి కాలేజీకీ కష్టమే..’ అంది. ‘ఓ అదా నీ భయం! కంగారుపడకు. లోకం గుడ్డిది. కళ్ల ముందు కలసి తిరుగుతున్నా పట్టించుకోదు. లోకానికి కళ్ళుంటాయిగానీ చూపుండదు. అందుకే వాళ్లముందు పడీపడీ నవ్వినా, కిందపడి దొర్లినా వాళ్లకు పట్టదు’ అన్నాడు.         
‘నువ్వెన్ని చెప్పినా నా భయాలు నాకుంటాయి కదా’ అంది. ‘పేరంటానికొచ్చి ముఖం దాచుకుంటే ఎలా? పలకరించకపోయినా పదిమంది వస్తారు. నడిచేదారిలో నలుగురూ ఎదురౌతారు. అలాగని నడక ఆపుకుంటామా?’ అన్నాడు విశాల్‌ భుజాలెగరేస్తూ.  చంచల తెరలు తెరలుగా నవ్వింది. కళ్లల్లో నీళ్ళు చిప్పిల్లేలా నవ్వింది. విశాల్‌ ఎప్పుడూ అంతే! మాటల్లో తెలియని మాధుర్యం ఉంటుంది. చెప్పే విషయంలో ఏదో అర్థంగాని లాజిక్‌ ఉంటుంది. ఆ ఇష్టమే అతనితో పరిచయాన్ని ఇక్కడిదాకా లాక్కొచ్చింది. ఇంట్లోవాళ్లకు భయపడకుండా అబద్ధాలు చెప్పడానికి, సంఘంలో విశాల్‌తో కలసి భయంలేకుండా తిరగడానికి అడుగులు నేర్పింది.  
∙∙ 
‘పార్క్‌ మనకోసమే తెరచినట్లున్నారు’ అంది చంచల. ‘మనలాంటి వాళ్లు చాలామంది ఉంటారులే’ అన్నాడు విశాల్‌. ‘బైక్‌ ఉంటే బాగుండేది. ఆటోలో వచ్చేసరికి ఒళ్లంతా హూనమైపోయింది’ అంది చంచల.     
‘అబద్ధాలన్నీ ఆయిల్‌కే ఖర్చు చేస్తే నిజానికి నీడెక్కడ దొరుకుతుంది? అయినా ఇక్కడికొచ్చాం కదా ... సర్దుకుని కూర్చుంటే అన్నీ పోతాయిలే కంగారుపడకు’ అన్నాడు విశాల్‌.పార్కంతా కలయజూసిన చంచలకు విశాల్‌ ఆ మాట ఎందుకన్నాడో అర్థమైంది. సిమెంట్‌ బెంచీలనిండా చీమలబారుల్లా సేదదీరుతున్న ప్రేమికులు కనిపించారు. చెట్టు మొదళ్లలోనూ, క్రోటన్‌ మొక్కల గుబుర్లలోనూ, గోడల చాటునా, పార్కులో సగం నిర్మాణంలో ఉన్న కట్టడాల మధ్యలోనూ చున్నీలను గొడుగులా మార్చుకుని పరవశంలో ఉన్న జంటలు కనిపించాయి. ఎవర్ని ఎవరూ పట్టించుకుంటున్న ఆనవాళ్ళు లేవు. ఎవరితో ఎవరూ మాట్లాడుకుంటున్న దాఖలాలు లేవు.        

ఒకరి వేలు ఎటువైపు చూపిస్తే రెండోవాళ్లు అటు చూస్తున్నారు. చేతిలో చేయి వేసుకుని, ఆ చేతిని గట్టిగా పట్టుకుని, ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ మైమరచిపోతున్నారు. అవకాశమేదో వెంటబడి తరుముతున్నట్లు, విడిచిపెడితే ఇక దొరకదన్నట్లుగా ఉన్నారందరూ. ఎక్కడో ఒకచోట ఒకరిద్దరు పిల్లల్ని ఆడిస్తున్న పెద్దవాళ్ళు పిల్లలు ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్తూ ఆయాస పడుతున్నారు. చేతికర్రలతో ఉన్న ముసలివాళ్ళు కాసేపు నడుస్తూ, మధ్యమధ్యలో కూర్చుంటూ నడుస్తున్నారు. ఆకాశం నిండా గుంపులు గుంపులుగా ఎక్కడికో తరలిపోతున్న పక్షులు కనిపించాయి.     
‘తొందరగా నడువు. ఎవరైనా చూస్తారు’ అంది చంచల.             

‘నేను చెప్పానుగా లోకం గుడ్డిదని. ఇక్కడ నిన్నెవరూ పట్టించుకోరు. పట్టించుకున్నా పలకరించరు. నోళ్ళకు తాళాలు బిగించి కళ్లకు వాకిళ్లు తెరిచేది ఇక్కడే’ అన్నాడు విశాల్‌.     
ఇద్దరూ నవ్వుకుంటూ పార్కులో ఎక్కడైనా ఖాళీ ఉందేమోనని చుట్టూ చూశారు. బట్టలకంటిన ఆకుల్ని, మట్టినీ దులుపుకుంటూ వెళ్లడానికి సిద్ధమైన జంట కనిపించేసరికి ఇద్దరికీ ప్రాణం లేచివచ్చింది. విడవలేకుండా పట్టుకున్న రెండు చేతుల్నీ, నడుస్తున్న నాలుగు కాళ్లనూ చూస్తూ వాళ్ళు ఖాళీచేసిన ప్రదేశంలో కూర్చున్నారిద్దరూ. అప్పటివరకూ అణిగిపోయిన పచ్చగడ్డి మళ్ళీ పైకిలేచి ఇద్దర్నీ ఆహ్వానించింది.   

‘మాట్లాడు ఏదైనా... నిశ్శబ్దంగా ఉండడానికి ఇదేమీ క్లాసు రూము కాదు’ అన్నాడు విశాల్‌. ‘ఏం చెప్పమంటావు? పదిహేడులో నేను, పద్దెనిమిదిలో నువ్వు...’             
‘ఆపాపు ఇక. నువ్వేమి చెప్పాలనుకుంటున్నావో అర్థమైంది. ఇరవైల్లో చేయాల్సిన పనులు ఇరవైల్లోనే చెయ్యాలి. అరవై వచ్చాక బట్టబుర్ర, పడకుండా నడవడానికి చేతిలో కర్రా ఎలాగూ తప్పవు కదా!’ అన్నాడు నవ్వుతూ.  చంచల మళ్ళీ నవ్వింది. చెట్టు నుంచి ఆకులేవో రాలిపడుతున్నట్లుగా, రబ్బరు ట్యూబులో నుంచి నీళ్ళు వేగంగా కదులుతున్నట్లుగా అనిపించింది. ఆమె వంక అబ్బురంగా చూస్తూ ‘పార్కుకొచ్చేముందే అబద్ధాలు చెప్పి అందర్నీ హత్య చేయాలిగానీ ఇక్కడికొచ్చి మనం ఆత్మహత్య చేసుకోకూడదు. ఇక్కడి కబుర్లన్నీ మనకు చెందినవే ఉండాలి. లోకమంతా మన అరచేతిలో ఉండాలి. గాలికూడా చొరబడనంత దగ్గరగా జరగాలి. నా ఊపిరి నీకూ, నీ ఊపిరి నాకూ మాత్రమే వినిపించాలి. ఏవో కొత్త కబుర్లతో ఒకరి చెవుల్ని ఒకరు మృదువుగా స్పృశించాలి. ఇదిగో ఇలా దగ్గరగా వచ్చి బుగ్గల్ని సున్నితంగా  ముద్దు...’    
‘ఆపాపు.. నలుగురిలో ఇలా...’ దగ్గరకు  వస్తున్న విశాల్‌ని వెనక్కి తోసి ‘వదిలితే ఇక్కడున్న వాళ్లందరి మాటలూ నువ్వే మాట్లాడేటట్లున్నావు’ అంది చంచల. ‘ఇన్నాళ్ళూ ఈ మాటలు ఎక్కడికెళ్లాయో! నిన్ను చూడగానే బయటికి తన్నుకొస్తున్నాయి’ అన్నాడు విశాల్‌.  ‘ఏదో ఇవన్నీ మొదట నాకే చెప్తున్నట్లు అంటున్నావే’ అంది చంచల.         
ఆమె అనాలోచితంగానే అంది. అయినా ఆ మాటలు విని గతుక్కుమన్నాడు విశాల్‌. చెట్టుకి జారబడిన వాడు సర్దుకుని కూర్చున్నాడు. ఒకప్పుడు చందనతో కలసి ఆ పార్కుకి వచ్చిన ఙ్ఞాపకాలు మనసులో మెదిలాయి. ఇంత కన్నా ఎక్కువ కబుర్లు వాగులా ప్రవహించాయి. ఇప్పుడు ఆ ఙ్ఞాపకాలన్నీ కాగితం పడవల్లా అదే వాగులో కొట్టుకు పోయాయి. పార్కుకెప్పుడొచ్చినా కొత్తగానే ఉండాలి, కొత్తవాళ్లతోనే రావాలి. పరిచయాలు చద్ది వాసన వేయకూడదు.     
‘ఏంటీ.. ఏం మాట్లాడవు?’ అంది చంచల.     
‘నువ్వు మాట్లాడుతుంటే అలాగే చూడాలనిపిస్తుంది. నాకు మాటలేం వస్తాయి?’ నమ్మించడానికి ఒక రాయి వేశాడు. ఆ రాయి సూటిగా మనసుకి తాకింది. అతని వంక ఆరాధనగా చూసింది చంచల.         
‘ఇలా ఎన్నాళ్ళు?’ అడిగింది.         
‘నీకూ నాకూ పెళ్లయ్యేవరకు’ అన్నాడు.     
‘ఏంటి?’ అన్నట్లు అతని వైపు చూసింది.     
‘అదే అదే మనిద్దరికీ పెళ్ళయ్యేవరకూ’ అన్నాడు వాక్యాన్ని సరిచేస్తూ.        
‘పార్కులన్నీ ఇలాగే ఉంటాయా? ఇక్కడే ఇలా ఉంటుందా?’ అడిగింది.          
‘ఏం అలా అడిగావు?’ అన్నాడు.     
‘నాలుగ్గోడల మధ్య జరిగే పనులన్నీ నలుగురిలో చేసేస్తున్నారుగా?’ అంది తలను చుట్టూ తిప్పి చూస్తూ చంచల. ‘నువ్వెక్కడ పార్కుకి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. పచ్చగడ్డి మీద కూర్చున్న వాళ్లందరూ పరవశంలో ఉంటారు. పరిగెత్తేవాళ్లు, నడిచేవాళ్లు మాత్రం కళ్లు మూసుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడినుంచో ఆయాసపడుతూ వచ్చిన జంటలన్నీ ఇక్కడికి రాగానే తీగల్ని చుట్టుకుంటూ, ఆకుల్ని కప్పుకుంటూ ఆదిమానవుల్లా మారిపోతారు. పార్కులంటే ఒకప్పుడు నడకకి... ఇప్పుడు ఇలా’ అన్నాడు  మెరిసే కళ్లతో  చంచల వైపు చూస్తూ. ‘ఏంటీ?’ రెట్టించింది చంచల. నవ్వాడు విశాల్‌. ఆమె సిగ్గుపడింది. ఆ సిగ్గులో ఏదో అమాయకత్వం తొంగిచూసింది. ‘బాబూ... బాగున్నావా?’ ఓ అపరిచిత కంఠం వినిపించడంతో అటువైపు తిరిగి ‘ఎవరూ?’ అన్నాడు విశాల్‌. వచ్చినతను కళ్లజోడు సవరించుకుంటూ ‘ఒకటి రెండుసార్లు నిన్ను ఇక్కడే చూసినట్లు గుర్తు బాబూ. ఈ అమ్మాయి ఇంతకుముందు వచ్చిన అమ్మాయిలా లేదే?’ అన్నాడు చంచల వైపు సూటిగా చూస్తూ.             
విశాల్‌ కంగారును కప్పిపెట్టుకుంటూ ‘లేదు తాతగారూ... నేనిదే ఇక్కడికి రావడం. మీరు ఎవర్ని చూసి ఎవరనకుంటున్నారో! అయినా వేరే పనేమీ లేనట్లు ఎవరెవరొస్తున్నారో చూడ్డమేనా మీ పని?’ అన్నాడు కొంచెం కోపంగా. ‘అయ్యో... మరోలా అనుకోకు బాబూ! ఎన్నాళ్లనుంచో ఈ పార్కులో నడవడానికి వస్తున్నాను. మొదటిసారి చూస్తే ఏమోగానీ ఒకటిరెండుసార్లు చూస్తే మాత్రం బాగానే గుర్తుంటుంది నాకు. ఏమోలే బాబూ... నేనే పొరబడి ఉంటాను. ఏమీ అనుకోకు బాబూ’ తనలో తానే గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు పెద్దాయన.                 

చంచల మనసునిండా ఆలోచనలు కమ్ముకున్నాయి. అర్థం తెలియని భయమేదో నిలువునా ఆవరించింది. కూర్చున్నచోట నుంచి దిగ్గున లేచి గేటువైపు నడవసాగింది. గేటుదాటి ముందుకు వెళ్తున్న పెద్దాయనను చూసి ‘తాతగారూ మీరు చెప్పింది నిజమేనా?’ అడిగింది చంచల. చంచలను చూస్తూ చిన్నగా నవ్వుతూ ‘నువ్వు పార్కుకి కొత్తేమో గానీ నేను పాతవాణ్ణేనమ్మా. చిన్నవాళ్ళు పెద్దవాళ్లను అనుకరించడం మంచిదే. కానీ ఎదిగిన తర్వాత చేయాల్సిన పనులన్నీ ఇంత చిన్న వయసులోనే చేయాలని ఆరాటపడడం మంచిది కాదమ్మా. అన్నీ సమకూర్చే తల్లిదండ్రుల మాట వినకుండా, అన్నీ దోచుకునే పోరంబోకుల వెంట తిరిగితే బతుకు చీకటవుతుంది’ చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు పెద్దాయన.వెనక్కి తిరిగి పార్కు లోపలికి చూసిన చంచలకు ఆయాసపడుతూ తనవైపే వస్తున్న విశాల్‌ కనిపించాడు. గబగబా నడిచి ఎదురుగా వచ్చిన ఆటోలో ఎక్కింది చంచల.

Advertisement
Advertisement