మీ పిల్లల్లో మాటలు ఆలస్యం అవుతున్నాయా? ఇలా చేశారంటే.. | Sakshi
Sakshi News home page

Express Language Disorder In Kids: మీ పిల్లల్లో మాటలు ఆలస్యం అవుతున్నాయా? ఇలా చేశారంటే..

Published Mon, Nov 22 2021 11:27 AM

Is Speech Delay In Your Children Know The Reasons - Sakshi

పిల్లల్లో సాధారణంగా 10 నెలలు లేదా ఏడాది నాటికి ముద్దుమాటలు (బాబ్లింగ్‌) మొదలై దాదాపు రెండేళ్ల వయసు నాటికి చాలావరకు కమ్యూనికేట్‌ చేస్తుంటారు. మూడేళ్లకు అన్ని మాటలూ వచ్చేస్తాయి. అయితే కొందరు చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వినడానికి దోహదపడే వినికిడి వ్యవస్థ, అలాగే మాట్లాడటానికి అవసరమైన వోకల్‌ కార్డ్స్, మాట్లాడేందుకు దోహదపడే గొంతులోని కండర నిర్మాణం... ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, కొందరిలో సహజంగానే మాటలు రావడం ఆలస్యమవుతుంటుంది.  ఆ పిల్లల్లో వారి భాష ఓ స్థాయి పరిణతికి రావడంలో జరిగే ఆలస్యం (లాంగ్వేజ్‌ మెచ్యురేషన్‌ డిలే) కావడం దీనికి కారణం.  ఇది వంశపారంపర్యంగా  వస్తూ ఉంటుంది. ఈ సమస్య అబ్బాయిల్లోనే ఎక్కువ. ఇలా మాటలు రావడం ఆలస్యమైన సందర్భాల్లో సాధారణంగా స్కూల్లో చేర్చే ఈడు నాటికి పిల్లలు తమంతట తామే మాట్లాడతారు.

ఇక కొందరిలో మాటలు రావడంలో ఆలస్యం జరగడం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలను (డిజార్డర్స్‌ను) సూచించే ఒక లక్షణం. ఉదాహరణకు వినికిడి లోపాలు, మానసికమైన సమస్యలూ, ఆటిజం వంటి కండిషన్, భాషను అర్థం చేసుకోవడం, అభివ్యక్తీకరించడంలో సమస్యలు (ఎక్స్‌ప్రెసివ్‌ రిసెప్టివ్‌ లాంగ్వేజ్‌ డిజార్డర్‌)... మొదలైనవాటిల్లో ఏదో ఒకదానివల్ల మాటలు రావడం ఆలస్యం కావచ్చు.

కొన్నిసార్లు అది ఎదుగుదల సమయంలో వచ్చే ఇతర ఆరోగ్య లోపాల వల్ల కూడా అయి ఉండవచ్చు. ఎక్స్‌ప్రెసివ్‌ లాంగ్వేజ్‌ డిజార్డర్‌ ఉన్న పిల్లలు భాషను ఒక కమ్యూనికేటివ్‌ సాధనంగా వాడటంలో విఫలమవుతారు. అయితే వారిలోని తెలివితేటలు, వినికిడి, ఉద్వేగభరితమైన ఫీలింగ్స్‌... తదితర  విషయాల్లోనూ మామూలుగానే ఉంటారు. తమ సంజ్ఞలు, సైగల (గెష్చర్స్‌) ద్వారా కమ్యూనికేషన్‌ అంతా  సాధారణంగానే నిర్వహిస్తుంటారుగానీ, మాటలు లేదా పదాలు పలకడం (వర్బల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌) ద్వారా తమ అభిప్రాయాలను  వెల్లడించడం మాత్రం చాలా పరిమితంగా ఉంటుంది. మరికొందరిలో భాషను నేర్చుకునే శక్తి కొంతమేరకు తక్కువగానే ఉంటుంది. వాళ్లలో మరికొన్ని కాంప్లికేషన్లూ వచ్చే అవకాశమూ ఉంటుంది. 



ఏం చేయాలి?  ఇలాంటి పిల్లల విషయంలో... వారు మాటలు నేర్చుకోవడం / మాట్లాడటం అనే ప్రక్రియ ఎందుకు ఆలస్యం అయ్యిందనే విషయంలో పూర్తి ఇవాల్యుయేషన్‌ అవసరం. ఇందుకోసం... ‘ఎర్లీ లాంగ్వేజ్‌ మైల్‌స్టోన్‌ స్కేల్‌ టెస్ట్‌’, ‘స్టాన్‌ఫోర్డ్‌ ఇంటెలిజెన్స్‌ టెస్ట్‌’, ఆడియోమెట్రీ, బ్రెయిన్‌ స్టిమ్యులస్‌ రెస్పాన్స్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల వల్ల  మాటలు రాకపోవడానికి కారణాలేమిటి, ఆ కారణాల తీవ్రత ఎంత, వాటి ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయన్న పలు విషయాలు తెలుస్తాయి.   ఇలాంటి పిల్లలున్నవారు ఒకసారి మీ కుటుంబ పిల్లల డాక్టర్‌కూ లేదా స్పీచ్‌ థెరపిస్ట్‌కూ చూపించాలి. ఒకసారి సమస్యనూ, తీవ్రతనూ తెలుసుకుంటే... ఆ తర్వాత ‘స్పీచ్‌ పాథాలజిస్ట్‌’లు పిల్లలకు మాటలు వచ్చే శిక్షణను
మొదలుపెడతారు.  

తల్లిదండ్రుల భూమిక 
ఇలాంటి పిల్లలకు మాటలు నేర్పే విషయంలో తల్లిదండ్రులు చాలా ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్లకూ కొంత శిక్షణ అవసరమవుతుంది. తల్లిదండ్రులు పూర్తి సహనంతో ఉంటూ, భాష విషయంలో తామూ పిల్లల స్థాయికి చేరుకుని, వాళ్లకు మాటలు నేర్పాలి. తల్లిదండ్రులు నిత్యం ఆ పిల్లలను ఉత్సాహపరుస్తూ... వారికి భాషతో పాటు ఇతర నైపుణ్యాలూ నేర్పడానికి సంసిద్ధంగా ఉండాలి. 


- డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ కన్సల్టెంట్‌
పీడియాట్రీషియన్‌ 

చదవండి: ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్‌... 90 ఏళ్ల వయసులో రిటైర్‌మెంట్‌..!!

Advertisement
Advertisement