మనాలి నుంచి లేహ్‌ వరకూ..చిరుతలా పరిగెత్తింది

21 Oct, 2021 00:26 IST|Sakshi
సూఫియా ఖాన్‌

అల్ట్రా రన్నర్‌ సూఫియా ఖాన్‌. లక్ష్యం 480 కిలోమీటర్లు. కాని మామూలు దారి కాదు. సముద్ర మట్టానికి 2000 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తున. చలి, మంచు, పర్వతాల దారి. కాని 146 గంటల్లో సాధించింది. ఈ దారిలో పరిగెత్తిన మొదటి మహిళ ఆమె. ‘ప్రపంచం మొత్తం పరిగెత్తాలని ఉంది’ అంటోందామె. అందుకు లేసులు కూడా బిగిస్తోంది.

సంప్రదాయ మారథాన్‌ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దానికి మించిన మారథాన్‌ను ఆల్ట్రా మారథాన్‌ అంటారు. సూఫియా ఖాన్‌ ఆల్ట్రా రన్నర్‌. అంటే ఏకధాటిగా వందల కిలోమీటర్ల మారథాన్‌ చేసే రన్నర్‌ అన్నమాట. ప్రపంచంలో ఆమెలా పరిగెడుతున్నవారు... రికార్డ్స్‌ సృష్టిస్తున్నవారు బహుశా మరొకరు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తి ఒక రికార్డు, గోల్డెన్‌ ట్రయాంగిల్‌ (జైపూర్, ఢిల్లీ, ఆగ్రా)లో పరిగెత్తి ఒక రికార్డు, తాజాగా మనాలి నుంచి లేహ్‌కు పరిగెత్తి ఒక రికార్డు నమోదు చేసింది. 35 ఏళ్ల వయసులో చిరుతలా పరిగెత్తే ఈమెను అందుకోవడం కష్టమేమి కాదు. కాకపోతే అందుకు మనమూ పరిగెత్తాల్సి ఉంటుంది.

అజ్మీర్‌ అమ్మాయి
అజ్మీర్‌లో పుట్టి పెరిగిన సూఫియాకు 16 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఆమెను పెంచింది. డిగ్రీ చేశాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చూసుకోమ్మా అంది. కాని సూఫియాకు ఏవియేషన్‌ రంగంలో పని చేయాలనిపించి ఒక ప్రయివేట్‌ ఎయిర్‌లైన్స్‌లో గ్రౌండ్‌స్టాఫ్‌గా చేరింది. అక్కడ బండ చాకిరీ. సంవత్సరాలు గడిచిపోతుండేవి. దానికి తోడు ఆరోగ్యం, ఉత్సాహం సన్నగిల్లడం కూడా. ‘నన్ను నేను ఒకరోజు అద్దంలో చూసుకుంటే నా ఫిట్‌నెస్‌ అంతా పోయిందనిపించింది. డ్యూటీ చేస్తూనే ఆరోగ్యం కాపాడుకోవాలంటే రోజూ ఒక 15 నిమిషాలన్నా పరిగెత్తాలని అనుకున్నాను. అలా పరిగెత్తడం మొదలెట్టాను. అప్పటి వరకూ నాకు ఆటలంటే ఇష్టం లేదు. కాని పరిగెడుతుంటే నా శరీరం చిరుతలా మారేది. నాకు పరుగు సరిౖయెనది అని ఇంకా సాధన చేశాను’ అంటుంది సూఫియా.

మారథాన్‌లో సూఫియా

సందేశం కోసం పరుగు
పరుగులో ఆనందం తెలిశాక రొడ్డకొట్టుడు ఉద్యోగాన్ని వదిలేసింది సూఫియా. ఒక సందేశం కోసం తన పరుగును దేశానికి చూపాలనుకుంది. ‘మానవత్వమే ముఖ్యం’ అనే సందేశంతో 2018లో మొదట ఇండియన్‌ గోల్డెన్‌ ట్రయాంగిల్‌ మధ్య పరిగెత్తింది. 720 కిలోమీటర్ల ఈ దూరాన్ని 16 రోజుల్లో ముగించి రికార్డు స్థాపించిందామె. దాంతో ఆమె పరుగు మీద అందరి దృష్టి పడింది. ఆ తర్వాత 2019లో అంతకు మించి సాహసం చేసింది సూఫియా. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్ల దూరం– శ్రీనగర్‌తో మొదలయ్యి లూధియానా మీదుగా గజియాబాద్, కోట, ఇండోర్, ముంబై, బెలగామ్, బెంగళూరు, మదురైలను దాటి కన్యాకుమారి వరకూ ఆమె పరిగెత్తింది. ఏప్రిల్‌ చివరి వారంలో మొదలెట్టి రోజుకు 50 కిలోమీటర్ల లెక్కన పరిగెడుతూ దాదాపు 90 రోజులలో ఆమె ఈ పరుగును పూర్తి చేసి మరో రికార్డును స్థాపించింది. ఇప్పుడు ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో మనాలి, లేహ్‌ల మధ్య పరిగెత్తింది.

‘నీ హద్దుల్ని దాటు’
స్త్రీలకు అన్నీ హద్దులే. స్త్రీలు చేసే సాహసాలకు అన్నీ ఆటంకాలే. అందుకే సూఫియా ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో సెప్టెంబర్‌ 25, 2021 ఉదయం తన ‘హిమాలయన్‌ ఆల్ట్రా రన్‌ ఎక్స్‌పెడిషన్‌’ మనాలి నుంచి మొదలెట్టింది. 480 కిలోమీటర్ల దూరాన్ని అక్టోబర్‌ 1న లేహ్‌లో ముగించింది. ఇలా ముగించడం సామాన్యం కాదు. ఇలా ముగించిన మహిళ గతంలో లేదు. అందుకే సూఫియా సాహసం గొప్ప స్ఫూర్తిదాయకం అయ్యింది. మనాలి సముద్ర మట్టానికి 6,700 అడుగుల ఎత్తు ఉంటుంది. లేహ్‌ 11, 500 అడుగుల ఎత్తు. ఈ రెండు ఎత్తుల మధ్య పరిగెత్తాలి. చలి ఈ దారిలో ఒక్కోసారి మైనస్‌ 5 డిగ్రీలు ఉంటుంది. ఆక్సిజన్‌ గాలిలో అరవై శాతమే ఉంటుంది. పెద్ద సవాలు. ‘అయినా నేను పరిగెత్తాను. దీనికి ముందు ఒక పదిహేను రోజులు ఈ పర్వతాల్లో క్యాంప్‌ వేసి ఇక్కడి వాతావరణానికి నా శరీరం అలవాటు పడేలా చేసుకున్నాను.’ అంది సూఫియా.

ప్రాణాపాయం లెక్కచేయక
మనాలి, లేహ్‌ల మధ్య రోడ్లు బాగుండవు. ఆ దారిలో వాహనాల్లో వెళుతున్నవాళ్లే ఆక్సిజన్‌ చాలక ఒక్కోసారి మరణిస్తారు. ‘నాక్కూడా ఆ దారిలో ఉండే గ్రామీణులు, ఆర్మీ వాళ్లు చాలా జాగ్రత్తలు, ప్రాణాపాయ పరిస్థితులు చెప్పారు. ప్రాణాయామం, యోగా వల్ల నా లంగ్స్‌ను గట్టి పరుచుకోవడం వల్ల నేను ధైర్యం చేశాను. కాని ఆ ధైర్యం చేయడం వల్ల ఎన్నో మనోహర దృశ్యాలు చూశాను. లడాఖ్‌ లోయ ముఖద్వారం ‘సర్చూ’, సింధూ నది ప్రవాహం, తంగ్‌లంగ్‌ లా పాస్‌... ఇవన్నీ జీవితంలో ఒక్కసారైనా చూడాలి’ అందామె. సూఫియాకు సపోర్ట్‌ టీమ్‌ ఉంటుంది. అది ఆమె వెంట ఉండి ఆ పరుగును, రాత్రి బసను ప్లాన్‌ చేస్తుంది.

రెండుసార్లు గిన్నెస్‌బుక్‌లో ఎక్కిన సూఫియా తర్వాతి అంకం ‘ప్రపంచాన్ని పరుగుతో చుట్టి రావడమే’. ఆ రోజు కూడా బహుశా చూస్తాం. తథాస్తు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు