అప్పుడు ఆప్తుడే.. మరిప్పుడో..!!! | Sakshi
Sakshi News home page

Chaganti Koteswara Rao: అప్పుడు ఆప్తుడే.. మరిప్పుడో..!!!

Published Mon, Oct 10 2022 11:20 AM

Sumathi Satakam: Chaganti Koteswara Rao About Vibhishana Nature - Sakshi

Chaganti Koteswara Raoకమలములు నీటబాసిన/కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్‌/ తమ తమ నెలవులు దప్పిన/ తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ...అన్నాడు బద్దెన సుమతీ శతకంలో.

నీళ్ళల్లో ఉన్న తామర మొగ్గ విచ్చుకోవడానికి కారణమయిన సూర్యనారాయణుడు, అదే తామరతూడును నీళ్ళల్లో నుంచి తీసి ఒడ్డున పెడితే ...ఆయన వాడివేడి కిరణాలు సోకి అది వాడిపోతుంది, కమలాప్తుడు అంటే నీళ్ళల్లో ఉన్న కమలానికి బంధువు, నీళ్ళనుంచి బయటికి వచ్చిన పిదప శత్రువయిపోయాడు.

విభీషణుడు రావణునికి సోదరుడు. కానీ ఎప్పుడూ ధర్మంవైపే నిలబడతాడు. అన్నగారు అధర్మానికి పాల్పడినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటాడు. అలా చెప్పే వారు మన శ్రేయోభిలాషులని గుర్తించకపోతే చాలా ప్రమాదకరం. హనుమ రాయబారం తరువాత రావణాసురుడు కోపంతో హనుమ కంఠాన్ని నరికేయమన్నాడు. ఆయన్ని సంహరించబోతున్నారు. విభీషణుడు జోక్యం చేసుకొన్నాడు.

‘అన్నయ్యా! నీకు తెలియని ధర్మం లేదు కదా...  అతను దూత. ఎవరో చెప్పి పంపినవి ఆయన చెబుతున్నాడు. అవి దూత అభిప్రాయాలు కావు కదా. దూత పరిధి దాటాడనిపిస్తే స్వల్పంగా శిక్షించవచ్చు. అంతేకానీ సంహరిస్తానంటే ఎలా..? పైగా నీవితన్ని సంహరిస్తే నీ అభిప్రాయాలు అవతలివారికి ఎలా చేరవేయగలవు? కాబట్టి వద్దు.. అన్నాడు. రావణుడు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అటువంటి ధర్మాత్ముడు పక్కన ఉన్నంతకాలం ... ఉపద్రవాలు ప్రాణాంతకం కాకుండా ఉన్నాయి. కానీ తరువాత జరిగిన పరిణామాలవల్ల విభీషణుడు రాముడి పక్కన చేరిపోయాడు.

ఇంద్రజిత్తు రాముడిపై యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బ్రహ్మగారు ఒకానొకప్పుడు ఆయనకు వరం ఇస్తూ...‘‘నికుంభిలా (దట్టమైన అడవిలో ఉన్న ఒక దేవాలయం. అక్కడికి చేరుకోవడం చాలా ప్రమాదకరం) కు వెళ్ళి హోమం చెయ్యి. దానిలోంచి వచ్చిన రథం మీద కూర్చొని యుద్ధానికి బయల్దేరితే... నువ్వు మేఘాలలో ఉండి దుర్నిరీక్షవుడవుతావు. నిన్ను యుద్ధంలో గెలవడం ఎవరికీ సాధ్యం కాదు.’’ అని వరమిస్తూనే...‘‘నువ్వు నికుంభిలా చేరకపోయినా, చేరి హోమాన్ని పూర్తి చేయలేక పోయినా, నువ్వు ఆయుధాన్ని ధరించి ఉండగా నీపై యుద్ధానికి వచ్చినవాడే నీ ప్రాణాలను హరిస్తాడని గుర్తించు’’ అని హెచ్చరించాడు.

ఈ రహస్యం విభీషణుడికి తెలుసు. ఇప్పుడాయన రాముడి పక్షంలో ఉన్నాడు. అదంతా రాముడికి తెలిపి... ఇపుడు ఇంద్రజిత్తు నికుంభిలా చేరుకున్నాడు... అని కూడా చెప్పి రాముడి ఆజ్ఞతో లక్ష్మణస్వామిని తీసుకొని వెళ్ళాడు. ఇంద్రజిత్తు హోమాన్ని మధ్యలోనే ఆపేసి యుద్ధానికి వచ్చాడు. ఆ తరువాత లక్ష్మణుడి చేతిలో చచ్చాడు.

అంటే విభీషణుడు స్థానం తప్పిన కారణంగా లంకకు, రావణాసురుడికి చేటు వచ్చింది. అందుకే బద్దెన చెప్పింది.. ఒక్కొక్కసారి ఒక్కొక్కస్థానంలో మిత్రుడిగా ఉన్నవాడు, స్థానం తప్పితే శత్రువయిపోతాడు. మన పక్కన ఉన్నవారిలో మన శ్రేయస్సు కోరి కొన్ని కఠినమైన సలహాలు ఇచ్చినా, వాటిని  పరిశీలించి ఓర్పుతో, విచక్షణతో మసలుకొన్నప్పుడు అవాంఛిత ప్రమాదాలు మాత్రం ఎదురుకాకుండా ఉంటాయన్నదే బద్దెన ఇస్తున్న సలహా. 
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 
చదవండి: మంచి మాట..: ఏది నిజమైన సంపద?

Advertisement
Advertisement