మాది దిగువ వీధి కాదు..ఇందిరా నగర్‌ | Sakshi
Sakshi News home page

మాది దిగువ వీధి కాదు

Published Tue, Jul 4 2023 12:46 AM

TamilNadu civil engineer strived for a year to have her street name changed - Sakshi

‘కీజ తెరు’ అనంటే తమిళంలో ‘దిగువ వీధి’ అని అర్థం. ప్రతి ఊరిలో దిగువ వీధి ఉంటుంది. దిగువ వీధిలో ఎవరుంటారో ఊరి వారికి తెలుసు. దళితులు. వారు నివసించే ప్రాంతాన్ని ఆ విధంగా గుర్తిస్తారు. ‘ఇలా పేరులో వివక్షను తొలగించండి’ అని తమ వాడ పేరును మార్చడానికి సంవత్సరం పాటు పోరాడింది అనసూయ అనే అమ్మాయి. దిగువ వీధికి బదులుగా వారి వీధి మొన్నటి జూలై 1న ‘ఇందిరా నగర్‌’ అయ్యింది. వివక్ష గుర్తులను చెరిపే పోరాటం కొనసాగిస్తానని అంటోంది అనసూయ.

తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ పదవి స్వీకరించాక 2022 అక్టోబర్‌లో గ్రేటర్‌ చెన్నై అంతటా కులాలను సూచించే వీధుల పేర్లను, భవంతుల పేర్లను తొలగించవలసిందిగా ఆదేశించాడు. దేశంలో అన్నిచోట్ల ఉన్నట్టే తమిళనాడులో కూడా ఊళ్లలోని కొన్ని వీధులను కులాల పేర్లతో పిలవడం వాడుకలో ఉంది.

సామాజిక స్పృహ పెరిగాక ఈ ధోరణి తగ్గినా చైతన్యం ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా దళితుల విషయంలో. వీరికి ఆలయాల ప్రవేశంలోగాని, ఊరి కట్టుబాట్లలో ప్రాధాన్యం ఇవ్వడంలోగాని వివక్ష పాటిస్తున్నారనే ఎన్నో వార్తలు తమిళనాడు నుంచి వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అనసూయ శరవణ ముత్తు అనే 28 ఏళ్ల సివిల్‌ ఇంజినీర్‌ తన ఊరిలోని తన వాడకు మర్యాదకరమైన పేరు సాధించడంలో విజయం పొందింది.

ఆది ద్రావిడార్‌ తెరు
తమిళనాడులోని అరియలూర్‌ జిల్లాలో ఆనందవాడి అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో 1994లో దళితులకు పట్టాలిచ్చారు. 2000 సంవత్సరానికి 100 కుటుంబాలు అక్కడ ఇళ్లు కట్టుకుని తమ పేటకు ‘ఇందిరా నగర్‌’ అని పేరు పెట్టుకున్నారు. అయితే వారు పెట్టుకునే పేరు వారు పెట్టుకోగా ఊరు వారిని తాను ‘ఎలా గుర్తించాలనుకుంటున్నదో’ అలా గుర్తించి ఆ పేటను ‘ఆది ద్రావిడార్‌ తెరు’, ‘పార తెరు’, ‘ఆది ద్రావిడార్‌ తెరు’, ‘కీజ తెరు’, ‘దళిత కాలనీ’... ఇలా పిలవడం మొదలెట్టింది.

ఇవన్నీ కూడా దళితులు నివసించే ప్రాంతాన్ని సూచించేవే. ‘నా చిన్నప్పుడు స్కూల్లో మా పేట పేరు చెప్పిన వెంటనే నేనెవరో పోల్చుకునేవారు. అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను’ అని ఇదే ప్రాంతం, సామాజిక వర్గం నుంచి చదువుకుని సివిల్‌ ఇంజనీర్‌ అయిన అనసూయ శరవణముత్తు అంది. ‘నేను కాలేజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెళ్లిపోయాను. 2022లో తిరిగి వస్తే ఇంకా కులాన్ని సూచించే పేరుతోటే నా పేటను పిలుస్తున్నారు. ఇది ఎంతమాత్రం కుదరదు అని నిశ్చయించుకున్నాను’ అంది అనసూయ.

అందరితో పోరాడి...
ఇందిరా నగర్‌ అనే పేరును రెవిన్యూ వారు ఏ మాత్రం పట్టించుకోకుండా ‘దిగువ వీధి’ అనే పేరుతోనే వీరి పేటను రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అలాగే రేషన్‌ కార్డుల్లో, ఆధార్‌ కార్డుల్లో, ఓటర్‌ కార్డుల్లో, చివరకు పాస్‌పోర్టుల్లో కూడా ఇందిరా నగర్‌ అని తప్ప రకరకాల వివక్ష పేర్లతో ఇక్కడ నివసిస్తున్న దళితుల గుర్తింపు కార్డులు నమోదై ఉన్నాయి. దాంతో అనసూయ 2022 ఆగస్టు నుంచి పోరాటం మొదలెట్టింది. ‘మొదట కలెక్టర్‌ చుట్టూ తిరిగాను. తిప్పించుకుని తిప్పించుకుని అక్టోబర్‌ నాటికి అఫీషియల్‌గా రికార్డుల్లో మార్చారు.

కాని అసలు సమస్య పంచాయతీతో వచ్చింది. ఆనందవాడి పంచాయతీ మా పేటను దిగువ వీధి అని పిలవకూడదనే తీర్మానం చేయడానికి ఏమాత్రం ముందుకు రాలేదు. నేను పోరాడితే ఫిబ్రవరిలో తీర్మానం చేశారు. ఆ తర్వాత పంచాయితీ పెద్దలొచ్చి మా పేట ముందు బోర్డు పెట్టే కార్యక్రమంలో పాల్గొనమని ఎన్నిసార్లు తిరిగినా రాలేదు. దాని కోసం మళ్లీ పోరాడాల్సి వచ్చింది. చివరకు మొన్న జూలై 1న పంచాయతీ పెద్దలంతా వచ్చి బోర్డును నిలబెట్టి వెళ్లారు’ అని తెలిపింది అనసూయ.

వివక్షాపూరితం
వెనుకబడ్డ, దళిత వర్గాలను సులువుగా గుర్తించేందుకు ఎప్పటి నుంచో వారు నివసించే ప్రాంతాలకు వివక్షాపూరితమైన పేర్లు పెట్టే ఆనవాయితీ ఉందని ఈ ఉదంతం విన్నాక అనసూయను అభినందిస్తూ విల్లుపురం ఎంపీ రవికుమార్‌ అన్నారు. ‘నువ్వు ఎక్కడుంటావు అనే ప్రశ్నతో ఎదుటివారి కులం ఏమిటో ప్రాంతాన్ని బట్టి అర్థమవుతుంది. దీంతో వివక్ష మొదలవుతుంది. ఇలాంటి వివక్షాపూరితమైన పేర్లను రాష్ట్రమంతా తొలగించాలి’ అని రవికుమార్‌ అన్నారు.

అనసూయలాంటి అమ్మాయిలు పూనుకుంటే అదెంత సేపు?

Advertisement
Advertisement