Tips For How To Handle Well Relationship Between Husband And Wife In Telugu - Sakshi
Sakshi News home page

భార్యాభర్తలు కలిసి ఉండటం ఎందుకు కష్టమవుతోంది.. కుటుంబాన్ని కాపాడుకోలేమా?

Published Fri, May 19 2023 11:27 AM

TIPS For How To Handle Well Relationship Between Husband And Wife - Sakshi

అపనమ్మకం, ఆర్థిక కష్టాలు.. వ్యసనాలు, పొసగని అంచనాలు కమ్యూనికేషన్‌ గ్యాప్, అవాంఛిత సంబంధాలు.. భార్యాభర్తల మధ్య తగాదాలకు కారణాలై పెను పరిణామాలకు దారి తీస్తున్నాయి. భార్య మీద  కోపం, భర్త మీద అసహనం పిల్లల మీద, పరస్పరం పగ తీర్చుకునేలా చేస్తున్నాయి. క్షణికోద్రేకం జీవితాలను నాశనం చేస్తున్నది. కుటుంబాన్ని కాపాడుకోలేమా? కనీసం తక్కువ నష్టంతో సమస్యలను సరిచేసుకోలేమా? ఇవాళ నివురుగప్పిన నిప్పులా ఉన్న అన్ని కుటుంబాలు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. 

సులభంగా బతకడం అత్యంత జటిలం అవుతున్న కాలం ఇది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు కలిసి బతకడం ఎందుకు జటిలం అవుతుంది? భార్య గృహిణిగా లేదా ఉద్యోగిగా ఉండొచ్చు. భర్త ఏదో ఒక సంపాదనపరుడై ఉండొచ్చు. పిల్లలు చదువుకుంటూ ఉండొచ్చు. ఇల్లు గడవడానికి, పిల్లల్ని చదివించడానికి,  అవసరాలకు తగిన సంపాదన ఉంటే సులభంగా, సంతోషంగా జీవించడం సాధ్యం అవుతుందా? ఎందుకు అశాంతి వస్తున్నది. భార్య లేదా భర్త ఎందుకు తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు?

ఎందుకు క్షణికోద్రేకంలో పిచ్చి పనులు చేస్తున్నారు. ఎందుకు ఏదైనా తీవ్ర చర్య చూపితే తప్ప భార్యకో, భర్తకో బుద్ధిరాదని అనుకుంటున్నారు. వారి మనసుల్లో ఇంత కల్లోలం రేగుతుంటే రక్త సంబంధీకులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అను సమాజం ఏం చేస్తోంది? ఇదంతా ఏమిటి? ఇంత రుగ్మతలోకి కుటుంబాలు వెళుతుంటే సమాజం కూడా రుగ్మతలోకి వెళుతున్నట్టేనని ఎందుకు అందరం జాగృతం కావడం లేదు. ఇవి ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న.
చదవండి: ఇంటర్నేషనల్‌ కాల్స్‌ వస్తున్నాయా?! ఒక్క క్లిక్‌తో అంతా ఉల్టా పల్టా!

సహనా వవతు
మన సంస్కృతిలో ‘సహనా వవతు’ అనే భావన అవసరం పెద్దలు ఎప్పుడో చెప్పారు. ‘కలిసి ముందుకు సాగడం’ దీని అర్థం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వధువు లేదా వరుడు రేపు ఏర్పరచుకోబోయే కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా వంటబట్టించుకోవాల్సిన సూత్రం ఈ సహనా వవతు. ఇంతవరకూ నేను ఒక్కడిని ఇకపై కలిసి జీవించాలి అని అర్థం చేసుకుంటే, కలిసి జీవించడం అంటేనే సర్దుబాటు అనుకుంటే చాలా సమస్యలు రావు.

భార్య/భర్త పూర్తిగా నచ్చేలా లేకపోయినా, పిల్లల ప్రవర్తన పూర్తిగా లోబడి ఉండకపోయినా, ఇంట్లో రకరకాల అభిప్రాయ భేదాలు వస్తూ ఉన్నా అవన్నీ సర్దుబాటు చేసుకునేలా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండాలి. తెగేదాకా లాగని మనస్తత్వం  పొదు చేసుకోవాలి. లేకపోతే అశాంతి...  ఆందోళన.

ఏడు కారణాలు 
భార్యాభర్తల మధ్య గొడవలకు, ఘర్షణకు, వాగ్వివాదాలకు ప్రధానంగా 7 కారణాలు కనిపిస్తాయి. 
మానసిక దూరం:
భార్యాభర్తల మధ్య మానసిక దూరం పెరిగి΄ోతే ఒక చూరు కింద వారు ఎన్నేళ్లు జీవించినా వారు సన్నిహితులు కారు. నిజమైన సంతోషం పొందలేరు. తమ మధ్య మానసిక దూరం పెరిగిందని భార్యాభర్తలకు తెలిసినా దానిని నివారించడానికి ప్రయత్నించరు. ఫలితం.. ఏదో ఒక పెను ఘటన. 
చదవండి: మా పాట అడవి దాటింది.. ఆదివాసీ గాయని లక్ష్మీబాయ్‌ 

పెంపకం కొట్లాట: పిల్లల విషయంలో నిరంతర తగువు. ఒకరు వెనకేసుకు రావడం ఒకరు కఠినంగా ఉండటం... చదువు, స్కూళ్ల విషయంలో రభస... తిండి గురించి మరో తగవు... మార్కులు, హోమ్‌ వర్క్‌లు... కొద్దిసేపు కూచుని ఓర్పుగా మాట్లాడుకుంటే ఎవరైనా ఎక్స్‌పర్ట్‌ సలహాకు తల వొగ్గితే ఈ సమస్య ఉండదు. కాని వినరు.

కమ్యూనికేషన్‌ లోపం: ఏదీ చెప్పరు. చెప్పుకోరు. చెప్పాలని గుర్తించరు. అతని ఖర్చు ఆమెకు తెలియదు. ఆమె కొనుక్కోవాలనుకుంటున్న వస్తువు ను అతను కొనివ్వడు. బంధువులు, స్నేహితులు వారి రాకపోకల గురించి, వాళ్ల ఇళ్లకు వెళ్లడం గురించి మాట్లాడుకోరు. వీలు కాదు, వీలవుతుంది, వెళ్లాలి, వెళ్లక్కర్లేదు.. ఇవి ఉమ్మడి అంగీకారంతో జరగాల్సిన నిర్ణయాలు. అలా లేనప్పుడే ఆగ్రహం, పంతం.

ఫుల్‌స్టాప్‌ లేని వాదనలు: ఒకరు వాదిస్తుంటే మరొకరు తగ్గడం జరిగితే ప్రమాదం ఉండదని ఇరువురికీ తెలుసు. కాని వాదనలు పెంచుకుంటూ పోతారు. పాత గొడవలు తవ్వుతారు. పై చేయి సాధించడానికి చెత్త మాటలు, అబద్ధాలు, అభాండాలు వేసి గాయపరుస్తారు. ఒకరినొకరు అవమానించుకుంటారు. 
చదవండి: భయం లేకుండా స్త్రీలు పార్కులకు వెళ్లొచ్చు.. ఇవి వారికి మాత్రమే!

ఆర్థిక సమస్యలు: పెళ్లి సమయంలోనే ఇరువురి ఆర్థిక స్థితి తెలుసుకాబట్టి ఆ గ్రాఫ్‌ చేరుకునే బిందువును అంచనా కట్టుకుని జీవితాన్ని మొదలెట్టాలి. మనం సామాన్య ఉద్యోగులం అయినా పెద్ద ఉద్యోగాలు చేసే జంటతో పోల్చుకుంటే ఆ ఇమిటేషన్‌తో అప్పుసప్పులు చేస్తే ఇ.ఎం.ఐలలో ఇరుక్కుపోతే ఆర్థిక సమస్య లు వస్తాయి. డబ్బు విషయంలో ప్రతి పైసా ఇద్దరి అవగాహనలోనే వచ్చినా, ఖర్చు అయినా మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల్లో ఎవరికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోయినా సమస్యలు పెరుగుతాయి. ఇది మరీ రిపేరు చేసుకోలేని సమస్య మాత్రం కాదు. 

ఆరోగ్య సమస్యలు: బిజీ లైఫ్‌ వల్ల ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. భర్త ఆరోగ్యం గురించి భార్య శ్రద్ధ పెట్టకపోయినా, భార్య ఆరోగ్యాన్ని భర్త పట్టించుకోకపోయినా లోలోపల ఆ కోపం ఉంటుంది. ఒకవేళ ఇరువురిలో ఒకరికి అనారోగ్యం వస్తే దాని మిషగా హర్ట్‌ చేసుకోవడం సూటిపోటి మాటలనడం ఇంకా ప్రమాదం. అనారోగ్యకాలంలో భార్యాభర్తల మధ్య బంధం చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతులు అవుతారు. కుటుంబ ఆరోగ్యం కూడా కా΄ాడబడుతుంది. 

అవాంఛిత స్నేహాలు: చేతిలో ఫోను.. ఎవరెవరితోనో స్నేహాలు.. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య చేసే స్నేహాలు (లైంగికమే కానక్కర్లేదు) కాపురానికి ప్రమాదంగా మారుతాయి. అవి మానేయమని భర్త/భార్య కోరితే మానేయడమే మంచిది. కుటుంబం కంటే ఆ స్నేహం ముఖ్యం కాదు. ఇవాళ న్యూస్‌పేపర్లలో వస్తున్న చాలా వార్తలు కుటుంబ జీవనంలో చోటు చేసుకుంటున్న పెను విషాదాలను చూపుతున్నాయి. కుటుంబం అందమైనది. అందరికీ అవసరమైనది. చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని నిర్వహించాలి. ఆ సంగతి అందరూ అర్థం చేసుకోవాలి.

Advertisement
Advertisement