పాపకు వైట్‌డిశ్చార్జా?

13 Sep, 2020 07:38 IST|Sakshi

 సందేహం 

నెల రోజుల కిందట ప్రసవించాను. పాప. అయితే పది రోజులగా పాపకు వైట్‌ డిశ్చార్జ్‌ అవుతోంది. కరోనా వల్ల ఆసుపత్రికి వెళ్లలేక ఫోన్‌లోనే డాక్టర్‌ను సంప్రదిస్తే స్కానింగ్‌ చేయాలంటున్నారు. మా అమ్మమ్మ ఏమో.. ఇది సర్వసాధారణం ఏంకాదు అంటోంది. కాని నాకు భయంగా ఉంది. అంత చిన్న పాపకు వైట్‌ డిశ్చార్జా? కారణమేమై ఉండొచ్చో చెప్పగలరు.
– టి. సంధ్యా కిరణ్, తిరుపతి
తల్లి కడుపులో ఉన్నంత కాలం పాపపైన తల్లిలోని ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ప్రభావం ఉంటుంది. పుట్టిన తర్వాత తల్లి యొక్క హార్మోన్‌ ప్రభావం ఉన్నట్లుండి ఆగిపోవడం వల్ల, కొందరిలో పుట్టిన పాపల్లో కొన్ని రోజులు తెల్లబట్ట అవ్వడం సహజం. కొందరిలో కొద్దిగా బ్లీడింగ్‌ కూడా అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. తెల్లబట్టలో వాసన వస్తుందా, జనేంద్రియాల చుట్టు పక్కలా ఎర్రగా ఉందా, మూత్రం వెళ్లేటప్పుడు పాప బాగా ఏడుస్తుందా గమనించుకోవాలి. కొన్ని సార్లు మోషన్‌ చేసిన తర్వాత చాలా సేపు డైపర్‌ మార్చకుండా ఉన్నప్పుడు, క్రిములు ముందుకు పాకి, యోని భాగం దగ్గరకు చేరి ఇన్‌ఫెక్షన్‌కు కారణం కావచ్చు. అలాంటప్పుడు తెల్లబట్టలో దురద, యోని చుట్టూ ఎర్రగా ఉండటం, వాయడం వంటివి జరగవచ్చు. డైపర్‌ మార్చేటప్పుడు శుభ్రమైన తడిబట్ట లేదా వెట్‌ వైప్స్‌తో ముందు నుంచి వెనకకి తుడవాలి. జనేంద్రియాల వద్ద కూడా మలం అంటుకొని ఉంటే, ఆల్కహాల్, వాసనలేని వెట్‌వైప్స్‌తో శుభ్రం చేయాలి.

మా పెళ్లయి సెవెన్‌ మంత్స్‌ అవుతోంది. పెళ్లవగానే వన్‌ మంత్‌కే నేను కెనడా వచ్చేశాను. తను హైదరాబాద్‌లోనే ఉంటోంది. తనతో నా ప్రాబ్లం ఏంటంటే ఆమె బాడీ ఓడర్‌. కరోనా వల్ల ప్రస్తుతం దూరదూరంగా ఉన్నాం. తర్వాతైనా తను నా దగ్గరకు రావల్సిందే కదా. చాలా సెన్సిటివ్‌ ఇష్యూ. ఎలా డీల్‌ చేయాలో చెప్పగలరు ప్లీజ్‌...
– సాయి ప్రణీత్, టొరొంటో
ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి వారిలో జరిగే రసాయన క్రియలు, హర్మోన్స్‌లో మార్పులు లాంటి అనేక కారణాల వల్ల ఒక్కొక్కరి నుంచి వేరే వేరే వాసనలు వస్తుంటాయి. కొందరిలో ఎక్కువగ చెమట పట్టడం, అధిక బరువు, ఇన్‌ఫెక్షన్స్, చంకలలో, జనేంద్రియాల దగ్గర రోమాలు ఎక్కువగా ఉండి వాటిలో ఇన్‌ఫెక్షన్స్, నోటి దుర్వాసన, తలలో జిడ్డు, చుండ్రు, తినే ఆహారం వల్ల, నీరు సరిగా తీసుకోకపోవడం, ఇంకా అనేక కారణాల వల్ల బాడీ ఓడర్‌లో మార్పులు వచ్చి, పక్కన వాళ్లని ఇబ్బంది పెడుతుంది. కొందరిలో కిడ్నీ, మెటబాలిక్‌ డిజార్డర్‌ సమస్యలు, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా బాడీ ఓడర్‌లో తేడా ఉంటుంది. అందులో భార్యా భర్తల మధ్య బాగా ఇబ్బంది ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్‌ ఇష్యూ. కాబట్టి దీనిని సెన్సిటివ్‌గానే డీల్‌ చేయాలి. వీలైనంతవరకు తనకి మెల్లగా, ఓర్పుగా, చెప్పడానికి ప్రయత్నించాలి. ఇందులో శారీరక శుభ్రత చాలా ముఖ్యం. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం, బ్రష్‌ చేయడం, సక్రమంగా రోమాలు తీసివేయడం, అవసరమైతే డియోడరెంట్‌ వాడటం, మంచినీళ్లు కనీసం రోజుకు 3 లీటర్లు తీసుకోవడం, మితమైన పోష్టికాహారం వంటి ప్రాథమిక చర్యలతో చాలా వరకు ఫలితం ఉంటుంది. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, ఇన్‌ఫెక్షన్‌లు ఉంటే వాటికి తగ్గ చికిత్స తీసుకోవడం, రక్తంలో, హార్మోన్స్‌లో సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి, అవసరమైన రక్త పరీక్షలు చేయించుకొని, తగిన మందులు వాడుకొని, సూచనలను పాటించడం మంచిది.     

నాకు మేన బావ ఉన్నాడు. నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని మా ఇరువైపు పెద్దల కోరిక. పుట్టబోయే పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ పెళ్లికి నేను ‘నో’ అంటున్నాను. ఒకవేళ నేను ఒప్పుకుంటే మా కుటుంబాల్లో ఇదే తొలి మేనరికం అవుతుంది. నన్నేం చేయమంటారు?
– నేతి ప్రవల్లిక, ఆత్మకూరు
 సాధారణంగా మేనరికం కాని పెళ్లి చేసుకున్న దంపతులకు పుట్టే పిల్లలలో ఏమి కారణం లేకుండా, లేదా తెలియని ఎన్నో కారకాల వల్ల 2–3 శాతం పిల్లలలో అవయవ లోపాలు, జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మేనరికం దంపతుల పిల్లలలో ఇది రెట్టింపు అవుతుంది అంటే 4–6 శాతం పిల్లలో సమస్యలు ఉండవచ్చు. అందులో ముందు తరాల వారివి కూడా మేనరికపు పెళ్లిళ్లు అయితే, ఈ సమస్యలు ఉండే అవకాశాలు ఇంకా ఎక్కువ. సాధారణంగా జన్యువులు తల్లిదండ్రులు ఇద్దరి నుంచి పిల్లలకు చేరుతాయి. కొన్ని జన్యువులలో ఒక్కొక్కరిలో చిన్న లోపాలు ఉండవచ్చు. లోపం ఉన్న జన్యువులు తల్లిదండ్రులు ఇద్దరిలో ఉన్నప్పుడు, పిల్లలకు అవి సంక్రమించి, అవి వారి పిల్లలలో అవయవ లోపాలుగా, జన్యుపరమైన సమస్యలుగా బయటపడటం జరుగుతుంది. అలానే ముందు తరాలు కూడా మేనరికం అయితే, ఈ లోపాలు ఉండే అవకాశాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. మీదే మొదటి మేనరికం అంటున్నారు కాబట్టి, మీ ఇద్దరు ఒకసారి జెనిటిక్‌ కౌన్సిలింగ్‌కు వెళ్లడం మంచిది. అక్కడ డాక్టర్, మీ కుటుంబ చరిత్ర, వారి ఆరోగ్య వివరాలను తెలుసుకొని, మీ ఇద్దరిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అవసరమనుకుంటే మీ ఇద్దరికి కారియోటైపింగ్‌ వంటి ఇతర రక్త పరీక్షలను సూచిస్తారు. వాటి వాటి వివరాలను బట్టి, మీ పిల్లలో సమస్యలు వచ్చే అవకాశాలు అంచనా వేయడం జరుగుతుంది. అంతేకాని సమస్యలు కచ్చితంగా రావు అనికాని వస్తాయని కాని చెప్పడం కష్టం. కాబట్టి భయపడకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా