కన్యా రాశి వారికి ఈ ఉగాది సంవత్సరాన మంచి శుభవార్త | Sakshi
Sakshi News home page

కన్యా రాశి వారికి ఈ ఉగాది సంవత్సరాన మంచి శుభవార్త

Published Sun, Apr 7 2024 11:35 AM

Ugadi Panchangam 2024 - Sakshi

కన్యా రాశి

ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–5, అవమానం–2.
ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)
హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)
చిత్త 1,2 పాదములు (పే, పో)

గురువు మే 1 వరకు మేషం (అష్టమం)లోను తదుపరి వృషభం (నవమం)లోను సంచరిస్తారు. శని కుంభం (షష్ఠ)లోను రాహువు మీనం (సప్తమం)లోను కేతువు (జన్మ)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చక్కగా చురుకుగా పాల్గొంటారు. నిద్ర, భోజనం వంటివి సమయపాలనలో చక్కగా నడుపుతూ ముందుకు వెడతారు. అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. మీ కుల ఆచార వ్యవహారాలను పాటించండి. పుణ్యకార్యాలు చేయడం, గురువులను దర్శించడం చేస్తుంటారు. తరచుగా శుభ కార్యాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తుంటారు.

మే తరువాత కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అవి మీకు బాగా సహకారంగా ఉండే స్నేహాలే. ఉద్యోగ విషయాలు చాలా బాగా ఉంటాయి. శని సంచారం బాగున్న కారణంగా సంవత్సర ఆరంభం నుంచి ఫలితాలు బాగుంటాయి. అయితే మే తరువాత ఇంకా అనుకూలం. ప్రమోషన్‌ వంటి ప్రయత్నాలు లభిస్తాయి. అదే రీతిగా స్థానచలన ప్రయత్నాలు సానుకూలమే. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలము. అధికారుల సహకారం బాగుంటుంది. భోజనం, వస్త్రం, నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు. ప్రతి విషయంలోనూ భయపడటం లేదా చికాకుపడటం వంటివి జరుగుతుంటాయి. కుటుంబ విషయాలు చూస్తే పెద్దల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. 

పిల్లల అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనధాన్యవృద్ధి బాగా ఉండటం ఆనందానికి కారణం అవుతుంది. కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. బంధువుల సహకారం బాగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే వరకు కొంత చికాకుగాను మే నుంచి అనుకూలంగాను ఉంటాయి. మీరు చేసిన పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడంలో, అవసరానికి కావలసిన కొత్త ఋణాలు పొందడంలో మంచి ఫలితాలు తద్వారా గౌరవం అందుతాయి.

తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది. కాళ్ళు చేతులు వాటి వేళ్ళు అనేక సందర్భా లలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంగా ప్రత్యేక ఇబ్బందులు ఉండవు. గురువు వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుంచి పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. మానసిక అనారోగ్యం ఉన్నవారు కొంచెం చికాకు పొందుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలోనూ క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది. సమర్థంగా కుటుంబ విషయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్‌లు, మంచి మార్పులు ఉంటాయి. 

గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శనిబలం అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఒత్తిడికి లోనవ్వద్దు. షేర్‌ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్‌ కూడా లాభదాయకం అవుతాయి. లాభదాయకంగా కాలం గడుస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలమే. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన. తద్వారా విజయావకాశాలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మే దగ్గర నుంచి గురుబలం బాగుంది. మంచి అవకాశాలు ఉంటాయి. ఒత్తిడికి లోనవ్వద్దు. రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుతాయి. మీరు మంచి సలహాలు అందుకోవడంలో విఫలమవుతారు.

ఉత్తర నక్షత్రం 2, 3, 4 వారిలో మార్కెటింగ్‌ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యా, వైద్య వృత్తుల వారు లాభం అందుకుంటారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు. కొత్తగా జీవనోపాధి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధి వార్తలు వింటారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. చిత్త నక్షత్రం 1, 2 వారికి రోజువారీ భోజనాది విషయాలలోనూ అనుకూలత తక్కువ. అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు. 

శాంతి మార్గం: రాహు కేతువులకు జప దానాలు అవసరం. ప్రతిరోజూ గణపతిని, దుర్గను అర్చించిన తరువాత మిగిలిన పనులు చేయండి. ‘దుర్గాసప్తశ్లోకి’ స్తోత్రం రోజూ 11సార్లు పారాయణ చేయాలి.

ఏప్రిల్‌: ఈనెల ప్రతికూల ఫలితాలు ఎక్కువ. శ్రమకు తగిన లాభం లేకపోవటం, ఖర్చులు పెరగటం జరుగుతాయి. వృత్తిలో మాటపడవలసి వస్తుంది. కుజ శాంతి, నవగ్రహారాధన మంచిది. షేర్‌ వ్యాపారులు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు ఆందోళనకర ఘటనలు ఎదుర్కొంటారు.

మే: ఈ నెల కూడా ప్రతికూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లోపించటం, పని ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం. రాబోవు మూడు మాసాలలో ఆరోగ్య ఋణ విషయాలలో శ్రద్ధ అవసరం. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు పెరిగే కాలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి విషయాలు లాభదాయకం.

జూన్‌: ఉద్యోగంలో రాణిస్తారు. అనుకూలంగా స్థానచలనం, అభివృద్ధి జరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఋణ సమస్యలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు జరుగుతాయి. గురువులను దర్శించుకుంటారు. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు. హస్తా నక్షత్రం వారికి మానసిక ఒత్తిడి తప్పదు. 

జులై: ఈనెల అంతా అనుకూలమే. ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు, ప్రశంసలు లభిస్తాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉన్నది. 16వ తేదీ తరువాత పాత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్‌ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి.

ఆగస్ట్‌: శ్రమతో కార్యజయం. నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి. స్థానచలన సూచనలు, ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. 18వ తేదీ తరువాత జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామికి కూడా ఆరోగ్య సమస్యలు రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది.

సెప్టెంబర్‌: పనులన్నీ శరవేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లోటు ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్ర సహకారం లభిస్తుంది. నిత్యం ధ్యానం చేయుట మంచిది. 13వ తేదీ నుంచి ఉత్తర నక్షత్రం వారికి చికాకులు పెరుగుతాయి. చిత్త నక్షత్రం వారికి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కాలం ప్రారంభమైంది. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. షేర్‌ వ్యాపారులకు అనుకూలం.

అక్టోబర్‌: వ్యాపారంలో పెను మార్పులు, ఊహించని లాభాలు. రానున్న 6 నెలలు అత్యంత అనుకూలం. సమస్యలు, శత్రు బాధలను సునాయాసంగా అధిగమిస్తారు. వేగంగా పనులు పూర్తి చేస్తారు. షేర్‌ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. ఫైనాన్స్‌ వ్యాపారులు, మార్కెటింగ్‌ ఉద్యోగులకు అనుకూలం. ప్రయాణ సౌఖ్యం, సాంఘిక గౌరవం.

నవంబర్‌: ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ నేతలకు ఉన్నత పదవులు లభిస్తాయి. శత్రుబాధలు తొలగుతాయి. షేర్‌ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలం. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు.

డిసెంబర్‌: కుటుంబ ఒత్తిడి వలన కొన్ని చికాకులు ఉంటాయి. సంతానం విద్యలో రాణించటం వలన ఆనందం కలుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. అనుకున్న దాని కంటే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఉంటుంది. షేర్‌ వ్యాపారులు మంచి ఆదాయం పొందుతారు. 

జనవరి: ఈ నెల ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, శత్రుబాధలు, పని ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఆర్ధిక బలం పెరుగుతుంది. çఉత్తర నక్షత్రం వారికి మానసిక కష్టాలు ఉంటాయి. షేర్‌ వ్యాపారులకు అనుకూలం విద్యార్థులకు,  రైతులకు శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారములు కూడా అనుకూలమే.

ఫిబ్రవరి: గత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఊహిం చని విధంగా అందరి సహకారం లభిస్తుంది. ప్రతిభకు తగిన గౌరవమర్యాదలు ఉంటాయి. ఆర్ధిక స్థిరత్వం, ఋణ రోగ శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతాయి. దాంపత్య జీవితంలో కొంత అభిప్రాయ భేదాలు ఉండును. చిత్త నక్షత్రం వారికి కార్యలాభం. షేర్‌ వ్యాపారులు లాభాలు అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు సఫలం. రైతులకు  శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. ఫైనాన్స్‌ వ్యాపారులకు అనుకూలం.ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు.

మార్చి: ఈ నెల ప్రతికూలత ఎక్కువ. వ్యర్థ ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అభిప్రాయ భేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహారాధన చేయుట శుభకరం.

Advertisement
Advertisement