వ్యాస పూర్ణిమ: ధర్మాన్ని ఆచరించండి.. అన్నీ లభిస్తాయి

24 Jul, 2021 07:35 IST|Sakshi

నేడు గురుపూర్ణిమ

వేదవ్యాసుడి జీవిత కథ ఆద్యంతం అద్భుతం. వ్యాసుడు వసిష్ఠుడికి ముని మనమడు. శక్తి మహర్షికి పౌత్రుడు. పరాశరుడి పుత్రుడు. తపో నిధి అయిన పరాశరుడు యమున దాటడానికి పడవ ఎక్కడమేమిటి? దాటించేందుకు తండ్రి స్థానంలో దాశ పుత్రి తాను పడవ నడపడమేమిటి? మహర్షి అకస్మాత్తుగా మత్స్య గంధిని మోహించడమేమిటి? తన తపశ్శక్తి ద్వారా  ఆమె అభ్యంతరాలన్నిటినీ తొలగించటమేమిటీ? ఆ యమునా నదీ ద్వీపంలో ఆమెకు అయాచితంగా పుత్రుడిని ప్రసాదిం చటమేమిటి? అప్పటికప్పుడే సకల శాస్త్రవేత్త అయిన పుత్రుడు పుట్టు కురావడమేమిటి? పుడుతూనే తల్లిని విడిచి తపోవనాలకు వెళ్లిపోవట మేమిటి? ఇదంతా లోక కల్యాణం కోసం లోకాతీతుడిని అవతరింపజే సేందుకు లోకేశ్వరుడు ప్రదర్శించిన విచిత్ర విలాసం.

ఆ కారణజన్ముడి జన్మకు ప్రయోజనం మాన వాళికి చతుర్విధ పురుషార్థ సాధన రహస్యాలను బహువిధాలుగా బోధించటం. అందుకే ఆయన జగద్గురువులకే గురువుగా నిలిచిపోయాడు. అగమ్యంగా ఉన్న వేదరాశి చిక్కులు విప్పి, చక్కబరచి, అధ్యయనానికి అనువుగా చతుర్వేదాలుగా విభజించి, వైదిక ధర్మప్రవర్తనం చేసిన ఆది గురువు వేదవ్యాసుడు. పంచమవేదమైన భారతేతిహాసం ద్వారా ‘ధర్మాన్ని ఆచరించండి. అన్నీ లభిస్తాయి’ అని పదేపదే ఎలుగెత్తి ఘోషించిన సకల లోక హితైషి సాత్యవతేయుడు. అర్థ కామ సాధనల విషయాలను విస్త రించి, అనేక నీతి కథల భాండాగారాలైన అష్టాదశ పురాణాల ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఆప్తుడు  వ్యాసుడు.

బాదరాయణ బ్రహ్మ సూత్రాల ద్వారా వేదాంత సారాన్ని సూత్రీకరించి, మనుషులం దరికీ మహత్తర లక్ష్యమైన మోక్ష పురుషార్థానికి బంగారు బాట పరచిన వాడూ పరాశరుడే. ఇంతటి మహోపకారి అయిన ఈ జ్ఞాన చంద్రుడు ఉదయించిన ఆషాఢ పూర్ణిమ శుభతిథిని ఆసేతు శీతాచలమూ గురు పూర్ణిమ పర్వదినంగా జరుపుకోవటం సర్వవిధాలా సముచితమైన సంప్రదాయం. ఆ సందర్భంగా ప్రత్యేకంగా అస్మాదాచార్య పర్యంతమైన గురుపరంపరను సాదరంగా సంస్మరించుకొని, యథాశక్తి కృత జ్ఞతను ప్రకటించుకోవటం మన కనీసపు కర్తవ్యం.
– ఎం. మారుతి శాస్త్రి 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు