విచిత్ర త్రిచక్ర వాహనం | Sakshi
Sakshi News home page

విచిత్ర త్రిచక్ర వాహనం

Published Sun, Dec 17 2023 5:30 AM

This Week 17 12 2023 Tech News in Fun Day Magazine - Sakshi

ముందువైపు నుంచి చూస్తే ఈ వాహనం అధునాతనమైన కారులాగానే కనిపిస్తుంది. ఈ వాహనానికి ముందువైపు రెండు చక్రాలు ఉంటాయి. వెనుకవైపు చూస్తే మాత్రం ఒకే చక్రం ఉంటుంది. ఈ విచిత్ర త్రిచక్ర వాహనాన్ని జపాన్‌కు చెందిన బహుళజాతి ఆటోమొబైల్‌ కంపెనీ ‘యమాహా’ ఇటీవల దీనిని ‘ట్రైకెరా’ పేరుతో రూపొందించింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనం.

ఇందులో డ్రైవర్‌ సహా ఇద్దరు కూర్చుని ప్రయాణించడానికి వీలుంటుంది. దీని డ్రైవింగ్‌ విధానం కారు డ్రైవింగ్‌ మాదిరిగానే ఉంటుంది. దీనిని ఒకసారి చార్జింగ్‌ చేసుకుంటే, ఏకధాటిగా వంద కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 80 కిలోమీటర్లు.

దీనిని త్వరలోనే జపాన్‌లో విడుదల చేయనున్నట్లు ‘యమాహా’ కంపెనీ ప్రకటించింది. ఆ తర్వాత మిగిలిన దేశాల్లో కూడా దీనిని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. దీని ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ఫోల్డింగ్‌ వాషింగ్‌ మెషిన్‌
ఉతికిన తర్వాత బట్టలను మడతపెట్టి దాచుకోవడం మామూలే! ఉతుకుడు పని పూర్తయ్యాక వాషింగ్‌ మెషిన్‌ను ఇంచక్కా మడతపెట్టి, సూట్‌కేసులో దాచుకోవడాన్ని ఊహించగలమా? ఊహాతీతమైన ఈ వాషింగ్‌ మెషిన్‌ను హాంకాంగ్‌కు చెందిన పీక్యూపీ డిజైన్‌ కంపెనీ రూపొందించింది. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు సులువుగా తీసుకుపోయేందుకు వీలుగా దీనిని తయారు చేసింది.

ఇది రీచార్జబుల్‌ బ్యాటరీతో పని చేస్తుంది. దీనిని ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. ఇందులో ఉతకాల్సిన దుస్తులు వేసుకుని, తగినంత నీరు, డిటర్జెంట్‌ నింపుకొని ఆన్‌ చేసుకుంటే, అడుగున ఉండే వైబ్రేటర్స్‌ నిర్దిష్టమైన వేగంతో పనిచేస్తూ, దుస్తుల మీద ఉండే మురికిని తేలికగా వదలగొడుతుంది. పని పూర్తయిన తర్వాత దీనిలోని నీటిని బయటకు వంపేసి, నీరంతా ఆరిన తర్వాత దీనిని మడిచేసి సూట్‌కేసులో లేదా బ్యాక్‌ప్యాక్‌లో పెట్టేసుకోవచ్చు. దీని ధర 26.97 డాలర్లు (రూ. 2,248) మాత్రమే!


భలే రోబో వాక్యూమ్‌ క్లీనర్‌
ఇప్పటికే మార్కెట్‌లో పలు రకాల రోబో వాక్యూమ్‌ క్లీనర్లు ఉన్నాయి. ఇవన్నీ నేల మీద, గోడల మీద ఉన్న దుమ్ము ధూళి కణాలను సమర్థంగానే తొలగిస్తాయి. చైనాకు చెందిన బహుళ జాతి సంస్థ టీసీఎల్‌ తాజాగా మార్కెట్‌లోకి తెచ్చిన ఈ ‘స్వీవా’ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ దుమ్ము ధూళి కణాలను తొలగించడమే కాకుండా, ఉపరితలంపై వ్యాపించి ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులను పూర్తిగా నాశనం చేస్తుంది.

దీని నుంచి వెలువడే అల్ట్రావయొలెట్‌–సి కిరణాలను ఎలాంటి రోగకారక సూక్ష్మజీవులనైనా క్షణాల్లో నాశనం చేసేస్తాయి. ఇది గూగుల్‌ అసిస్టెంట్‌ లేదా అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ ద్వారా కూడా పని చేస్తుంది. ‘స్వీవా’ రోబో వాక్యూమ్‌ క్లీనర్స్‌ 1000, 2000, 6000, 6500 అనే నాలుగు మోడల్స్‌లో దొరుకుతాయి. ఎంపిక చేసుకున్న వేగాన్ని బట్టి 1500పీఏ నుంచి 2700పీఏ సక్షన్‌ స్పీడ్‌తో పనిచేస్తాయి. మోడల్‌ను బట్టి వీటి 104.99 నుంచి 499.99 వరకు (రూ. 8,752 నుంచి రూ.41,680 వరకు) ఉంటాయి. 

Advertisement
Advertisement