Why Are Cancer Cases On Rise In India? Here Are The Reasons - Sakshi
Sakshi News home page

Cancer: ప్రతి తొమ్మిదిమందిలో ఒకరికి క్యాన్సర్‌.. వ్యాధి సోకితే నరకయాతనే

Published Tue, Aug 8 2023 3:14 PM

Why Are Cancer Cases On Rise In India Here Are The Reasons - Sakshi

ఈమధ్యకాలంలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండెజబ్బులది కాగా, రెండోది క్యాన్సర్‌దే. ప్రపంచ వ్యాప్తంగా, ఏటా కోటి మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒకసారి వ్యాధి సోకిందంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత కోలుకొని తిరిగి ఆరోగ్యంగా మారాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. మరి ఈ మహమ్మారిని గుర్తించడం ఎలా? క్యాన్సర్‌ వారసత్వంగా వస్తుందా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..   

డీఎన్‌ఏలో మార్పులే కారణం
మనిషి శరీరం మొత్తం కణజాలాలతో నిండి ఉంటుంది. అయితే కణజాలం అనవసరంగా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్‌. శరీరంలో సాధారణంగా కణాల విభజన నిత్యం జరుగుతూనే ఉంటుంది. కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. డీఎన్‌ఏ మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణంగానే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తుంటాయి.

ఈ క్రమంలోనే క్యాన్సర్‌ కూడా వారసత్వంగా వచ్చే అవకాశముంది. అలాగే పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర ఆహారపు అలవాటుల, రేడియేషన్‌ తదితర కారణాలతో డీఎన్‌ఏలో మార్పులు వస్తుంటాయి. దీంతో కొన్ని కణాలు చనిపోకుండా శరీరంలో అలాగే ఉండిపోతాయి. శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఇలా పెరిగిన కణాలు ట్యూమర్‌ (కణితి)గా ఏర్పడడానే క్యాన్సర్‌గా పేర్కొంటారు.

వ్యాధి కట్టడికి చర్యలు
క్యాన్సర్‌ కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. క్యాన్సర్‌ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) సర్వేను ప్రారంభించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సర్వే శరవేగంగా జరుగుతోంది. ఎన్‌సీడీ సర్వే ద్వారా మూడు రకాల క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెద్దసంఖ్యలో బాధితులను గుర్తించారు. సర్వే పూర్తయితే మరిన్ని కేసులు బయటపడవచ్చని వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.చాలా మంది వ్యాధి ఫైనల్‌ స్టేజ్‌ వచ్చే వరకు గుర్తించకపోవడంతోనే పరిస్థితి ప్రాణాల మీదకు వస్తోంది.

ఈ క్రమంలో క్యాన్సర్‌పై గ్రామీణ స్థాయి నుంచే ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా వారంలో ఐదు రోజులపాటు ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎం, కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్‌సీడీ సర్వేకి శ్రీకారం చుట్టింది. ఈ సర్వేలో స్క్రీనింగ్‌ పూర్తయ్యాక విండ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ ద్వారా నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్‌ లక్షణాలున్న వారిని గుర్తించి పీహెచ్‌సీల స్థాయిలోనే నిర్ధారిస్తున్నారు. అనంతరం ఆరోగ్య శ్రీలో భాగంగా ఉచితంగా పరీక్షలు చేయిస్తున్నారు. అనంతరం పూర్తిస్థాయి చికిత్సకు ఆస్పత్రులకు పంపుతున్నారు.

క్యాన్సర్‌ రకాలు ఇవీ..

మూత్రాశయ క్యాన్సర్‌ : దీన్ని ప్రోస్టేట్‌ అంటే వీర్య గ్రంధి క్యాన్సర్‌ అని కూడా పిలుస్తారు. ఇది పురుషులకు తక్కువగా వస్తుంది. ఈ క్యాన్సర్‌ బాధితుల్లో మూత్ర విసర్జన కష్టంగా ఉంటుంది. మూత్రం, వీర్యంలో రక్తం పడుతుంది.

బ్లడ్‌ క్యాన్సర్‌: రక్త కణాలు నియంత్రణ తప్పడం ద్వారా ఏర్పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, తరచూ జ్వరం, నోరు, చర్మం, ఊపిరితిత్తులు, గొంతు ఇన్ఫెక్షన్‌ తదితర లక్షణాలు ఉంటాయి. ముక్కు, చిగుళ్లు నుంచి రక్తస్రావమవుతుంది.

రొమ్ము కాన్సర్‌ : రొమ్ములో వాపు, నొప్పి, రొమ్ముపై గడ్డలు, చనుమొనల నుంచి అసాధారణ స్రవాలు, చంకలో గడ్డలు ఆధారంగా ఈ వ్యాధిని గుర్తిస్తారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌: ఈ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం కష్టం. వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు పాకినప్పుడే నిర్ధారించగలరు. అయితే మాటలో అసాధారణ మార్పులు.. ఛాతీ నొప్పి, వేగంగా బరువు కోల్పోవడం, గురక, విపరీతమైన దగ్గు ఈ వ్యాధి లక్షణాలు.

పెద్ద పేగు క్యాన్సర్‌ : కొలోన్‌, రెక్టమ్‌ క్యాన్సర్లను కలిపి కాలో రెక్టల్‌ క్యాన్సర్‌ అని పిలుస్తారు. మద్యం సేవించడం, పాగతాగడం, ఆహారపు అలవాట్ల వల్ల ఈ క్యాన్సర్‌ సోకుతుంది. పురుషుల్లోనే ఈ క్యాన్సర్‌ అధికం.

ముందస్తు జాగ్రత్తలు.. పరీక్షలు
పుట్టిన వెంటనే శిశువుకు హెపటైటిస్‌– బి వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించాలి.
► గర్భాశయ ముఖద్వారం (సర్వైకల్‌ క్యాన్సర్‌) రాకుండా అమ్మాయిలకు టీకాలు అందుబాటులో ఉన్నాయి.
► 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏటా ఒకసారి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి. మహిళల్లో క్యాన్సర్‌ అరికట్టేందుకు ఇది చాలా అవసరం.
► కొలోరెక్టల్‌ క్యాన్సర్‌ (పెద్దపేగు) పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. 40 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి.
► రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణలో ప్రస్తుతం 3డీ మామోటెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ సాంకేతికత ద్వారా అత్యంత సూక్ష్మస్థాయిలో క్యాన్సర్‌ కణాలను గుర్తించవచ్చు.
► మేనరికాలు, జన్యుపరమైన కారణాలతో వచ్చే సమస్యలకు అత్యాధునిక బీఆర్‌ఏసీ స్క్రీనింగ్‌ పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు.
► గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించేందుకు లిక్విడ్‌ బేస్డ్‌ పాప్‌స్మియర్‌ టెస్టులు అందుబాటులో ఉన్నాయి.
► ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నిర్ధారించేందుకు సీఎస్‌ వంటి అత్యాధునిక టెకాల్నజీ వినియోగిస్తున్నారు.
► క్యాన్సర్‌ దశాబ్దాలుగా మానవాళిని వణికిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది.
► జీవనశైలిలో మార్పుల కారణంగా బాధితుల సంఖ్య గణనీయంగాపెరుగుతోంది. 

పకడ్బందీగా సర్వే

క్యాన్సర్‌ నివారణే ధ్యేయంగా ప్రస్తుతం జిల్లాలో ఇంటింటా సర్వే చేపట్టాం. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఎన్‌సీడీ సర్వేలో భాగంగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ స్థాయి నుంచి ప్రజలకు క్యాన్సర్‌ లక్షణాలపై అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే నయం చేయడం సులభతరమని వివరిస్తున్నాం.

– ప్రభావతీదేవి, డీఎంహెచ్‌ఓ, చిత్తూరు

Advertisement

తప్పక చదవండి

Advertisement