పాఠం కోసం ఫారిన్‌ వెళదాం చలోచలో! | Sakshi
Sakshi News home page

పాఠం కోసం ఫారిన్‌ వెళదాం చలోచలో!

Published Wed, Jul 19 2023 9:28 AM

Why Indian Students Prefer To Study Abroad For Higher Education - Sakshi

ఇంగ్లాండ్‌లో అడుగు పెడుతూనే ‘ఎలాగో జ్ఞాపకం పెట్టుకొని కుడికాలే పెట్టాను. నిజానికి అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు. బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒక్కటే’ అనుకుంటాడు పార్వతీశం. బారిష్టరు చదువు కోసం ఉన్న పల్లెటూరు నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లిన పార్వతీశం తెలియని భాష, మనుషులు, సంస్కృతుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ మనల్ని తెగ నవ్విస్తాడు. కాలం మారినంత మాత్రాన, చదువు కోసం వెళ్లినవారికి దేశం కాని దేశంలో సమస్యలు ఉండవని కాదు. అవి వేరే రకంగా ఉండవచ్చు. అవి ఏ రకంగా ఉన్నా సరే... యూత్‌ వాటిని లైట్‌గా తీసుకుంటుంది. విదేశీ యూనివర్శిటీలలో చదువుపై బోలెడు లవ్వు చూపుతోంది... విదేశీ చదువు అనేది ఒకప్పుడు సంపన్న వర్గాల వారికి మాత్రమే పరిమితమైన విషయం.

అయితే ఇప్పుడు దృశ్యం మారింది. ఆర్థికస్థాయి, చిన్నా, పెద్దా పట్టణాలు అనే తేడా లేకుండా ఎంతోమంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. ఎనభైలలో ఫారిన్‌ యూనివర్శిటీ అంటే ఎక్కుమందికి అమెరికాలోని యూనివర్శిటీలు మాత్రమే. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు రిమోట్‌ ఈస్ట్‌ యూరోపియన్‌ దేశాలపై కూడా యువత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ‘ఎందుకు ఇలా?’ అనే ప్రశ్నకు రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. అందులో ఒకటి... ‘పాఠ్యపుస్తకాలను, తరగతి గదినీ దాటి మన విద్యావ్యవస్థ బయటికి రాలేకపోతోంది. పాఠ్యాంశం యూత్‌కు దగ్గర కాలేపోతోంది’ దిల్లీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల శ్రేయకు ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీ అంటే ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను అమెరికాలోని ‘జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ వరకు తీసుకువ్చంది.

‘ఈ యూనివర్శిటీ డిగ్రీ మాత్రమే ఇవ్వదు. ఎంతో అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది’ అంటుంది శ్రేయ. ఫ్లెక్సిబుల్‌ కరికులమ్‌ నుంచి ప్రపంచంలోనే అత్యున్నతమైన బోధన సిబ్బంది వరకు ఆ యూనివర్శిటీ గురించి చెప్పుకోదగిన అంశాలను ప్రస్తావిస్తుంది శ్రేయ. ‘విద్యార్థులు తమను తాము వ్యక్తీకరించుకునే అనుభవ జ్ఞానాన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు ఇస్తాయి’ అంటున్నారు దిల్లీ యూనివర్శిటీ మాజీ వైస్‌–ఛాన్సలర్‌ దినేష్‌ సింగ్‌. అయితే ‘అత్యున్నత ప్రవణాలతో కూడిన చదువు’ మాత్రమే మన విద్యార్థులు దేశం దాటడానికి కారణం కావడం లేదు. ‘భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో గడపడం, ఇతర దేశాల విద్యార్థులతో కలిసి చదువుకొనే అవకాశం దానికదే ఒక ఎడ్యుకేషన్‌’ అనే అభిప్రాయం కూడా విదేశీ విశ్వవిద్యాలయాలపై ఆసక్తికి కారణం అవుతుంది. ‘విదేశీ యూనివర్శిటీలలో చదువుకోవడం అనేది మన విద్యావ్యవస్థను తక్కువ చేయడం కాదు. మన పరిధిని విస్తృతం చేసుకోవడం మాత్రమే’ అంటుంది పుణెకు చెందిన సుమన.

దిల్లీకి చెందిన 19 సంవత్సరాల సైబా బజాజ్‌ కెనడాలోని ‘యూనివర్శిటీ ఆఫ్‌ మనిటోబ’లో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతోంది. ‘విదేశాలలో చదువు అనేది డిగ్రీలను మించినది. ఇది ఒక రకంగా సెల్ఫ్‌–జర్నీ’ అంటుంది సైబా. బెంగళరుకు చెందిన ప్రతిభా జైన్‌ గ్రాఫిక్‌ డిజైనింగ్‌ కోర్సు చేయడానికి యూకేకు వెళ్లాలనుకుంటోంది. ఈ మావ\త్రం దానికి అక్కడిదాకా వెళ్లాలా! అనిపిస్తుందిగానీ ప్రతిభ వెర్షన్‌ వేరు. ‘యూకేకు వెళ్లాలనుకోవడానికి కారణం... అక్కడి యూనివర్శిటీ ఫర్‌ ది క్రియేటివ్‌ ఆర్ట్స్‌కి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విషయంలో ప్రపంచంలో పెద్ద పేరు ఉండడం ఒక కారణం అయితే, సాంస్కృతిక వైవిధ్యం, గ్లోబల్‌ ఎక్స్‌పోజర్‌ అనేది రెండో కారణం.

మూడోకారణం ఒకేరకమైన అభిరుచులు ఉన్న వారితో, సబ్జెక్ట్‌కు సంబంధించిన నిపుణులతో కలిసి నెట్‌వర్క్‌గా ఏర్పడే అవకాశం ఉండడం’ అంటుంది ప్రతిభ. జాబ్‌ మార్కెట్‌లో సులువుగా విజయం సాధిస్తారు అనే ధీమా వల్ల, మల్టీ కల్చరల్‌ యూనివర్శిటీలలో తమ పిల్లలను చదివించడానికి పేరెంట్స్‌ ఆసక్తి చూపుతున్నారు. పక్కా ఫైనాన్స్‌ ప్లానింగ్, ఎడ్యుకేషన్‌ లోన్‌ల వల్ల పిల్లలను విదేశీ యూనివర్శిటీలలో చదివించడం చాలామంది పేరెంట్స్‌కు పెద్ద సమస్య కావడం లేదు. తల్లిదండ్రుల ఆసక్తిని గమనించి నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లు ఎడ్యుకేషన్‌ లోన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి.

మరోవైపు ‘అబ్రాడ్‌ ఎడ్యుకేషన్‌ లోన్స్‌’కు బెస్ట్‌ ఎన్‌బీఎఫ్‌సీలు ఏమిటి? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పేరెంట్స్‌. టెస్ట్‌–ప్రిపేరేషన్, కంట్రీ, కోర్సు, యూనివర్శిటీ ఎంపిక, డాక్యుమెంటేషన్‌ ప్లానింగ్‌... మొదలైన వాటిలో స్టడీ అబ్రాడ్‌ కన్సల్టెన్సీలపై ఆధారపడుతోంది యూత్‌. జపాన్‌ అయినా ఓకే అబ్రాడ్‌ ఎడ్యుషన్‌ అనగానే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ... మొదలైన దేశాలు గుర్తుకు వస్తాయి తప్ప జపాన్‌ గుర్తుకు రావడం జరగదు. అయితే గణాంకాల ప్రకారం జపాన్‌ యూనివర్శిటీలలో చదివే మన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం జపాన్‌లోని 20 యూనివర్శిటీల ప్రతినిధులు దిల్లీ, పుణె, చెన్నైలలో హైస్కూల్, కాలేజీలలో నిర్వహింన ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌కు మం స్పందన లభించింది.

(చదవం‍డి: ఇంట్లోనే బీర్‌ తయారీ..జస్ట్‌ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే)

Advertisement

తప్పక చదవండి

Advertisement