Why Indians Adopt Too Much From Westers Countries, Is It Really Necessary - Sakshi
Sakshi News home page

లివ్‌ఇన్‌ రిలేషన్స్‌ పేరుతో అడ్డదారులు..వెస్ట్రన్‌ కల్చర్‌ మనకవసరమా?

Published Sat, Jun 24 2023 4:20 PM

Why Indians Adopt Too Much From Westers Countries, Is It Really Necessary - Sakshi

రెండు కాళ్లపై నడిచే, ఏకైక జీవి మనిషే. తల్లిపై, ఎక్కువ కాలం పాటు .. అదీ ఎక్కువ స్థాయిలో ఆధారపడే జీవి మనిషి ఒక్కడే. రెండింటికీ సంభందం ఉందా?ఎన్నో లక్షల ఏళ్ళ క్రితం మానవ పూర్వీకులు దట్టమయిన అడవుల నుంచి సవన్నా (పచ్చ గడ్డి మైదానాలు)లకు వలసపోయారు. 

ఇలాంటి స్థితిలో నాలుగు కాళ్లపై నడవడం కన్నా ముందు కాళ్ళు  ఎత్తి,  రెండు కాళ్లపై కాసేపు నిలబడి చూడగలిగితే ?  ఆ  జీవి ఎత్తు దాదాపుగా రెండు రెట్లయినట్టే కదా..శత్రువుల / క్రూర జంతువుల జాడను దూరం నుంచే పసిగట్టవచ్చు. ఇలాంటి స్థితిలో ప్రకృతి వరణం వల్ల నాలుగు కాళ్ళ పూర్వీకుల నుంచి క్రమంగా రెండు కాళ్ళ జీవి ఆవిర్భవించింది.

రామాపితేకాస్,ఆస్ట్రలో పితికాస్..  హోమో  ఎరెక్ట్స్ .. హోమో హాబిలిస్ .. హోమో సేపియన్స్ .. ఇలా సాగింది మానవ పరిణామం.  శిశువుకు జననం ఇచ్చేటప్పుడు నాలుగుకాళ్ల జీవి అయితే వెనుక కాళ్ళు రెండు  బాగా సాచేందుకు  వీలుంటుంది. రెండు కాళ్ళ మానవ పూర్వీకుల్లో ద్విపాద గమనాన్ని (రెండు కాళ్ళ పై నడవడం) సాధ్యం చేసేందుకు , కాళ్ళు రెండు బాగా దగ్గరగా అమరిక పొందాయి . దీనితో జనన రంద్రం చిన్నదయ్యింది . దీనితో పుట్టుక సమయం లో శిశువు కపాలం,  దానిలోపల ఉన్న మెదడు చిన్నదయింది. అంటే మానవ శిశువు పుట్టేటప్పటికి మెదడు చాలా అపరిపక్వ స్థాయిలో ఉంటుంది .

చేప పిల్లకు తల్లి సంరక్షణ అనేదే ఉండదు. పాలిచ్చే జంతువుల్లో తల్లిపై ఆధారపడడం కాస్త ఎక్కువ. ఆవుదూడ పుట్టిన అరగంటలో లేచి చెంగున పరుగెడుతుంది. కానీ మానవ శిశువు ? తల్లి పై పూర్తి స్తాయిలో ఆధార పడక తప్పద. దీనికి కారణం రెండు కాళ్ళు. పుట్టినప్పుడు మెదడు చాలా అపరిపక్వ స్థాయిలో ఉండడ. పుట్టిన రెండేళ్లలో మెదడు-  కపాలం బాగా పెరుగుతాయి. చిన్న పిల్లల డాక్టర్లు బిడ్డ  కపాలం  కొలతలు తీసి నోట్ చేస్తారు . తల పెరుగుదల ఎలా ఉందొ గమనిస్తారు. ఇలా తల్లిపై ఎక్కువ కాలం ఆధారపడడం, మానవ జాతికి ఒక చక్కటి అవకాశం అయ్యింది. తల్లి ఒడిలోనే బిడ్డ భాషను నేర్చుకుంటుంది. అందుకే మాతృభాష అన్నారు.

కేవలం భాషేనా ? ఆ సమాజపు అలవాట్లు , మంచి చెడు- విలువలు , నమ్మకాలు, కట్టుబాట్లు , ఆచారాలు - వ్యవహారాలు .. ఇలా సమస్తం తల్లి ఒడిలోనే బిడ్డ నేరిస్తుంది . ఈ ప్రక్రియనే సామాజీకరణ అంటారు.. అంటే ఆ సమాజంలో ఎలా నడవాలి?  ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో...  ఈ బడిలోనే బిడ్డ నేరుస్తుంది. సమాజం దేహం అయితే దాని సంస్కృతి ప్రాణం.అలాగే సంస్కృతి లేకుండా ఏ సమాజమూ మనలేదు. ఈ సంస్కృతిని ఒక తరం నుంచి మరో తరానికి అందించే అవకాశం తల్లి బిడ్డ బంధం వల్లే సాధ్యం అయ్యింది. బిడ్డను కన్న తల్లికి డోపామైన్ హార్మోన్ ఉత్పత్తి  అవుతుంది. ఆ బిడ్డను పాలిచ్చి లాలించేటప్పుడు ఇదే డోపామైన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే బిడ్డను పెంచడాన్ని అందరు తల్లులూ ప్రేమిస్తారు. అదో అనిర్వచనీయమయిన అనుభూతి .

ఒకప్పుడు మానవ పూర్వీకులు కూడా..  జంతువుల్లా వావీ వరుసలు లేకుండా సంభోగించేవారు.జంతువులకైతే లైంగిక వాంఛ సంవత్సరంలో ఏదో ఒక సీజన్లో మాత్రమే. చిత్త కార్తె కుక్కలు అనే మాట విన్నారు కదా ? కానీ మనిషికి సంవత్సరం పొడవునా ఆ అవసరం ఉంటుంది. అందుకే వివాహం .. కుటుంబం అనే వ్యవస్థలు వచ్చాయి . భార్య - భర్త - పిల్లలు .. కుటుంబం  .. క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక ఆర్థిక , సామాజిక, భావద్వేగ బంధం. కుటుంబం లేకపోతే మన సమాజమే లేదు. 


టెక్నాలజీ  మారితే హార్మోన్‌లు, శరీర నిర్మాణం మారుతుందా ?  
వేషము మార్చినా మనిషి మారలేడు. ఆతని జైవిక నిర్మితి మారబోదు. మిడిమిడి జ్ఞానం  అంటే ప్రకృతికి అడ్డంగా నడవడం. లివ్ ఇన్ అట.. దానికి చట్టబద్ధత కావాలట !  సోషల్ మీడియా లో చర్చలు, డిమాండ్‌లు. అజ్ఞానికి అంతు ఉండొద్దూ  !!

చట్టబద్దత ఇస్తే...  అదే వివాహం కదా ? 
మనిషికి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే మెదడు భాగం 25  ఏళ్లకు  గానీ డెవలప్ కాదు . అంటే కనీసం ఇరవై  వయసు వస్తేనే తానేంటో,  తన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది .తానేంటో తెలియని వయసులో  తనకు ఎలాంటి బాయ్ / గర్ల్ ఫ్రెండ్ కావాలో ఎలా నిర్ణయించుకొంటారు? టీనేజ్‌లోలో పుట్టేది ప్రేమ కాదు.వ్యామోహం. హార్మోన్ డ్రైవ్ . కొన్నాళ్లు కలిసుంటారు, తర్వాత.. బ్రేక్ అప్ అయ్యాక ? ఇంకో బాయ్ ఫ్రెండ్ / గర్ల్ ఫ్రెండ్ .అదిగో అప్పుడు పోలిక మొదలవుతుంది . అరే నా ముందు వాడు / ఆమె బెటర్ . 

సరిగ్గా పెంచకపోవడం వల్లే అమెరికాలో,  సందుకో సైకో. వాడి చేతిలో గన్. ఎప్పుడు ఎవరిని ఏసేస్తారో తెలియదు . ఇప్పటి దాకా మానవీకరణ జరిగింది . మెల్లగా అమెరికా లాంటి చోట్ల దానవీకరణ జరుగుతోంది.అమెరికా కార్లు,రోడ్లు చాక్లెట్లు బాగుంటాయి. సరే, దానివీకరణలో కూడా భారత నగర జీవులు అమెరికాను ఆదర్శంగా తీసుకొంటే ఇక్కడ దానవీకరణ జరిగితే .. జరిగితే ఏంటి ? పదో క్లాసులోనే హత్యలు. ఆత్మ హత్యలు.
కొత్తొక వింతా కాదు . పాతొక రోతా కాదు.మనిషి ఒక జీవి.పరిణామ క్రమంలో వచ్చాడు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోకుండా అడ్డదారిలో నడిస్తే మన జాతి విలుప్తం తప్పదు.
వాసిరెడ్డి అమర్ నాథ్
- మానసిక శాస్త్ర పరిశోధకులు, సీనియర్ విద్యావేత్త

Advertisement
Advertisement