సంక్రాంతిని 'పెద్ద పండుగ' అని ఎందుకు పిలుస్తారు? | Sakshi
Sakshi News home page

సంక్రాంతి ఎలా పెద్ద పండుగ అయ్యింది? ఆ రోజు నువ్వులు తినడానికి రీజన్‌?

Published Mon, Jan 15 2024 7:25 AM

Why We Called Sankranti Is Big Festival What Is The Reason - Sakshi

భోగభాగ్యల భోగి పండుగను చిన్నా పెద్ద అంతా ఆనందంగా జరుపుకున్నారు. ఇక తరువాత రోజే అసలైన పండుగ 'సంక్రాంతి'. ఈ పండుగ రోజు ఉండే హడావిడి అంతా ఇంత కాదు. పైగా ఈ పండుగను పెద్దల పండుగ లేదా పెద్ద పంగ అని అంటారు. ఈ రోజు నవ్వులతో చేసిన వంటకాలను తప్పకుండా తింటారు. నాలుగు రోజులు పండుగల్లో ఈ సంక్రాంతి మాత్రమే ఎలా పెద్ద పండుగ అయ్యింది?. ఇన్ని సంక్రమణాలు ఉండగా ఈ సంక్రమణానికి ఎందుకంత విశిష్టత?

నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు. అదే సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలు కాబోతుందనే దానికి సంకేతం. అలాగే దక్షిణదిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తరదిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. 

సంక్రాంతి ఎలా పెద్ద పండుగంటే..
సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు. అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలిపేందుకు ఇలా నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగలో ముఖ్యంగా ప్రకృతిని పూజించడంతోపాటు పశువులను కూడా పూజిస్తుంటారు.

అలాగే సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా ప్రతి పదార్థంలో నువ్వులు ఉంటాయి. సూర్య భగవానుడికి సమర్పించే నీటిలోనూ నువ్వులు వేస్తారు. సంక్రాంతి సమయంలో నువ్వుల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అప్పటి వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దీని వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటి నుంచి తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నువ్వులను కచ్చితంగా తీసుకోవాలని మన పెద్దలు నియమం ఏర్పాటు చేశారు.

ఈ రోజునే పెద్దలకు తర్పణాలు..
సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణాలు వదలడం తప్పనిసరిగా చేస్తారు. ఉత్తరాయణ కాలం మొదలైన ఆరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పితృదేవతలకి స్వర్గ ప్రాప్తి లభించడం కోసం ఇలా చేస్తారు. ఈరోజు పెద్దలని స్మరించుకుంటూ వారిని సంతోష పెట్టే విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఇది పెద్దల పండుగ లేదా పెద్దల పండుగ అయ్యింది.

కొత్త అల్లుళ్ల సందడి..
తెలుగు రాష్ట్రాల్లో ఈ  సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి తమ ఆతిధ్యంతో ఔరా! అనిపిస్తారు. కొత్త అల్లుళ్ల రాకతో ఇల్లు కళకళాడిపోతాయి. మరదళ్ళు బావలని సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మహిళలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేసి మురిసిపోతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు. పల్లెటూరులో అయితే ఏ వీధిలో చూసినా కన్నె పిల్లలు పరికిణీలు కట్టి పూల జడలు వేసుకుని అందంగా ముస్తాబై తిరుగుతూ సందడి చేస్తారు.

కోడి పందేలు, ఎడ్ల పోటీలు..
గోదావరి జిల్లాల్లో కోడిపందేలతో ఫుల్ జోష్‌తో పండుగ జరుగుతుంది. వీటిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి కూడా  జనాలు వస్తారు. పూర్వకాలంలో దీన్ని యుద్ధనీతిని గెలిపించే పందెంగా భావించేవారు. అంతేగాదు ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారట. ఆ తర్వాత అదే కాలక్రమేణ ఓ సరదా జూదంలా మారింది. ఈ పండుగ రోజు కొన్ని ప్రాంతాల్లో ఈ కోడిపందేలు కచ్చితంగా జరుగుతాయి.

మరికొన్ని చోట్ల ఈ రోజు ఎండ్ల పోటీలు నిర్వహిస్తారు. గాలిపటాలు ఎగరువేసేది కూడా. కొన్ని చోట్ల ఈ సంక్రాంతి పండుగను పతంగులు పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు చిన్నా పెద్దా అని తేడా లేకుండా గాలి పటాలు ఎగరేస్తూ ఆనందిస్తారు. దీంతో ఆకాశంలో రంగు రంగుల గాలి పటాలు ఎగురుతూ కనువిందు చేస్తాయి. మరీ ఇన్ని విశేషాలు ఉన్న సంక్రాంతి పెద్ద పండగే కదా!
 

Advertisement
Advertisement