ఆ గూడేనికే వెలుతురు నువ్వమ్మా! | This Young Sarpanch Is Improving Tribal Lives One Village At A Time - Sakshi
Sakshi News home page

ఆ గుడేనికే వెలుతురు నువ్వమ్మా!

Published Fri, Sep 1 2023 10:06 AM

This Young Sarpanch Is Improving Tribal Lives One Village At A Time - Sakshi

‘ఇరవై ఏళ్ల వరకూ మా ఇంట్లో బల్బు చూళ్లేదు’ అంటుంది భాగ్యశ్రీ. మహరాష్ట్రలో నక్సల్‌ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని తమ గూడేనికి చాలా కాలం పాటు సర్పంచ్‌గా ఎవరూ నిల్చునే ధైర్యం చేయలేదు. సమస్యలు తీర్చేవారూ లేరు. ‘చివరకు నేనే సర్పంచ్‌ అవుదామని నిశ్చయించుకున్నా’ అంది భాగ్యశ్రీ. 24 ఏళ్ల ఈ గిరిజన నాయకురాలు తన వారి కోసం పని చేస్తున్న తీరు ప్రతి అణగారిన సమూహానికి చూపుతున్న మార్గం చాలానే ఉంది.

మహరాష్ట్రలో ముంబై, పూణె వంటి నగరాలది ఒక ప్రపంచమైతే గడ్చిరోలి వంటి నక్సల్‌ ప్రభావిత గిరిజన ప్రాంతాలది మరో ప్రపంచం. ‘మహారాష్ట్రకు ఊపిరితిత్తి’ అని పిలిచే ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి, గిరిజన ఆవాసాలతో ఉంటుంది. అయితే నక్సలైట్ల ప్రభావం వల్ల, గిరిజనులనే నిర్లక్ష్యం వల్ల దారుణమైన వెనుకబాటుతనం ఇక్కడ ఉంటుంది. ‘మా గూడెంలో నాకు ఇరవై ఏళ్లు వచ్చే వరకూ కరెంటు లేదు. మా ఇంట్లో బల్బు వెలగడం చూళ్లేదు’ అంటుంది 24 ఏళ్ల భాగ్యశ్రీ లక్ష్మి. గడ్చిరోలి అడవుల్లో అత్యధిక సంఖ్యలో ఉండే మడియా తెగకు చెందిన ఈ చదువుకున్న అమ్మాయి తన సొంతగూడెం ‘కొటి’ పంచాయితీ కింద ఉన్న 9 గ్రామాలకు సర్పంచ్‌. ఈ ప్రాంత గిరిజనుల జీవితాలకు ఒక ఆశాదీపం.

సర్పంచ్‌ లేని ఊరు
భాగ్యశ్రీ లక్ష్మి పుట్టి పెరిగిన ‘కొటి’ గూడేనికి 2003 నుంచి సర్పంచ్‌ లేడు. ఎందుకంటే నక్సల్‌ ప్రభావం వల్ల ఏ సమస్యో అని ఎవరూ నిలబడలేదు. దాంతో ఆ ప్రాంతమంతా అనేక సమస్యలు పేరుకుపోయాయి. బాల్య వివాహాలు, చదువు మానేయడం, నక్సల్‌ అనే అనుమానంతో అమాయక గిరిజన యువకులను ఏళ్ల తరబడి జైళ్లల్లో పడేయడం.. ఇదీ అక్కడ జరుగుతున్నది. డాక్టర్లు పొరపాటున కూడా రారు. అదేమంటే రోడ్లు లేవంటారు. రోడ్లు వేయమని అధికారుల దగ్గరకు వెళితే వారు మరేవో సమస్యలు చెప్తారు. ‘ఇవన్నీ చూసి చూసి విని విని నేనే సర్పంచ్‌గా మారి ఏదో ఒకటి చేద్దామని బయలుదేరాను’ అంటుంది భాగ్యశ్రీ లక్ష్మి.

నేనొచ్చాను
భాగ్యశ్రీ లక్ష్మి తల్లి అంగన్‌వాడి టీచర్‌. తండ్రి ప్రభుత్వ టీచర్‌. అందుకే భాగ్యశ్రీని చదివించారు. ‘చంద్రాపూర్‌లో బి.ఏ. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ చదివాను. మంచి వాలీబాల్‌ ప్లేయర్‌ని నేను. టీచింగ్‌ రంగంలోకి వెళదామనుకున్నాను. కాని నా చదువు నాకు మాత్రమే ఉపయోగపడితే ఎలా? నా వారికి ఏదైనా చేయాలని సర్పంచ్‌ అయ్యాను. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు’ అంది భాగ్యశ్రీ. అయితే ఆమెకు పదవి రావడాన్ని ఊహించని కొంతమంది మగవారు భాగ్యశ్రీ పదవీ స్వీకారం రోజు ఆమెతో దురుసుగా వ్యవహరించారు. మైక్‌ తీసుకొని మాట్లాడబోతే మాట్లాడనివ్వలేదు. అసభ్యంగా ప్రవర్తించారు. ‘నేను ఇంటికొచ్చి చాలా ఏడ్చాను. అయితే మా అమ్మ– నువ్వు ఇక మీదట మామూలు భాగ్యశ్రీగా ఉండకు. ఒక నాయకురాలు ఎలా ఉంటుందో అలా ఉండు’ అని ధైర్యం చెప్పింది. ఆ క్షణమే నేను గట్టిగా నిలబడాలనుకున్నాను’ అంటుంది భాగ్యశ్రీ.

బైక్‌ మీద తిరుగుతూ...
ప్రతి ఉదయం టీ తాగి బైక్‌ మీద తిరుగుతూ తన అజమాయిషీలో ఉన్న గ్రామాల సమస్యలు పరిష్కరిస్తోంది భాగ్యశ్రీ. ఆమె సర్పంచ్‌ అయ్యాక గూడేల్లోని తల్లిదండ్రులతో పోట్లాడి మొదటగా చేసిన పని బాల్యవివాహాలు మాన్పించడం... బాలికలను హాస్టళ్లకు పంపి చదివించడం... స్కూళ్లలో తిరిగి చేరేలా చేయడం, టాయిలెట్లు నిర్మించడం... ‘నా కింద తొమ్మిది గ్రామాల్లో ఆరింటికి కరెంటు తెప్పించాను’ అని తెలిపిందామె. ‘అధికారులు ఏది అడిగినా నక్సల్స్‌ సమస్యను సాకుగా చూపుతారు. ప్రజల సమస్యలను నిజంగా పరిష్కరిస్తే నక్సల్స్‌ అడ్డుపడరు’ అంది.

‘గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలూ వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి’ అంటుంది భాగ్యశ్రీ. గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలు వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement