ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న మహిళా రైతు ఓబులమ్మ | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న మహిళా రైతు ఓబులమ్మ

Published Wed, Sep 21 2022 12:08 PM

YSR Kadapa District: Bandi Obulamma Selected Jaivik India Award For Nature Farming - Sakshi

తలకు మించిన భారంగా, నష్టదాయకంగా మారిన రసాయనిక వ్యవసాయంతో విసిగి వేసారి ఆరేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం చేపట్టిన మహిళా రైతు కుటుంబం రైతు లోకానికే ఆదర్శంగా నిలిచింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జైవిక్‌ ఇండియా జాతీయ ఉత్తమ రైతు పురస్కారాన్ని గెల్చుకోవటం విశేషం. 

వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు మండలం టి. కొత్తపల్లెకు చెందిన బండి ఓబులమ్మ, తిరుమలయ్య దంపతులు 2016 నుంచి కొద్ది విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించి.. తదనంతరం పదెకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించారు. నిమ్మ తోటలో అంతర పంటలు సాగు చేస్తున్నారు. దేశీ వరిని సాగు చేస్తున్నారు. కొంత విస్తీర్ణంలో ఏడాది పొడవునా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ.. స్వయంగా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తూ నిరంతర ఆదాయం గడిస్తున్నారు. 


రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేశారు. మూడు ఆవులను కొనుగోలు చేసి, పేడ, మూత్రంతో ఘనజీవామృతం, జీవామృతం స్వయంగా తయారు చేసి వాడుతున్నారు. అవసరం మేరకు కషాయాలు వాడి పంటలు పండిస్తున్నారు. తొలుత యూట్యూబ్‌లో ప్రకృతి సేద్యపు విజయగాథలు చూసి స్ఫూర్తి పొంది శ్రీకారం చుట్టారు. తదనంతరం గ్రామ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది సూచనలు, సలహాలు పాటిస్తూ.. పర్యావరణానికి, ప్రజలకు ఆరోగ్యదాయకమైన సేద్య రీతిలో తిరుగులేని పట్టు సంపాదించారు. అంతేకాదు, సొంతంగా ప్రజలకు అమ్ముకోవటంలోనూ విజయం సాధించారు. 

కలిసొచ్చిన నోటి ప్రచారం
పండించిన కూరగాయలు, ఆకుకూరలను తాము తినటంతో పాటు ఓబులమ్మ స్వయంగా ఇంటింటికీ వెళ్లి అమ్ముతుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆరోగ్యదాయక ఉత్పత్తుల విశిష్టత గురించి గ్రామాల్లో ఆయమ్మకు ఈయమ్మకు చెప్పడం మొదలు పెట్టారు. వీటిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలియజెప్తూ అమ్మేవారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తామర తంపరగా పాకిపోయింది. 

వారి గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే మైదుకూరు పట్టణంలోని కూరగాయల వ్యాపారులకూ ఈ విషయం తెలిసింది. వారి నుంచి కడప, పొద్దుటూరులో కూరగాయల వ్యాపారులకు కూడా తెలిసింది. వారు నేరుగా ఓబులమ్మ తోట దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కెళ్లటం అలవాటైంది.  దీంతో ఓబులమ్మ పండించే ప్రకృతి వ్యవసాయ పంట దిగుబడులకు మార్కెటింగ్‌ సమస్యతో పాటు రవాణా ఖర్చు కూడా మిగిలింది. ఖర్చు తగ్గడంతో మంచి రాబడి ప్రారంభమైంది. 

దీంతో ఓబులమ్మ తన భర్త తిరుమలయ్యతో కలిసి క్రమంగా ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం పెంచుతూ వచ్చారు. 2018 నుంచి తమకున్న మొత్తం 10 ఎకరాల్లోనూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. అల్లుడు శివరామయ్య, కుమార్తె ఆదిలక్ష్మిల సహకారంతో ప్రకృతి వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ దిగ్విజయంగా ఓబులమ్మ, తిరుమలయ్య దంపతులు ప్రకృతి వ్యవసాయంలో ముందుడుగు వేస్తున్నారు. 


నిమ్మ తోటలో అంతర పంటలు

మొదల్లో 2 ఎకరాల్లో నిమ్మ మొక్కలు నాటి.. అంతరపంటలుగా వంగ, మిరప, ఆరటి, బొప్పాయి వంటి తదితర పంటలను సాగు చేశారు. నిమ్మ, అరటి, బొప్పాయి పండ్లను పొలం వద్దనే వ్యాపారులకు అమ్మేవారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కూరగాయలు, ఆకుకూరలను మాత్రం ఆలవాటు కొద్దీ ఉదయాన్నే గ్రామాగ్రామానికి తిరిగి అమ్మడం నేటికీ కొనసాగిస్తున్నారు ఓబులమ్మ.  2020లో మరో 6 ఎకరాల్లో నిమ్మ మొక్కలు నాటారు. ఈ ఆరు ఎకరాల్లో కూడా అంతర్‌ పంటగా ప్రతి 50 సెంట్లలో టమోటా, మిరప, వంగ, గోంగూర, పాలకూర, చుక్కాకు వంటివి సాగు చేశారు. పండ్లు, కూరగాయలను పొలం వద్దే కొనుగోలు చేసుకొని తీసుకు వెళ్తుండటంతో ఓబులమ్మకు మార్కెటింగ్‌ సమస్య లేకుండా పోయింది. (క్లిక్: ఎకరాకు 8 లక్షల పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా!)

అధిక ధరకే అమ్మకాలు
గతేడాది 10 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా రూ. 6.99 లక్షల నికరాదాయం వచ్చిందని ఓబులమ్మ తెలిపారు. రూ. 4.8 లక్షలు ఖర్చవ్వగా వివిధ పంటల అమ్మకం ద్వారా రూ. 11,79 లక్షల ఆదాయం వచ్చింది. 3 ఎకరాల్లో నువ్వులు, 2 ఎకరాల్లో కొర్రలు, 2 ఎకరాల్లో మైసూరు మల్లిక, బహురూపి దేశీ వరిని ఓబులమ్మ సాగు చేశారు. మిగతా 3 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేశారు. నువ్వుల ద్వారా రూ. లక్ష, నిమ్మకాయల ద్వారా రూ.4.70 లక్షలు, మైసూరు మల్లిక, బహురూపి బియ్యం ద్వారా 1.13 లక్షలు, కొర్ర ధాన్యం ద్వారా రూ. 56 వేలు, మిర్చి ద్వారా రూ. 2.78 లక్షలు, టమాటోలు తదితర కూరగాయల ద్వారా రూ. 1.62 లక్షల ఆదాయం వచ్చింది. కూరగాయలు, ఆకుకూరల అమ్మకం ద్వారా ప్రతి రోజూ కొంత రాబడి వస్తున్నది. 

మార్కెట్‌లో సాధారణ కూరగాయల చిల్లర కన్నా కిలోకు 2–3 రూపాయల అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ఓబులమ్మ వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో నిమ్మ తోటలో అంతరపంటలుగా 2 ఎకరాల్లో ఉల్లి, 1.5 ఎకరాల్లో కొత్తిమీర, 50 సెంట్లలో వరి పంటలను సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు ఓబులమ్మ అల్లుడు శివరామయ్య (98485 58193)ను సంప్రదించవచ్చు. 
 – గోసుల ఎల్లారెడ్డి, సాక్షి, కడప అగ్రికల్చర్‌  


మా కష్టాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది

ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి సాగు ఖర్చు భారీగా తగ్గింది. నా భర్త తిరుమలయ్యతోపాటు అల్లుడు శివరామయ్య, కుమార్తె ఆదిలక్ష్మితో కలిసి వివిధ పంటలను సాగు చేస్తున్నాను. పురుగు మందులకు బదులు నీమాస్త్రం, దశపర్ణి కషాయం, వేపనూనె, కానుగ నూనెలను వాడతాం. ఎరువులకు బదులుగా జీవామృతం, ఘనజీవామృతం వేసుకుంటాం.

వీటిని మేమే తయారు చేసుకుంటాం, పంటల సాగుకు ముందు నవధాన్యాలను విత్తి, ఎదిగిన తర్వాత పొలంలో కలియదున్నుతాం. తర్వాత వేసే పంటలకు అది సత్తువగా పనికొస్తుంది. పండ్లను వ్యాపారులే వచ్చి కొనుక్కుంటున్నారు. కూరగాయలను ఇంటింటికీ తీసుకెళ్లి అమ్ముతున్నా. మా కష్టాన్ని గుర్తించిన ప్రకృతి వ్యవసాయ అధికారులు అవార్డుకు దరఖాస్తు చేయించారు. జైవిక్‌ ఇండియా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది.
– బండి ఓబులమ్మ, ప్రకృతి వ్యవసాయదారు, టి. కొత్తపల్లె, మైదుకూరు మం., వైఎస్సార్‌ జిల్లా 

Advertisement
Advertisement