నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా!

1 Sep, 2022 17:39 IST|Sakshi

ఊరికే ఆ ద్వారం నుండి ఈ ద్వారం వరకు, ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు ఇంటిలోనుండి బయటికి బయటి నుండి ఇంట్లోకి అలా పరిగెడుతూ ఉంటానా, తలుపు పక్కనున్ను బియ్యం గచ్చులో చేయి పెట్టి ఇంత బియ్యం జేబులోకి, మరింత బియ్యం నోట్లో వేసుకుని నములుతూ ఉంటే బియ్యం ఎంత తియ్యగా ఉండేదో. పచ్చి బియ్యమే అంత తియ్యగా ఉంటే ఇంటి బయట కట్టెల పొయ్యి మీద, మట్టి కుండలో వెలుతురూ, గాలి తగులుతూ గంజి వార్చి వండిన అన్నం ఇంకెంత రుచిగా ఉండాలి? 

గంజి అంటే గుర్తుకు వచ్చింది. నాకు ఊహ తెలిసి కార్టూన్ అనేది ఒకటి ఉంటుంది అని తెలుసుకున్న వ్యాఖ్యా-బొమ్మల తొలి కార్టూను గంజి మీదే. పొలీసాయన చాకలాయన్ని గద్దిస్తూ ఉంటాడు. ఏమిరా అప్పిగా ! నా నిక్కరుకి గంజి పెట్టి ఇస్త్రీ చేయమన్నానా, గంజి పెట్టలేదే?" "మా ఇంట్లో తాగనీకే గంజి లేదు దొరా, ఇక నీ నిక్కరకు ఏమని పెట్టేది?" అప్పుడు అది చూసి భలే నవ్వుకున్నాం కానీ కాస్త ఆకలి, కాస్త  గంజి మెతుకులు అనే పెద్ద మాటలు బుర్రకు పట్టాకా’అయ్యో! అనిపించింది.

అలా గంజి వార్చి వండిన వేడి వేడి అన్నంలో చాలా నెయ్యి పోసి, ఎర్రపప్పు , ఎర్రెర్ర ఆవకాయ ఊర్పు కొంచెం కలిపి  చిన్న చిన్న ఆవకాయ ముక్కలని గిల్లి ముద్దలుగా కట్టి కథలు చెబుతూ తినిపించేది మా జేజి. పప్పన్నం అయ్యాక పాలు చక్కర అన్నమో లేదా పెరుగన్నంలో బెల్లం ముక్కలు కలిపి తినిపిస్తే దానితో స్వస్తి. కథల్లోకి అన్నం నంజుకుంటున్నామా. అన్నం లోకి కథలు నంజుకుంటున్నామా అనేది విషయం కానే కాదు అది నాంది. అన్నం బావుండేది. కథలూ బావుండేవి. అయితే ఆ చిన్నప్పుడు బావోనివి కూడా ఉంటాయని తెలీదు కాబట్టి, బావున్నవి అప్పుడు బావున్నాయనే విషయం కూడా తెలీదు.

పెరిగి పెద్దయ్యాకా ఈ ఇంటి వంట ఈ ఇంటి వంట ఆ హోటలు వంట ఈ రెస్టారెంట్ వంట తినవలసి వచ్చినపుడు అక్కడ కూర బావుంటుంది, ఇక్కడ చారు బావుంటుంది, ఆ ఇంటి వాళ్ళు పచ్చడి బాగా చేస్తారు, మా ఇంట్లో మటన్ మహత్తరం అనే సింగులర్ అప్రిషియేషన్సే అమృతం అనే భావనకు దిగ పడిపోయా.

ఒకసారి మధ్యాహ్నం ఆకలి సమయాన మదరాసులో ఒక హోటలు వైపు దారి తీశారు మహా గొప్ప చిత్రకారులు సురేష్ గారు. బయట వేడిగా ఉన్నా, లోపల గాలి చల్లగా వీస్తుంది. అరవ సర్వర్ గారు వచ్చి అరిటాకు పరిచారు. వరుసగా పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. తినడం మొదలు పెట్టా, తఠాలున వెలిగింది రుచి అనేది. ఆ రుచికి  నెమలీకమీది తడి పచ్చదనంలా ఉంది అరటి ఆకు తళ్ళెం. అరటి పొలం మీదికి పొగ మంచు వచ్చి కొబ్బరి కోరులా కురిసినట్లుగా ఉంది తెల్లని అన్నం. గంగమ్మ శివుడి  నెత్తి మీది నుండి జాలువారుతుండగా ఒక పక్క  పాయ కుంకుమ తడిసిన రంగులో అన్నాన్ని తడుపుతుంది చారు. మరో పాయ తెల్ల  విభూదితో కలిసిన మజ్జిగ ధార. నక్షత్రాలు చాలా తెలుసు కానీ తెల్లని నెలవంక ఒకటేగా, నూనెలో వేగి వంకర తిరిగిన చల్ల మిరపకాయలన్నీ చంద్ర వంకలే! ఆ కూరా, ఈ పచ్చడి, అక్కడ అప్పడం, ఇక్కడ నెయ్యి, వేలు ముంచి నోటి దాకా ఎత్తిన తీపి... ఏది తిన్నా బావుందే! ఎంత తిన్నా బావుందే! ఇది కదా భోజనం అంటే, సంపూర్ణం అంటే. ఇంతకాలం భోజనం అని, అన్నం అని పేరు పెట్టుకుని  ఏం తింటున్నాం?  దశాబ్దాలుగా తిండిముందు సర్దుకు పోతున్నాం అంతే.  ప్రపంచంలో చాలా మందికి ఈ మాత్రం అన్నం కూడా గతిలేదు అని సర్దుకుపోయి బావుంది, బాలేదు అనే మాటలే మర్చిపోయాం.

మంచి భోజనం మాదిరిదే మంచి  కథ కూడా, గొప్ప కథ కూడా, అద్భుతమైన కథ కూడా.  భోజనం మొత్తంలో అన్నమొక్కటి బావున్నట్టో, కూర బావున్నట్టో, చారు మజ్జిగ లేదా మజ్జిగ పులుసు బావున్నట్టో, ఏదో ఒకటి బావుంటే అది చాలులే  అనుకునేట్టు అయిపోయింది కథా కాలం. వొస్తువు కొత్తగా ఉంది కదా? ఇతివృత్తం మంచిది ఎన్నుకున్నాడు, శిల్పం చూశావా? ఆ శైలి ఉందే! అబ్బో!! వచనంలో నడక కొత్త దారి దొక్కింది. ఈ కాలం మరీ అన్యాయం, కథ ఏవుందిలే! కథ రాసి వడ్డిస్తున్న పిల్లను చూడు, కత్తి కదూ! 

దేనికదేగా బావున్నాయి. మొత్తంగా బావుందో లేదో తెలీదు, తెలుసుకోవాలసిన అక్కరలేదు. ఈ రోజు బావుందని అనుకుంటున్న కథను అసలు కళ్లకద్దుకుని మళ్లా మళ్లా చదువుతున్నామా అసలు? నాకై నేను కథని వెదుక్కుని చదువుకుని ఎంత కాలం అయ్యింది? బలివాడ కాంతారావు గారి బయ్యన్న మాదిరి కథ ఒకటి వచ్చి గుండెలో మెత్తగా పడుకుని ఎంత కాలం అయ్యింది? అయితే ఒక అదృష్టమున్నది భోజనమైతే రోజూ తినాలి, మంచిది ప్రతి రోజూ దొరక్క పోవచ్చు, బ్రతకడానికి ఏదో ఒకటి తిని బ్రతకాలి తప్పదు. అయితే కథలు మాత్రం కొత్త వాటి కొరకు ఎదురు చూడనక్కరలేదు, ప్రపంచంలో కథావాంగ్మయం అనేది ఒకటి పాతది చాలా తయారయ్యి ఉంది. మళ్ళా మళ్ళా చదువుకునెందుకు చాలా దయతో గొప్ప కథని దానం చేసి పోయిన కథకులు చాలా మందే ఉన్నారు. తరగని కథ చాలా ఉంది. కొత్త కథల కొరకు ఎదురు చూడాల్సినంత కథ ఏమీ తరిగిపోలేదు తరిగేదల్లా చదవడానికి సమయం లేని మన వయసు. 

ఉండండి, పాత కాలంలోకి పరిగెత్తి పోవాల్సిన  శ్రమ తెలియకుండా మీకు ఒక కథ చెబుతాను రండి. 
నార్మన్ గార్డ్స్ బై అనే మనిషి వచ్చి పార్క్ లో వచ్చి కూచుని మనుషులకేసి చూస్తున్నాడు. అది సంధ్యా సమయం. ఆయన దృష్టిలో సంధ్యా సమయం అంటే మనుషులు పగలంతా పోరాడి ఓడిపోయిన తమ అదృష్టాలను, చనిపోయిన తమ నమ్మకాలను చేతనయినంతవరకు లెక్కలు చూసుకునే సమయం, ఈ రోజుకు ఇక మనం మరణించి రేపటి పోరాటానికి మరలి పుడదామనుకుంటూ వంగిపోయిన భుజాలతో ఆశలు అడుగంటిన కళ్లతో బరువుగా ఇంటి వైపుకో, సారా కొట్టుకొ సాగే సమయం. వారిని చూస్తూ ఉంటే నార్మన్ గార్డ్స్ బై కళ్లకు ఈ లోకమనే ఆనందక్షేత్రంలో హక్కుగా ఉండవలసిన వాళ్ళెవరూ కనపట్టం లేదు. నిజానికి ఈ ఓడిపోయిన వాళ్లల్లో తనని తాను కూడా ఒకడిగా లెక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు గార్డ్స్ బై. అతనికి పోయిన గంటు అంటూ ఏమీ లేదు, డబ్బుకు కొదువా లేదు. అయినా మనిషి అనేవాడికి సంతోషపడ్డానికి ఒక కారణం కావాలి కానీ దిగాలు పడ్డానికి కారణం అవసరం లేదు, కారణం లేకపోయినా దుఖ కారణం కోరి తెచ్చుకునేంత సమర్దత ఒక మనిషిలో మాత్రమే ఉంటుంది.  

సరే, గార్ద్స్ బై పక్క బెంచి మీదికి ఒక ముసలాయన వచ్చి చేరాడు. ఆయనని చూస్తే మరీ ఘోరంగా ఉన్నాడు. మనిషి కుందించుకు పోయినట్లు, ఆత్మగౌరవం అడుగంటి పోయినట్లు ఉన్నాడు. దిగాలు దరిద్రం దురదృష్టం అనే ముగ్గురమ్మలు వచ్చి మూర్తీభవించిన మూర్తిలా ఉన్నాడు. పాపమని ఒక గులాబి పువ్వును తెచ్చి అతని కోటుకు అలంకరించే ప్రయత్నం చేయండి అలా చేస్తే ఆ పువ్వు బలవంతాన అతని గుండి బొత్తానికి ఉరివేసుకుని చచ్చి పోతానని బెదిరిస్తుంది. అంత దుర్భాగ్యంగా ఉన్నాడు అతను. అతను ఈ ప్రపంచంలోని పరమ ఏడుపుగొట్టు వాళ్లలో ఒకడు. కానీ ఈ ప్రపంచంలో ఒకడయినా అతడి గురించి ఏడుస్తారని మనం ఆశించలేనంత దిక్కుమాలిగా ఉన్నాడు. త్వరగా ఇంటికి వెడితే, ఇంట్లో వాళ్లతో  నిద్రపోయే సమయం వరకు ఎక్కువ చీవాట్లు తినాల్సి వస్తుంది కాబటి తక్కువ చీవాట్లు తినడం కోసం వీలయినంత ఆలస్యంగా ఇంటికి వెళ్లడానికే నిశ్చయించుకున్నట్టుగా ఉన్నాడితను అనుకుంటాడు గార్డ్స్ బై. మొత్తానికి ఒక సమయం తరువాత ఆ ముసిలాయన లేచి చీకట్లో కలిసిపోయాడు. అతని వెళ్ళిన కాసేపటికి ఒక యువకుడు వచ్చి ఆ ముసిలాయన ఖాలీ చేసిన బెంచిలో కూచున్నాడు. ఇతని దుస్తులు బావున్నాయి, పైగా మంచి వయసు తాలూకు ఆరొగ్యం. అయితే ముఖంలో మాత్రం అంతకు ముందు మనిషికన్నా  ఆనందం ఎక్కువగా ఏ మాత్రం లేదు.

గార్డ్స్ బై ఇక ఉండబట్టలేక ఇతనితో మాట కలుపుతాడు. ఏమిటి విషయం, ఎందుకంత నిరాశ అని. ఇతగాడి కథ భలే విచిత్రంగా ఉంది. ఈ రోజే కొత్తగా ఈ ఊరికి పనిమీద వచ్చాడు. టాక్సీ డ్రైవర్ తనని ఇది మంచి హోటల్ అని ఒక హోటలులో దింపి వెళ్లాడు. బస బానే ఉంది. ఆ తరువాత స్నానానికి హోటల్ వారి సబ్బు వాడ్డం ఇష్టం లేక కొత్త సబ్బు కొనుక్కుందామని బయటికి వచ్చాడు. వస్తూ వస్తూ నాలుగు డబ్బులు మాత్రమే జేబులో వేసుకుని మిగతా అంతా తన పెట్టెలో భద్రపెట్టి దిగాడు. సబ్బు ఒకటి కొనుక్కుని ఆ వీధి ఈ వీధి సరదాగా చూసుకుంటూ ఒక బార్ లో దూరి  చిన్న డ్రింక్ కూడా తాగాడు, అప్పటికే చీకటి పడింది. బార్ నుండి బయటికి వచ్చాకా అసలు సంగతి  అర్థమయ్యింది. అసలే ఊరికి  కొత్త .  బసకు దిగిన హొటల్ అడ్రస్ గుర్తు పెట్టుకోలేదు, వీధి పేరు అవసరం అనుకొలేదు. సబ్బుకోసం దిగిన వాడు సబ్బు కొని వెనుదిరిగి పోక వీధులు కొలిచే పనిలో పడి, ఉన్న డబ్బుతో తాగి  ఇప్పుడు ఈ చీకట్లో దిక్కు తోచక వచ్చి కూచున్నాడు. "ఇది నా కథ, కాబట్టి నా కథని నమ్మి నా పరిస్థితిని  దిగమింగగలిగిన మీ వంటి  ఏ మంచి మనిషయినా ఎదురయ్యి నాలుగు రాళ్ళు అరువిస్తే ఈ రాత్రి ఈ దగ్గరలోని ఏ హోటల్లోనో తల దాచుకుని, రేపు ఉదయమే నా బస వెదుక్కోగలను" అన్నాడు.

"అదేలే! దాందేముందిలే! ఇటువంటి కథలకేం గొడ్డు పోయిందిలే? నువ్వు ఏ సబ్బు ముక్క కొసం ఇన్ని తంటాలు పడ్డావో ఆ సబ్బు ముక్క నాకు  చూపిస్తే, నీ చిక్కు తీరిపోదూ" అన్నాడు గార్డ్స్ బై.

యువకుడు గబ గబా జేబులు తడుముకున్నాడు, తనమీద తనే కొపడ్డాడు, చిరాకు పడ్డాడు, ఈ గందరగోళంలో సబ్బు ముక్క ఎక్కడో పడిపోయినట్లుంది అని తన దురదృష్టానికి తనే చింతించాడు. (క్లిక్‌: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!)

"చూసావా? నువ్వు కథ బాగా చెప్పగలిగావు. నీ మాటల్లో సత్యం, కళ్లల్లో దీనత్వం కొట్టొచ్చినట్లు చూపించగలిగావు. అయితే నువ్వు మరిచి పొయిందల్లా కనబడినవాడికల్లా నీ దీన కథ వినిపించాలనుకోవడానికి ముందుగా ఒక సబ్బు ముక్కను సాక్ష్యంగా తోడు తెచ్చుకోడమే" అన్నాడు గార్డ్స్ బై వెటకారంగా. ఆ యువకుడు ఇదంతా వినదలుచుకోలేదు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హాస్యాస్పదంగా నవ్వుకుంటూ గార్డ్స్ బై కూడా అక్కడి నుండి ఇక వెళ్ళిపోదామని లేచాడు. అయితే ఉన్నట్టుండి నేల మీద పడి ఉన్న ఒక పొట్లం ఆకర్షించింది. ఏమిటా అని దానిని అందుకుని చూస్తే, పొట్లం కట్టి ఉన్న సబ్బు బిళ్ళ, అరెరే! ఎంత పని జరిగి పోయింది, అనుకుని ఆ కుర్రాడు వెళ్ళిన దారి వైపు  కదిలాడు గార్డ్స్ బై. అదిగో అతను అక్కడున్నాడు. అబ్బాయి నీ నిజాయితికి  ఇదిగో సాక్షం దొరికింది. నీ అవసరంపై నా అపనమ్మకాన్ని నువ్వు మన్నిస్తావనే అనుకుంటాను. ఈ డబ్బు పట్టు నా అడ్రస్ కాగితం కూడా. నువ్వు డబ్బు నాకు ఎప్పుడు పంపించినా తొందరలేదు. అదృష్టం నీకు తోడుగా ఉండుగాక.  యువకుడు ధన్యవాదాలు చెబుతూ అక్కడి నుండి నిష్క్రమించాడు. 

ఈ కథ వ్రాసిన వారు హెచ్ హెచ్ మన్రో అనే బ్రిటీష్ రచయిత. కలం పేరు సాకీ. నేను స్కూలు పిల్లవాడిగా ఉన్నప్పుడు సరిగా గుర్తు లేదు కానీ శారదా విద్యామందిరం లోనే నేతాజీ పబ్లిక్ స్కూల్ వారో దీనిని పిల్లలతో ఇంగ్లీష్ లోనే నాటకం వేపించారు. ఒక బ్రిటిష్ కథ మా చిన్న ఊరిలో ఒక చిన్న బడిదాకా ఎట్లా చేరిందా అని నా ఆశ్చర్యం. ఆ మధ్య కె.బి. గోపాలం గారు దీనిని తెలుగులోకి అనువదించారు. 

కథ ఎలా మొదలవాలి? ఎక్కడ ఆపెయ్యాలి ఈ రెంటి మధ్య ఏం జరగాలి అది ఎంత ఉండాలి అని కదా కథ. ఇక వినండి.

"పాపం కుర్రవాడు అన్యాయమైన పరిస్తితులకు దొరికిపోయాడు, అదృష్టవశాత్తు అతని సబ్బు దొరికింది లేకపోతే నేను అతి తెలివితో ఆలోచించినట్లే అతని గోడు విన్న ప్రతి ఒక్కరు నాలా సాక్ష్యం అడిగితే అతనికి మానవ జాతిమీద ఏం నమ్మకం మిగిలేట్లు. "గార్డ్స్ బై కి వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు వెను తిరిగి తను కూచున్న బెంచి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఎవరో ఉన్నారు, మోకాళ్ళ మీద వంగి ఏమో చేస్తున్నాడు. (క్లిక్‌: అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..)
'ఎవరది?" 
అతను తల తిప్పి చూశాడు, ఇందాకటి దురదృష్ట మొహం పెద్దాయన.
ఏమిటండి సంగతి?"
"నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా"

- అన్వర్

మరిన్ని వార్తలు