Bathukamma 2022: బహుజన బతుకమ్మ ఆడదాం

1 Oct, 2022 13:09 IST|Sakshi

మన సమాజపు ఆవరణలోని పునాది ఉపరితలాల్లో పరివ్యాప్తి చెంది, సమాజపు లోతుల్లోకి పాతుకుపోయిన కులవివక్ష, లింగ వివక్ష గురించి మాట్లాడుకోవడానికి మున్నూట ఆరవై ఐదు రోజులు సరిపోవు. అలాంటి వివక్షకు గురవుతున్న బహుజన సమాజపు స్త్రీలు అచ్చంగా ఆడి పాడేదే బతుకమ్మ పండుగ. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ, తదనంతర విప్లవోద్యమంలోనూ, అలాగే స్వరాష్ట్ర సాధన పోరాటంలోనూ బతుకమ్మ ఒక ఉద్యమ పతాకగా మన చేతికందింది.

నిషేధాలకు గురై కూడా కొనసాగుతున్న అంటరానితనం, అన్ని రంగాల్లో ప్రబలిన కులవివక్ష, పితృస్వామ్యం, బతుకమ్మ పండుగల్లోనూ వ్యక్తమవుతుంది. ప్రజలంతా జరుపుకునే పండుగల్లోనూ ఊరూ–వాడల్ని విభజించే కుల వివక్షకు వ్యతిరేకంగా ‘కల్సి ఆడుదాం– కల్సి పాడుదాం–కల్సి పోరాడుదాం’ అంటూ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బహుజన బతుకమ్మ ద్వారా పండుగల్లోని అసమానతలను, వివక్షను సరిచేస్తూ దీన్నొక పంటల పండుగగా జరుపుతున్నాం. అందుకే ‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం’ అంటూ చాటుతున్నాం. 

బతుకమ్మ బహుజన సాంప్రదాయం. పురాణ ఇతి హాసాల్లో బతుకమ్మ గురించి ఏమి చెప్పినా బతుకమ్మ మాత్రం తెలంగాణ పంటల పండుగ. మత కోణం నుండి దీనిని బ్రాహ్మణీకరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దూరంగా నిశ్చేష్ఠులై ఉండలేము కదా! తెలంగాణ ఉత్పత్తి విధానంలోని నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపడ్తూ దానితో ముడిపడ్డ పంటలనూ, ఆ పంటలకు నీరిచ్చే చెరువులూ, కుంటలనూ; వాటికి ఆదరువైన గుట్టలూ, కొండలనూ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అలా ప్రతి ఏటా వర్తమాన సమస్యలతో జోడించి బహుజన బతుకమ్మను కొనసాగిస్తున్నాం.

నా అనుభవంలో ఏ కులానికి ఆ కులం కలిసి ఆడు కోవడం, బతుకమ్మను నీళ్లల్లో వేసి సాగనంపి మాలో మేమే సద్దులు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం. నా చిన్నతనంలో కుల వాడలు, వెలివాడలు స్పష్టంగా ఉన్న కాలంలో కుర్మోళ్ల బతుకమ్మ, రెడ్డోళ్ల బతుకమ్మ అంటూ పోటీపడేవాళ్ళం. నిన్న మొన్నటిదాకా కూడా దళితుల బతుకమ్మ ఊర్లోళ్ళ బతుకమ్మతో కలిపి ఆడుకోవడం అనేది లేకుండా పోయిన విషయం మన గమనంలో ఉంది. 

గడిచిన 12 ఏళ్ల అనుభవంలో దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేస్తూ ఊరుతోపాటు ఆడి పాడి వారితో కలిసి ఒకే చెరువులో నిమజ్జనం చేయడమే ఒక విప్లవాత్మక చర్యగా ప్రజలు భావించారు. ఇక గర్భగుడిలోకి దళితుల ప్రవేశం గురించి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందేమో! ఇంకా కొన్ని గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి అమలు జరుగుతోంది. ఇప్పటికీ భూమిలేని దళితులు కోకొల్లలు. వారికి కనీస భూమి ఇవ్వాలి. వారు ఊరుతో కలిసి ఆడుకొని, సహపంక్తి భోజనాలు చేసుకుని ఆత్మ గౌరవంగా పండుగ చేసుకునేలా ప్రజలు ఐక్యతను చాటాలి.


- విమలక్క 
ప్రజా గాయని

మరిన్ని వార్తలు