ఈ చికిత్స సరైనదేనా? | Sakshi
Sakshi News home page

ఈ చికిత్స సరైనదేనా?

Published Tue, Apr 26 2022 12:34 AM

Central Government Plans Renovation Of Rivers In India - Sakshi

ఆలోచన మంచిదే. కానీ, ఆచరణలో చిత్తశుద్ధి చూపితే మరీ మంచిది. దేశంలోని 13 ప్రధాన నదుల ‘పునరుజ్జీవనం’ కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన ప్రణాళిక, చేసిన ప్రకటన చూశాక నిపుణులు చేస్తున్న వ్యాఖ్య ఇది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 57.45 శాతం మేర భాగాన్ని చుట్టి వచ్చే 13 ప్రధాన నదులు, వాటి 202 ఉపనదుల జలాలకు సంబంధించిన ప్రాజెక్టు ఇది. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ చెబుతున్నట్టే అంతా జరిగితే, పెను మార్పు వస్తుంది. దేశంలో అటవీ విస్తీర్ణం 7,417 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుతుంది. కాకపోతే, నదుల క్షీణత వెనుక ఉన్న అసలు కారణాలను వదిలేసి, అటవీ పెంపకమంటూ కొత్త సీసాలో పాత సారాగా ఈ ప్రతిపాదన తెచ్చారా? కాగితాల

మీది పదును సర్కారు కార్యాచరణలోనూ కనపడుతుందా?
గత రెండు, మూడు దశాబ్దాలుగా వ్యవసాయంలో నీటి దుర్వినియోగం, పెచ్చుమీరిన పట్టణీ కరణతో నీటి కోసం ఒత్తిడి పెరిగింది. నదీగర్భాలు ఎండిపోతున్నాయి. సహజసిద్ధంగా సాగాల్సిన భూగర్భ జలమట్టాల పెంపునకు గండిపడుతోంది. భూసారం క్షీణిస్తోంది. వర్షపునీటితో నిండు కుండలు కావాల్సిన నదులు ఎండమావులవుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న జనాభాతో దేశంలో సగటు నీటి లభ్యత బాగా తగ్గిపోతోంది. నదుల రాష్ట్రంగా పేరున్న పంజాబ్‌లోని దక్షిణ ప్రాంతం సహా అనేక రాష్ట్రాలు ఎడారులయ్యే ప్రమాదంలో పడ్డాం. సారవంతమైన భూములనూ, భారీ పంట దిగుబడులనూ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి పరిష్కారంగా ప్రభుత్వం చెబుతున్న నదుల పునరుజ్జీవనం సుమారు రూ. 19,300 కోట్ల పైగా అంచనా వ్యయంతో కూడిన పంచవర్ష ప్రణాళిక. 23 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించిన నదులకు కాయకల్ప చికిత్స.

హిమాలయ ప్రాంతంలోని ఝీలమ్, చీనాబ్, రావి, బియాస్, సత్లెజ్, యమున, బ్రహ్మపుత్ర, ఎండిపోయిన నదుల విభాగంలో లూనీ, దక్కన్‌ భూభాగంలోని కృష్ణా, గోదావరి, కావేరి, నర్మద, మహానది – ఇలా మొత్తం 13 నదులు ఈ భారీ పునరుజ్జీవన ప్రణాళికలో ఉన్నాయి. ఈ నదులకు కొత్త జవజీవాలు కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలతో వివరణాత్మకమైన ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌)లను డెహ్రాడూన్‌లోని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌’ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ) సిద్ధం చేసింది. ప్రాథమికంగా నదీ తీరం వెంట చెట్లను పెంచడం ద్వారా నదీజలాలకు పునరుత్తేజం తేవాలన్నది ఆలోచన. అలా పెంచే నదీ తీరస్థ అడవులన్నీ ‘సహజసిద్ధమైన బఫర్లు’గా, ‘బయోఫిల్టర్లు’గా నదుల స్వీయ శుద్ధీకరణకు తోడ్పడతాయని భావన.

గతం గమనిస్తే – 2030 నాటికల్లా 50 లక్షల హెక్టార్ల మేర క్షీణించిన భూభాగాన్ని పునరుద్ధరిస్తామంటూ ‘బాన్‌ ఛాలెంజ్‌’ కింద 2015లో మన దేశం వాగ్దానం చేసింది. తాజాగా నదీజలాల పునరుజ్జీవన ప్రణాళికతో ఆ లక్ష్యానికి చేరువ కావచ్చని ప్రభుత్వ వర్గాల ఆశాభావం. అందుకు తగ్గట్లే, కొత్తగా పెంచే ఈ నదీ తీరస్థ అడవులు ‘కార్బన్‌ సింక్‌’లుగా పదేళ్ళలో, ఆపైన ఇరవై ఏళ్ళలో ఎన్ని మిలియన్‌ టన్నుల మేరకు వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకుంటాయనే లెక్క కూడా కట్టారు. కేవలం కర్బన వాయువులను పీల్చుకోవడానికే కాక, భూగర్భ నీటిమట్టం పెరగడానికీ, భూక్షయాన్ని అరికట్టడానికీ ఈ నదుల పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ తోడ్పడుతుందని అంచనా. 

ఒక రకంగా 2015–16లో ప్రయోగాత్మకంగా చేపట్టిన గంగా నది పునరుజ్జీవన పథకం లాంటిదే ఈ సరికొత్త 13 నదుల ప్రణాళిక! ఆర్భాటంగా మొదలైన ఆ ప్రభుత్వ పథకం ఏ మేరకు వాస్తవంగా సఫలమైందో చూస్తూనే ఉన్నాం. ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పటికీ గంగా నదీజలాల స్వచ్ఛత మాటలకే పరిమితమైంది. ఇప్పుడు ఈ పునరుజ్జీవన పథకమూ అదే బాటలో నడిస్తే లాభం లేదు. నదుల పునరుజ్జీవన ప్రణాళికకు వాతావరణ మార్పుల లాంటి అడ్డంకులూ ఉన్నాయి. సరైన రీతిలో మొక్కల పెంపకం లాంటి వివిధ అంశాలపై ప్రాజెక్ట్‌ సఫలత ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా, నాటే చెట్ల వయసు, పరిమాణం లాంటివి కూడా దృష్టిలో పెట్టుకొని నాణ్యమైనవాటిని నాటితేనే ఫలితం. నదీ తీరం వెంట మొక్కలు నాటడాని కన్నా ముందుగా భూసారం, నేలలోని తడిని పరి రక్షించే చర్యలు చేపట్టడం కీలకం. నదీ తీరస్థ అటవీ పెంపకం పేరిట స్థానిక పర్యావరణాన్ని దెబ్బ తీయకూడదు. ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైన చెట్టూచేమా, పొదలు, తుప్పలను కాపాడుకోవాలి.

నిజానికి, నదీ జలాల సహజ ప్రవాహాలను అడ్డుకుంటూ అనేక చిన్నా పెద్ద ఆనకట్టల నిర్మాణం, పారిశ్రామిక కాలుష్యం, వాతావరణ మార్పులతో హిమానీనదాలు కరిగిపోవడం, భూగర్భజలాల దుర్వినియోగం – ఇలా నదుల క్షీణతకు అసలు కారణాలు అనేకం. వాటిని పరిష్కరించే ఆలోచన చేయకుండా, పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రంలాగా నదీతీరంలో మొక్కలు నాటితే చాలనుకోవడం ఏమిటి? పర్యావరణవేత్తలు వేస్తున్న ప్రశ్న ఇదే. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవడం మొదలు నదుల ఆయకట్టులోని అటవీ పర్యావరణ వ్యవస్థలను కాపాడడం లాంటివి నదులకు కొత్త జవజీవాలను ఇస్తాయి. అవేమీ చేయకుండా, తప్పనిసరి అటవీ పెంపక చట్టం (క్యాంపా) కింద హిమాచల్‌లో, సత్లెజ్‌ ఎగువ ఆయకట్టులో చెట్లు పెంచితే, ఆ ఆలోచన విఫలమైంది. ఆ ప్రాంత భూభాగ సహజ స్వభావాన్ని దెబ్బతీసింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే కష్టం. అన్ని సమస్యలకూ పరిష్కారం ఒకటే అనుకుంటే నష్టం. ఎక్కడో గాయానికి, మరెక్కడో మందు పూస్తే సరిపోదని గ్రహించి, పాలకులు చిత్తశుద్ధితో నదీజలాల పునరుజ్జీవన చర్యలు చేపట్టాలి. 

Advertisement
Advertisement