కన్హయ్య కుమార్‌ (కాంగ్రెస్‌) రాయని డైరీ | Sakshi
Sakshi News home page

కన్హయ్య కుమార్‌ (కాంగ్రెస్‌) రాయని డైరీ

Published Sun, Sep 11 2022 1:37 AM

Congress Party Bharat Jodo Yatra Kanhaiah Kumar Rayani Diary - Sakshi

రాహుల్‌గాంధీలో కొంచెమైనా అలసట కనిపించడం లేదు! అప్పటికే ఆయన తనతో పాటుగా మమ్మల్ని దేశానికి దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుంచి ఉత్తర దిక్కున ఉన్న కశ్మీర్‌ వైపుగా 12–13 కిలోమీటర్ల దూరం నడిపించి ఉంటారు! ‘‘మరొక 12–13 కి.మీ. నడుద్దాం’’ అన్నారు రాహుల్‌.. నడుస్తూ నడుస్తూనే. ఆ సంకల్ప బలమే సీనియర్‌ నాయకుల్ని సైతం ఉత్సాహంగా నడిపిస్తోంది. ‘‘అలాగే రాహుల్‌బాబూ! మరో 12–13 కి.మీ నడుద్దాం..’’ అన్నారు దిగ్విజయ్‌సింగ్‌.. రాహుల్‌ వేగాన్ని అందుకుంటూ! దిగ్విజయ్‌ వేగాన్ని అశోక్‌ గెహ్లోత్‌ అందుకున్నారు. అశోక్‌ గెహ్లోత్‌ వేగాన్ని భూపేశ్‌ భగేల్‌ అందుకున్నారు. భూపేశ్‌ భగేల్‌ వేగాన్ని జైరాం రమేశ్‌ అందుకున్నారు. వాళ్లందరి వెనుక నేను నడుస్తున్నాను. ‘‘ఓయ్‌ కన్హయ్యా! ఏంటా పెళ్లి నడక.. స్పీడప్‌ స్పీడప్‌..’’ అంటున్నారు భూపేశ్‌ భగేల్‌ నా వైపు చూసి నవ్వుతూ. కాంగ్రెస్‌కు ప్రస్తుతం మిగిలి ఉన్న ఇద్దరు సీఎంలలో ఆయన ఒకరు. జోడో యాత్రలో నా డ్యూటీ నడవడం మాత్రమే కాదు. అందరికన్నా వేగంగా నడవాలి, అందరికన్నా వెనక నడవాలి. 
‘‘మిమ్మల్ని ఫాలో అవ్వాలంటే మీ వెనుకే కదా నడవాలి భగేల్‌జీ..’’ అన్నాను నా నడక వేగాన్ని పెంచీ పెంచకుండా.‘‘అద్సరే భగేల్, పెళ్లి నడక అంటావేంటి? కన్హయ్యకు పెళ్లెప్పుడైందీ మనకు తెలీకుండా...’’ అన్నారు గెహ్లోత్‌ పెద్దగా నవ్వుతూ. కాంగ్రెస్‌కు మిగిలిన ఇద్దరు సీఎంలలో ఆయన ఇంకొకరు.

‘‘హాహ్హాహా.. పెళ్లి కాని వారు పెళ్లి నడక నడవరంటావా గెహ్లోత్‌జీ..’’ అన్నారు భగేల్‌!  ఆ టాపిక్‌ని అక్కడే ఆపనివ్వకపోతే ముందు వరుసలో నడుస్తున్న వారి వరకు వెళ్లేలా ఉంది. ‘‘గెహ్లోత్‌జీ! నాకొకటి అనిపిస్తోంది. దేశం రెండు కమతాలుగా విడిపోవడానికి మహమ్మద్‌ అలీ జిన్నా కారణం అయితే, దేశం రెండు మతాలుగా విడిపోవడానికి మన మోదీజీ కారణం అవుతున్నారు కదా..’’ అన్నాను. ‘‘ఇందులో కొత్తగా అనిపించడానికి ఏముంది కన్హయ్య కుమార్‌!’’ అన్నారు గెహ్లోత్‌. ‘‘మతాలు, కమతాలు! మంచి రిథమ్‌ ఉంది కన్హయ్యా నీలో. రిథమ్‌ ఉండీ పెళ్లెందుకు చేసుకోలేదు?’’ అని నవ్వారు భగేల్‌! పెళ్లి టాపిక్‌ పక్కదోవ పట్టేందుకు ఇద్దరూ ఇష్టపడటం లేదు!

పాదయాత్ర బ్రేక్‌లో తొలిరోజు రాత్రి నాగర్‌కోయిల్‌లోని స్కాట్‌ క్రిస్టియన్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో స్టే చేశాం. స్నానాలు, భోజనాలు అయ్యాక సీనియర్‌ నాయకులంతా గ్రౌండ్‌ లోపల నిలిపిన కంటెయినర్‌లలోకి వెళ్లిపోయారు. నేను, కొంతమంది యూత్‌ లీడర్‌లు గ్రౌండ్‌లో ఆరుబయటే మసక చీకటిలో టార్పాలిన్‌లపై విశ్రమించాం. 
‘‘మనమింకా ఎంతదూరం ప్రయాణించాలి కన్హయ్యా..’’ అని నా పక్కనే విశ్రమించి ఉన్న వారెవరో అలసటగా అడిగారు! పాదయాత్ర మొదటి రోజే ఆ మాట అడిగిందెవరా అని చూశాను. పి.చిదంబరం! ‘‘సార్‌! మీరా? మీరేమిటి ఈ ఆరుబయట?!’’ అన్నాను. ‘‘నాకు ఏసీ పడదు కన్హయ్యా! అందుకే కంటెయినర్‌లలోకి వెళ్లలేదు. సరే ఇది చెప్పు. కశ్మీర్‌ ఇక్కడికి ఇంకా ఎంత దూరం?’’ అని అడిగారు చిదంబరం!!

‘‘పెద్ద దూరమేం కాదు చిదంబరంజీ. ఇప్పుడు నాగర్‌కోయిల్‌లో ఉన్నామా..  తర్వాత తిరువనంతపురం, కొచ్చి, నీలాంబర్, మైసూర్, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్‌గావ్, ఇండోర్, కోట, దౌసా, అల్వాల్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్‌.. ఆ తర్వాత జమ్ము, శ్రీనగర్‌.. అంతే!’’ అన్నాను. ‘‘అంతేనా! మధ్యలో ఏం మిస్సవలేదు కదా!!’’ అన్నారు చిదంబరం. లేదన్నట్లుగా ఆయన వైపు చూసి నవ్వాను. నిజంగానే మధ్యలో ఏం మిస్సవలేదు. మధ్యలో ఎవరైనా మిస్‌ అవుతారేమో తెలీదు.

Advertisement
Advertisement