PM PRANAM Scheme: ఈ పథకంతో ఆహార భద్రతకు ప్రమాదం | Sakshi
Sakshi News home page

PM PRANAM Scheme: ఈ పథకంతో ఆహార భద్రతకు ప్రమాదం

Published Sat, Oct 15 2022 12:46 PM

Food Security Risk with This PM PRANAM Scheme: Sarampally Malla Reddy - Sakshi

కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని చర్చల కోసం  విడుదల చేసింది. ఈ పథకాన్ని రాష్ట్రాలు ఆమో దిస్తే చట్టం చేయాలని నిర్దేశించారు. దేశంలో ఎరువుల వాడకం విచక్షణా రహితంగా పెరుగుతున్నదనీ, ఆ విని యోగాన్ని తగ్గించాలనీ ఈ పథకాన్ని రూపొందించారు. ఎరువుల వినియోగం తగ్గితే వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇప్పటికే వంటనూనెలు, పప్పులు, పంచదార, పత్తి, ముతక ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాము. గతంలో ఇవన్నీ ఎగుమతి చేసిన దేశం మనది. వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూటీఓ) విధానాలు వచ్చిన తర్వాత, స్వయంపోష కత్వంలో ఉన్న దేశం సబ్సిడీలు తగ్గించడంతో దిగుమతులపై ఆధారపడుతున్నాము. ‘పీఎం ప్రణామ్’(పీఎం ప్రమోషన్‌ ఆఫ్‌ ఆల్టర్నేట్‌ న్యూట్రియంట్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ మేనేజేమెంట్‌) పథకం ఎరువుల సబ్సిడీలను కోత పెట్టాలని స్పష్టంగా చెపుతున్నది. 

2017–18లో 528 లక్షల టన్నుల ఎరువులు విని యోగించాము. 2021–22లో 640 లక్షల టన్నులకు వినియోగం పెరిగింది. ఈ పెరుగుదలను తగ్గించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ప్రకారం ఎరువులకు ఇస్తున్న సబ్సిడీని ఆదా చేస్తారు. ఆదా చేసిన దానిలో 50 శాతం రాష్ట్రాలకు ఇస్తారు. ఈ 50 శాతంలో 70 శాతం గ్రామ, జిల్లా, బ్లాక్‌లకు ప్రత్యామ్నాయ ఎరువుల సాధనకు ఇస్తారు. మిగిలిన 30 శాతం ఎరువుల తగ్గింపుపై, సేంద్రీయ ఎరువులపై అవగాహన కల్పించడానికీ, రైతులను చైతన్యపర్చడానికీ శిక్షణ ఇస్తారు. మిగిలిన 50 శాతం కేంద్రప్రభుత్వం తన బడ్జెట్‌లో కలుపుకొంటుంది.

భారతదేశంలో హెక్టారుకు 175 కిలోల ఎరువులు వాడుతున్నాము. హెక్టారు ఉత్పాదకత 3,248 కిలోలు వస్తున్నది. 43 కోట్ల ఎకరాలు సాగుచేస్తున్న దేశంలో నేటికి 9 కోట్ల ఎకరాల భూమి బీడుగా మారింది. జనాభా ఏటా 1.9 శాతం పెరుగుతున్నది. పెరిగిన జనాభాకు ఆహారధాన్యాల ఉత్పత్తిని మరింత పెంచాలి. వాస్తవానికి భారతదేశంలో 80 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. అందులో 40 కోట్ల మంది దినసరి ఆహారధాన్యాల వాడకం 450 గ్రాముల నుండి 325 గ్రాములకు తగ్గిపోయింది. సేంద్రీయ ఎరువులను, రసాయనిక ఎరువులను కలిపి వాడడం ద్వారానే వ్యవసాయోత్పత్తులు పెరుగుతాయి. 

చైనాలో 25.5 కోట్ల ఎకరాలలో 61.22 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి చేస్తున్నారు. హెక్టారుకు 6,081 కిలోలు ఉత్పత్తి అవుతున్నది. 2018 గణాంకాల ప్రకారం హెక్టారుకు 393.2 కిలోల ఎరువులు వాడుతున్నారు. ఎరువుల వినియోగం పెంచడంతో మనదేశం కన్నా రెట్టింపు ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతున్నది. పైగా వారు 2.77 బిలియన్‌ డాలర్ల ఎరువులను ఎగుమతి చేస్తున్నారు. ఎరువుల వినియోగాన్ని పెంచకుండా ఉత్పత్తి, ఉత్పాదకత పెరగదు. ఈమధ్య శ్రీలంక అనుభవం చూసినపుడు సేంద్రీయ ఎరువుల వాడకంతో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి తీవ్ర సంక్షోభంలో పడి ప్రభుత్వమే కూలిపోయింది. ఈ పథకం అమలుచేస్తే భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. 

ఇప్పటికే వ్యవసాయ రంగంలోకి 8 కార్పొరేట్‌ సంస్థలు వచ్చి తమ వ్యాపారాలు సాగిస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడంకన్నా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే వారికి మంచి లాభాలు వస్తాయి. 2015లో శాంత  కుమార్‌ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టు ప్రకారం, కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలను ఎత్తివేయడం, సబ్సిడీని నగదు బదిలీగా మార్చడం చేయాలని ఇచ్చిన సలహాలను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్నది. మనకు ఎగుమతులు చేస్తున్న దేశాలు తమ బడ్జెట్లలో 7 నుండి 10 శాతం వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నాయి. పైగా ముడి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి అదనపు లాభానికి భారతదేశానికి ఎగుమతి చేస్తూ వేలకోట్ల లాభాలు గడిస్తున్నాయి.

దిగుమతులు రావడం వల్ల స్థానిక పంటల ధరలు తగ్గి రైతులకు గిట్టుబాటు కావడంలేదు. కార్పొరేట్‌ సంస్థలు వ్యవసాయరంగంలో తమ ప్రాబల్యం పెంచడానికి వీలుగా ఇలాంటి పథకాలను తేవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం రుణాలు ఇవ్వక పోవడం, సబ్సిడీలకు కోతపెట్టడంతో రైతులు మైక్రోఫైనాన్స్‌ సంస్థల బారిన పడి, వారికి వడ్డీ చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్‌లో 2.5 శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు. దీనిని 7 శాతానికి పెంచాలి. ఎరువులను శాస్త్రీయంగా వినియోగించడానికి వీలుగా భూసార పరీక్షలు జరిపి రైతులను చైతన్య పరచాలి. అంతేగానీ ఇలాంటి ప్రమాదకర పథకాలను అమలు పరచరాదు.


- సారంపల్లి మల్లారెడ్డి 
ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు

Advertisement
Advertisement