దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే! | Sakshi
Sakshi News home page

దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే!

Published Sat, Feb 17 2024 4:09 AM

Former Chief Electoral Officer of AP trends in the name of Citizens for Democracy - Sakshi

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు మూసుకుని, పదవీ విరమణ తర్వాత తగుదునమ్మా అంటూ టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు ఊరూరా తిరుగుతున్నారు. హింసలేని ఎన్నికలు, స్వేచ్ఛ అంటూ పెద్ద మాటలు చెబుతున్నారు. కాపాడే అధికారం ఉన్నప్పుడు ఏం చేశారని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.ఇటీవల కాలంలో ‘సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ’ (సీఎఫ్‌డీ) పేరుతో ఏపీ ఎన్నికల మాజీ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు సమా వేశాలతో హడావిడి చేస్తున్నారు.

సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ ప్రధాన లక్ష్యం స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్ని కల్లో ఓటు హక్కును ఉపయోగించుకోవడం అని ప్రకటించారు. ఇదే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న కాలంలో, స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయనీ, అలాగే నామినేషన్లు వేయనివ్వడం లేదనీ, దౌర్జన్యాలు నెరిగాయనీ పెద్ద ఎత్తున విపక్షాలు ఫిర్యాదు చేయడం గమనార్హం.


ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిగా తొలగించడంతో ఆయనకు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లాంటివి గుర్తు కొస్తున్నాయి. ఈయన అప్రజాస్వా మికంగా వ్యవహరిస్తున్నారని గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారనే విష యాన్ని మరిచిపోతే ఎలా? సీఈసీ విడుదల చేసిన వివరాల ప్రకారం 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో 79.74 శాతం ఓట్లు పోలయ్యాయి. నరసరావుపేట పార్లమెంటరీ నియోజక వర్గంలో అత్యధికంగా 85.53 శాతం పోలయ్యాయి. అలాగే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో 74.64 శాతం ఓట్లు పోలయ్యాయి. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధికంగా 85.16 శాతం ఓట్లు పోలయ్యాయి.

అంటే, రాష్ట్ర విభజన జరిగిన మొదటి ఐదేళ్లకే ఇక్కడి ప్రజల్లో కలిగిన చైతన్యం కారణంగా 2019 ఎన్నికల్లో చంద్ర బాబును ఇంటికి పంపడం కోసం, మరో ఐదు శాతం మంది కొత్తగా ఓటింగ్‌లో పాల్గొన్నారన్నమాట. ఇక్కడి గణాంకాలు ఇలా ఉన్నప్పుడు, ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మళ్ళీ ఓటు–హక్కు అంటూ, వీరి కసరత్తు ఎందుకు? ఈ ఐఏఎస్‌ అధికారులతో పీవీ రమేష్‌ అనే మరొక ఐఏఎస్‌ కలిశారు. వీరు కలిగించే చైతన్యం అంతా బెజ వాడ కేంద్రంగానే సాగడం గమనార్హం.  

‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో నిమ్మగడ్డ బృందం నిర్వహిస్తున్న  సభల్లో గెస్ట్‌ పాత్రల్లో పాల్గొంటున్నవారి విషయమై పౌరులు బాధపడుతున్నారు. రిటైర్‌ అయ్యాక కూడా ౖవై సీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పబోయి క్షతగాత్రు లైన ఈ ముగ్గురు అధికారులు తమకంటూ ఇక్కడ ఒక విలువ లేక, ‘మీడియా అటెన్షన్‌’ కోసం, మాజీ భారత ఎన్నికల కమిషనర్‌ వీఎస్‌ సంపత్, కేబినెట్‌ సెక్రటరీ కె. పద్మనాభయ్యలను తమ పక్కన పెట్టుకుంటున్నారు. 

ఎందుకు ఈ మాజీ అధికారులను క్షతగాత్రులు అనవలసివచ్చిందో తెలియాలి. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ కేడర్‌లో ఏదో ఒక ప్రధాన శాఖలో కాకుండా, చంద్రబాబు కోసం తన సర్వీస్‌ చివరి రోజు వరకూ రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ సెక్రటరీగా పనిచేశారు. రాష్ట్ర విభజనకు ముందు 4 నెలల పాటు రాష్ట్రపతిపాలన ఉండడం మనకు తెలిసిందే. అప్పట్లో గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ ఆఫీస్‌ కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల్లో అన్ని కీలక నిర్ణయాలకు కేంద్రం అయింది. ఇలా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం మొదటి నుంచి నిమ్మగడ్డకు కొత్తకాదు. అందుకే 2016లో రిటైర్‌ అయిన మరుసటి రోజు ఇతణ్ణి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పోస్ట్‌లో చంద్రబాబు నియమించారు. 

అదే నెలలో ఆయన కుమార్తె నిమ్మగడ్డ లావణ్యను ఏపీ ‘ఎకనమిక్‌ డెవలప్మెంట్‌ బోర్డ్‌’లో సీనియర్‌ కన్సల్టెంట్‌గా నెలకు రూ 1.50 లక్షల జీతంతో నియమించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఉపాధి కోల్పోయి, పౌర వేదిక ముసుగులో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యర్థి తరహాలో ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారితే, మళ్ళీ ‘ఫ్యామిలీ ప్యాకేజి’ ప్రయోజ నాలు పొందడం ఆయన లక్ష్యం. అందుకోసం ‘ఈ ప్రభుత్వంలో సలహాదారులు ఎంతమంది? వీరు కేబినెట్‌ హోదాలో ఉంటూ రాజకీయాలు ఎలా మాట్లాడతారు?’ అంటూ రమేష్‌ టీడీపీ తరఫున విమర్శలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇప్పటికంటే ఎక్కువమంది సలహా దారులు, ‘కన్సల్టెంట్లు’ ఉన్న విషయం తెలియనిది కాదు.

‘స్కిల్‌ స్కామ్‌’లో అరెస్టయిన ‘ఏ 1’ గంటా సుబ్బా రావు, ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్న ‘ఏ 2’ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణలు ఇద్దరూ ఇదే తరహాలో బయట నుంచి ప్రభుత్వం ‘కన్సల్టెంట్స్‌’గా నియమించిన వారేకదా! ప్రభుత్వంలో సలహాదారులు రాజకీయాలు మాట్లాడ్డం నేరమా? లేక నమ్మకంగా ప్రభుత్వంలో ఉంటూ, దొంగ దారుల్లో నిధులు బయటకు పంపడం నేరమా? ఈ రెండింటిలో ఏది ప్రజాస్వామ్యానికి చేటు? అని రాష్ట్ర ప్రజలు ఈ నిమ్మగడ్డ బృందాన్ని నిలదీయొద్దూ? ‘రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం...’ అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లా డుతున్న నిమ్మగడ్డ, బెజవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీటులో కూర్చుని, తన తప్పుడు చర్యలకు తగిన శిక్ష నుంచి తప్పించుకోవడానికి క్రింది ఉద్యోగులతో‘కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌’లు ధ్వంసం చేయించడం ఏ స్ఫూర్తి అవుతుందో చెప్పగలరా?

అసలు ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమించడమే ఓ ప్రహసనం! ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న ప్పుడు సీఎస్‌గా ఉన్న అనిల్‌ చంద్ర పునేఠా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ ఉండడంతో, భారత ఎన్నికల కమిషనర్‌ వెంటనే అయన్ని తొలగించి, క్రీడలు యువజన సర్వీసులు సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యంను సీఎస్‌ పోస్టులో నియమించింది. అయితే, జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, సీఎం పరిపాలనా శైలి వేగాన్ని అందుకోలేని స్థితిలో ఉన్న ఎల్వీ స్థానంలో మరొకరిని సీఎస్‌ పోస్టులో నియమించారు. అదీ ఎల్వీ ఆక్రోశానికి కారణం. దాంతో, నిమ్మగడ్డ వెనుక తిరుగుతూ జగన్‌ ప్రభుత్వం మీద ముసుగు దాడికి దిగారు. 

ఇందులో ముఖ్యుల ఎంపిక ఎవరిదోగానీ, ఆసక్తి కరంగా ఉంది. అంబేడ్కరిస్టుల కుటుంబం నుంచి మాజీ ఐఏఎస్‌ పీవీ రమేష్‌ కొంచెం ఆలస్యంగా ఇందులోకి దిగారు. ‘స్కిల్‌ స్కామ్‌’ జరిగినప్పుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఈయన కేస్‌ సమయంలో ‘మీడియా’ ముందు వివాదాస్పదంగా మాట్లాడి వార్తల్లో వ్యక్తి అయ్యారు. సర్వీసులో ఎక్కువకాలం పలుదేశాల్లో ‘వరల్డ్‌ బ్యాంక్‌’లో పనిచేశానని చెప్పుకునే రమేష్, ప్రస్తుతం‘ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌’లో ‘ఫ్యాకల్టీ’గా పనిచేస్తూ, మధ్యలో ప్రజాస్వామ్య పరిరక్షణకు బెజవాడ వస్తున్నారు. అయితే, ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహం గురించి ఈయన ఒక్క మాటా మాట్లాడరు!

వీరంతా ‘పొలిటికల్‌ జేఏసీ’గా ఏర్పడి, దానికి ‘సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ’ అని పేరుపెట్టి ఏపీలో తటస్థ ఓటరును ప్రభావితం చేయాలనే రహస్య ‘ఎజెండా’తో పనిచేస్తున్నారు. వీరికి ‘మీడియా’ కవరేజి కోసం ‘బాబు మీడియా ఎటూ ఉండనే ఉంది. ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే... ప్రజలు అంతా గమనిస్తున్నారు. తగిన సమ యంలో తగినవిధంగా స్పందిస్తారు.

- వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే ‘ 98481 28844
- అడుసుమిల్లి జయప్రకాష్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement