రాజనీతి కథ

15 Aug, 2020 00:46 IST|Sakshi

అక్షర తూణీరం 

స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఏళ్లు దాటింది. తెల్లదొరల రాజ్యం వెళ్లి నల్లదొరల రాజ్యం వచ్చింది. కానీ రాజనీతి ఒక్క లాగే సాగుతోంది. సామాన్యుడి రెక్కలాట డొక్కలాట ఒక్కలాగే నడుస్తోంది. ఏ యుగంలో అయినా రాజ్యాధికార చెలా యింపు ఏకపక్షంగానే ఉంటుంది. ద్వాపర యుగంలో ఏకఛత్రపురం అనే చిన్న రాజ్యం ఉండేది. దానికో రాజున్నాడు. రాజుకి భోగాలన్నీ ఉన్నాయ్‌. ఉన్నట్టుండి రాజ్యానికి వుపలాయం వచ్చింది. ఓ బ్రహ్మరాక్షసుడు రాజ్యం పొలిమేరలో విడిది చేశాడు. వాడి పేరు బకా సురుడు. వాడి గురించి విన్న రాజుకి వణుకు పుట్టింది. బతికుంటే బలుసాకు తిని బతకవచ్చనే నిర్ణయానికి వచ్చి వెర్రి సాహసాలేవీ చెయ్యలేదు. మీసాలు దించి, కుదించి రాక్షసుడికి రాయబారం పంపాడు. నీ ఆకలి సంగతి నేను కనిపెట్టి ఉంటాను. నువ్వు ఇష్టారాజ్యంగా స్త్రీ, బాల, వృద్ధుల్ని ఎప్పుడంటే అప్పుడు పీక్కుతినద్దు. ఓ క్రమశిక్షణ పాటిద్దాం. రోజూ ఠంచన్‌గా సూర్యుడు నడి నెత్తికి వచ్చేసరికి, నీకు సన్నబియ్యం కూడు ఓ బండెడు, దానితోపాటు వచ్చిన జత దున్నపోతులు  ఆహారంగా ఉండిపోతాయ్‌ అన్నాడు రాజు. ‘నాకు నర మాంసం లేనిదే ముద్ద దిగదే’ అని అరిచాడు బకాసు రుడు.

దానికంతంత రంకెలెందుకు, సాయలాపాయ లాగా పరిష్కరించుకోవచ్చుగా అన్నాడు రాజు అనున యంగా. అసురుడు నవ్వి నీలాంటి సాత్వికుణ్ణి నేనింత వరకు కనలేదు, వినలేదు అన్నాడు మిక్కిలి అభినందన పూర్వకంగా. ‘సరే, అఘోరించావులే’ అన్నాడు లోలో పల రాజు. అనుకున్న మాట ప్రకారం బండి నడుస్తోంది. రాజుగారి వంటశాలలో గుండిగలూ వార్పులూ పెరిగాయి. ఓ జత దున్నపోతులు సంతల నించి, అంగళ్లనించి వస్తున్నాయి. సమస్య లేదు. ఇక మిగిలింది బండితోపాటు వెళ్లాల్సిన మనిషి. రాజు తలుచుకుంటే మనుషులకు కొరతా? రాజ్యంలో చాటింపు వేయిం చాడు. మంత్రులు, దండనాయకులు ఊరి మీదపడి తిథులవారీగా మనుషుల్ని నిర్ణయించి ఖాయం చేశారు. ఆ రోజు సుష్టుగా భోంచేసి వేళకు సిద్ధంగా ఉండాలని రాజాజ్ఞ జారీ చేశారు. కాదని తిరస్కరిస్తే ఆ మనిషిని కోట గుమ్మంమీద ఉరితీస్తారని హెచ్చరిక జారీ చేశారు. ‘ఏదైతే ఏమైంది, కనీసం అక్కడికి పోతే బ్రహ్మ రాక్షసుణ్ణి కళ్లారా చూడనైనా చూడవచ్చు, అదే బాగు’ అనుకు న్నారు పురజనం. మాట తేడా రాలేదు. రాజు హ్యాపీ, రాక్షసుడు హ్యాపీ! కొడవటిగంటి కుటుంబరావు తన కథలో ఏమంటారంటే– పాలక వర్గానికి రకరకాలుగా సమాజాన్ని దోచుకునే వెసులుబాటు ఉంటుంది. రక్షిం చాల్సిన రాజు హాయిగా ఓ ఒప్పందం చేసుకుని తాంబూ లాలిచ్చేశాం, మీ చావు మీరు చావండన్నారు. ఆయన భోగాలు తరగలేదు. ఆయన స్వజనం ఎవరూ బలికి వెళ్లరు. అంతా సవ్యంగా, పద్ధతిగా చికాకు లేకుండా కథ నడిచింది.

కరోనా ఉపద్రవం వచ్చినప్పుడు నాకు బకాసురుడి కథే గుర్తుకొచ్చింది. ఉన్నఫళంగా లాక్‌డౌన్‌ విధించారు రాజుగారు. ఒక్క ప్రయాణసాధనం లేదు. ఎక్కడివారు ఎక్కడెక్కడో చిక్కుకుపోయారు. లక్షలాదిమంది పిల్లా పెద్దా, ఆడామగా పరాయి ప్రాంతంలో చిక్కడిపో యారు. మరోవైపు మృత్యుభయం. ఏంచేస్తారు పాపం, రోడ్డునపడ్డారు. అసలే మనది రామరాజ్యం కదా. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అనుకుంటూ సొంత నేలకు పయనమయ్యారు. అదొక దుఃఖపూరిత సన్ని వేశం. దేశం యావత్తూ కంటతడి పెట్టింది. అవకాశం ఉన్న తల్లులు తలోముద్ద అన్నం పెట్టారు. జాలిపడ్డారు. రాజుగారు సాయపడుతున్న వారికి దణ్ణాలు పెట్టిం చారు. గంటలు మోయించి జేజేలు చెప్పించారు. దీపాలు వెలిగించి హారతులు ఇప్పించారు. కరోనాతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. దాంతో కలిసి జీవించడం అనివార్యం అన్నారు. జనం బిక్కమొహాలు వేసుకున్నారు.

బయటకు రాకండి, సుఖంగా ఇంట్లోనే బతికె య్యండి అంటూ రాజుగారు భరోసా ఇచ్చేశారు. అదే వన్నా అంటే మహా మహా దేశాలు నిస్సహాయంగా చూస్తూ ఊరుకున్నాయ్‌. మనమెంత అంటూ నిట్టూ ర్చారు. జనం ప్రతిగా నిస్పృహతో నిట్టూర్చారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆధునిక మానవుడు గొప్ప వాడు, చాలా గొప్పవాడు. బకాసురుణ్ణి మంత్రాంగాన్ని, కరోనాని కట్టడి చేసే వ్యాక్సిన్‌ని కనిపెడతాడు. మనిషి అసహాయ సూరుడు! జై హింద్‌!!

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు