ముమ్మాటికీ తప్పును సరిదిద్దుకోవాలి

18 Jul, 2022 13:08 IST|Sakshi

చాలామంది మాట్లాడటానికి భయపడుతున్నప్పుడు, మాజీ సీనియర్‌ న్యాయమూర్తులు కొందరు తీవ్రమైన విమర్శలు చేయడానికి సాహసించారు. బహుశా వారు వెరపులేని విమర్శకునికి అనుకూలంగా గొంతెత్తడం కోసం తమ సంయమనాన్ని కూడా అలా పక్కన పెట్టేయడానికి... వారి చైతన్యమే ప్రేరేపించినట్లున్నది. అలా స్పందించిన వారిలో ముగ్గురి గురించి ఈరోజు నేను మాట్లాడదలిచాను. వీరిలో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు కాగా, మూడో వ్యక్తి మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 

సుప్రీంకోర్టు తీస్తా సెతల్వాడ్‌ కేసులో తీర్పును ప్రకటించిన తర్వాత, ఆమెను అరెస్టు చేయడమే న్యాయస్థానం ఉద్దేశమైతే ‘ఇక స్వర్గాధిపతులే మనకు సహాయపడతారు’ అని జస్టిస్‌ మదన్‌ లోకుర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘వాస్తవానికి, విధానాలను దుర్వినియోగపర్చే ప్రక్రియలో పాల్గొన్న వారందరినీ చట్టం ప్రకారం విచారించా’లని ఆ తీర్పులో ఉన్న ఒక వాక్యం ఆయన్ని నిస్పృహకు గురి చేసింది. ఆ తీర్పు చెప్పిన న్యాయ మూర్తులు ఇక ఏమాత్రం జాగు చేయకుండా, ప్రత్యేకంగా సమావేశమై తీస్తా అరెస్టు తమ ఉద్దేశం కాదని ప్రకటన చేయాలని జస్టిస్‌ మదన్‌ లోకుర్‌ చెప్పారు. ‘కోర్టుకు సెలవులు కాబట్టి వారు ఢిల్లీలో లేనట్లయితే, తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేయడం తమ ఉద్దేశం కాదంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కి ఆదేశం పంపాల’ని ఆయన సూచించారు.

‘తప్పుడు కేసు పెట్టినందుకు ఆమెను విచారించాలని మీరు చెప్పాల్సిన అవసరం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. ‘వేలాది తప్పుడు కేసులను కోర్టుల్లో నమోదు చూస్తూనే ఉన్నారు. మరి వారందరినీ పట్టుకుని విచారించారా?’ అని ఆయన నిలదీశారు. ‘తప్పుడు కేసులను లెక్కకు మించి పెడుతున్న పోలీసుల విషయం  ఏమిటి? ఇలా చెప్పడం ద్వారా కోర్టు తన విలువను తాను క్షీణింప చేసుకుంది. తీస్తాను అభిశంసించిన రోజు నిజంగా చీకటి దినమే అంటే అంగీకరిస్తాను. సుప్రీం కోర్టు ఇలా వ్యవహరి స్తుందని ఎవరూ ఊహించలేదు’ అని ఆయన పేర్కొన్నారు.

మహమ్మద్‌ జుబెయిర్‌ కేసుపై జస్టిస్‌ దీపక్‌ గుప్తా వ్యాఖ్యానిస్తూ దిగువ కోర్టుపై మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అతడిని టార్గెట్‌ చేశారని భావిస్తున్నాను, ఎక్కడో తప్పు జరుగుతోంది’ అనేశారు. పోలీసు దురభిమానానికి జుబెయిర్‌ కేసు చక్కటి ఉదాహరణగా జస్టిస్‌ గుప్తా అభివర్ణించారు. ‘కచ్చితంగా దాంట్లో సందేహించాల్సిన పనేలేదు’ అన్నారు. ‘అతడిని ఎందుకు కస్టడీలోకి తీసు కున్నారని నాకు కాస్త ఆందోళనగానూ, అయోమయం గానూ ఉంది’ అని జస్టిస్‌ గుప్తా పేర్కొన్నారు. ‘ఆ సంఘటన 2018 మార్చిలో జరిగింది. నాలుగేళ్లు గడిచిపోయాయి. అతడి ట్వీట్‌ రెండు మతాల మధ్య ఏదైనా వివాదానికి దారి తీసినట్లు సంకేతాలు కూడా లేవు’ అంటూ జస్టిస్‌ గుప్తా స్వరం పెంచారు. ‘న్యాయస్థానం అతడికి బెయిల్‌ ఇవ్వడాన్ని కూడా తిరస్కరించిందన్న వాస్తవం నన్ను మరింత భయపెట్టింది. నాలుగేళ్లు అతడిని మీరు ఎందుకు అరెస్టు చేయలేదు? ఆ నాలుగేళ్లూ ఎలాంటి హానికర ఘటనా జరగ లేదు కదా. కానీ ఇప్పుడు అతడిని ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారని న్యాయమూర్తి పోలీసులను కనీసంగా కూడా ప్రశ్నించలేదెందుకు?’ అన్నారు.

బహుశా ఈ ముగ్గురు న్యాయమూర్తుల్లో కరకుగా వ్యవహరించింది మద్రాస్, ఢిల్లీ హైకోర్టుల్లో పనిచేసిన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎపీ షా కావచ్చు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్‌ని ధిక్కరించినందుకు జహంగిరి పురిలోని ముస్లిం ఇళ్లను కూల్చివేయడం గురించి ఆయన మాట్లాడారు. ‘సుప్రీంకోర్టు న్యాయం చేయాలనుకుంటే అది తప్పకుండా తగిన చర్యలు తీసుకుని, తప్పు చేసిన అధికార్లను జైలుకు పంపించాలి.’ అంతకుమించి న్యాయ స్థానం ‘యధాతథ స్థితిని’ పునరుద్ధరించి, ‘పరిహారాన్ని నిర్ణయించాలి.’ అలాగే ‘ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న క్యాంపెయిన్‌ని స్పష్టంగా చూస్తున్నాను’ అని జస్టిస్‌ షా ఖరాఖండీగా చెప్పారు. దీనికి గాను ‘అత్యున్నత స్థాయి నుంచి క్షమాపణ’ రావాలని ఆయన కోరారు. ఢిల్లీ కేసుకు సంబంధించినంతవరకు హోమ్‌ మంత్రిని ఉద్దేశించే తానిలా అంటున్నానని ఆయన స్పష్టం చేశారు.

ఏదేమైనా, విద్వేష ప్రసంగం, మతపరమైన హింస పట్ల ప్రభుత్వ మౌనాన్ని జస్టిస్‌ షా తీవ్రంగా ప్రశ్నించారు. అత్యున్నత స్థాయిలో ఉంటున్నవారు దీనిపట్ల పూర్తి మౌనం వహించడం చాలా ఆందోళనకరమైన విషయం అన్నారు. ఈ మొత్తం వ్యవహారం లక్ష్యం... ప్రజల్ని మరింతగా వేరు చేయడం, మరిన్ని ఉద్రిక్తతలను సృష్టించడమే అనడంలో సందేహమే లేదని చెప్పారు. ఇక ఢిల్లీ పోలీసుల విషయానికి వస్తే ‘వారు పూర్తిగా రాజీపడిపోయారు, సంపూర్ణంగా పక్షపాత దృష్టితో ఉంటున్నార’ని జస్టిస్‌ షా చెప్పారు.

ఆయన ముగింపు మరింత తీవ్రంగా ఉంది. ‘ఇక్కడ నేను స్పష్టంగా ఎలక్టోరల్‌ నిరంకుశత్వాన్ని చూస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి నాయకులు... ప్రజాస్వామిక సంస్థలను ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్, మానవ హక్కుల కమిషన్, మీడియా కూడా రాజీపడిపోయాయ’ని జస్టిస్‌ షా చెప్పారు.

ఈ ముగ్గురు న్యాయమూర్తుల్లో ఏదో ప్రత్యేకత, నిస్సంకోచత్వాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి భ్రమా రాహిత్యాన్నీ, ధిక్కార స్వరాన్నీ వ్యక్తం చేసిన ప్రముఖ వ్యక్తులు వేరే ఎవరైనా ఉంటారని నేను భావించను. అందుకే ఈ ముగ్గురు మన చైతన్య స్వరాలు అని నేను నమ్ముతున్నాను. మనలో చాలామంది మౌనంగా ఉంటున్న తరుణంలో వారు గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఇందుకు వారికి మనం మహాభినందన తెలియజేయాలి. (క్లిక్‌: వివక్షే ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టు)


- కరణ్‌ థాపర్‌ 
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు