బ్యాంకింగ్‌ లోపాలు సరిదిద్దరా? | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ లోపాలు సరిదిద్దరా?

Published Sat, Jul 1 2023 1:41 AM

MPCs policy stance more and more disconnected from reality - Sakshi

బ్యాంకింగ్‌ వ్యవస్థకు సంబంధించిన ప్రభుత్వ పాలసీల రూప కల్పనలోనూ, వాటి నిర్వహణా సామర్థ్యాలలోనూ అనేక లోపాలు ఏదో రూపంలో తలెత్తుతూనే ఉన్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం తప్పులను సరిదిద్దు కోకుండా నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శి స్తోంది. ముఖ్యంగా గత కొద్ది నెల లుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పాలసీలో అనుసరిస్తున్న ద్రవ్య విధానం ఆర్థిక వ్యవస్థకు చేటు తెచ్చేలా ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్‌ వర్మ ఇదే విష యాన్ని చెబుతూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ నెల ఆరంభంలో జరిగిన ఎంపీసీ సమావేశం మినిట్స్‌  వెల్లడయ్యాయి. వడ్డీరేట్ల పెంపుపై సభ్యుల మధ్య విభేదాలు పొడచూపినట్లుగా తెలుస్తోంది. ఏడాదికాలంలో ‘రెపో రేటు’ నాలుగు శాతం నుండి 6.5 శాతానికి పెరిగింది. ‘ద్రవ్య విధానం’ వాస్తవానికి దూరం జరిగిపో తున్నదంటూ జయంత్‌ వర్మ తాజా సమావేశంలో విమ ర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధి అంచనాలకంటే తక్కువగా ఉంటుందన్నారు.

అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రొఫెసర్‌ అయిన జయంత్‌ వర్మ, కేంద్రం ఎంపీసీలో నియ మించిన ముగ్గురు నామినీ సభ్యుల్లో ఒకరు. అలాగే  గడిచిన ఈ 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలను ‘రైట్‌ ఆఫ్‌’ చేసి ఎగవేత దారులకు మేలు చేసింది. అంతే కాక  ఉద్దేశపూర్వకంగా రుణాలనూ, వడ్డీలనూ ఎగ్గొట్టిన వారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ సిద్ధపడింది. రాజీ పరిష్కారం (కాంప్రమైజ్‌ సెటిల్మెంట్‌) పేరిట ఈ ప్రక్రి యకు తలుపుల్ని బార్లా తెరిచింది. ఈ అనాలోచిత చర్యపై సర్వత్రా  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే, ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్ప డిన వారు ఎంతమంది ఉన్నారు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 2022 డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా పెద్ద మొత్తాలను ఎగవేసిన వారు పదహారు వేల మందికి పైమాటే అని బ్యాంకు నివేదికను బట్టి తెలుస్తోంది. వీళ్లు దాదాపు రూ. 3.46 లక్షల కోట్ల రుణాలను ఎగ్గొట్టినట్లు సమాచారం. ఇందులో 85 శాతం రుణాలను (రూ. 2.92 లక్షల కోట్లు) ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

దేశంలో మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6 బ్యాంకులకు గత కొన్నేళ్లుగా చైర్‌పర్సన్‌లను నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఇందువల్ల ఆయా బ్యాంకులు క్రమంగా బలహీన పడుతున్నాయి. ఇప్పటికే నోట్ల రద్దు ప్రక్రియతో మన ఆర్థిక వ్యవస్థ సతమతం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెకాయ లాంటి బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇన్ని అంతర్గత వ్యవస్థాపరమైన లోపాలూ, నిర్వాహాణా లోపాలతో కొనసాగితే... దేశ ద్రవ్య వ్యవస్థ భవిష్యత్తులో ఏమికానుందో అనే ఆందోళన కలుగక మానదు. ఇటీవల అనేక విదేశీబ్యాంకులు వ్యవస్థాపర, నిర్వహణాపర లోపాలతో దివాలా తీసిన అనుభవాలు కళ్లెదుట కనిపిస్తున్నా వాటి నుండి మనం గుణపాఠం నేర్చుకోకుంటే ఎలా?

డా‘‘ కోలాహలం రామ్‌ కిశోర్‌ 
వ్యాసకర్త ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ ‘ 98493 28496 

Advertisement
Advertisement