Sir Arthur Cotton: డెల్టా రైతుల నుదుటి రాతలు మార్చిన మాన్యుడు | Sakshi
Sakshi News home page

Sir Arthur Cotton: డెల్టా రైతుల నుదుటి రాతలు మార్చిన మాన్యుడు

Published Sat, May 15 2021 3:28 PM

Sir Arthur Cotton Birth Anniversary: Dowleswaram Barrage, Krishna Anicut - Sakshi

నిర్మానుష్యంగా బొమ్మూరు మెట్టమీద ఒక గుర్రపుశాల, ఒక పెద్ద ఇల్లు అక్కడ నుండి చూస్తే గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టతో పాటు ఉరకలేస్తున్న గోదారమ్మ సోయగాలను వీక్షించవచ్చు. నీటి మీద రాతలు రాయలేం గానీ నీటిని ఆపి ఆనకట్ట కట్టి డెల్టా ప్రజల నుదుటిరాతను మార్చిన ‘దేవుడు’ సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నివసించిన పవిత్ర స్థలం. క్రీ.శ. 1803 సంవత్సరం మే 15న ఇంగ్లాండు అడ్డీస్‌ కాంబేలో హెన్రీ కాలేలీ కాటన్‌ దంపతులకు 10వ సంతానంగా జన్మించిన అర్థర్‌ కాటన్‌ 15 ఏళ్ళ ప్రాయంలోనే కేడెట్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని సౌత్‌ ఇండియాలోని మద్రాస్‌ చీఫ్‌ ఇంజినీరింగ్‌ ఆఫీసులో ఉద్యోగం పొందారు. కరువుతో అల్లాడుతున్న మధుర, కోయంబత్తూరు, తిరునల్వేలి ప్రాంతాల్లో చెరువులను అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు చేసారు. 1840లో కృష్ణానదిపై ఆనకట్టకు ప్రతిపాదనలు రూపొందించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసారు. 

17, 18 శతాబ్దాల కాలంలో అతివృష్టి, అనావృష్టి వరదలు వంటి వాటి కారణంగా బంగాళాఖాత తీరప్రాంతమైన కోరంగి, విశాఖపట్నం, యానాం, తదితర ప్రాంతాలలో కొన్ని వేలమంది చనిపోవడం, కొన్ని నౌకలు కూడా జలసమాధి కావడం జరిగింది. 1844లో మచిలీపట్నంలో వచ్చిన తుఫానుకు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ధాన్యరాశులు సముద్రంలో కలిసిపోయి 15 వేల మంది ప్రజలు మరణించడంతోపాటు గోదావరి, కృష్ణా ప్రాంతాలలో ప్రజలు ఆకలిమంటలతో అల్లాడిపోయారు. అప్పటికే కాటన్‌ 1844, 1845, 1846 సంవత్సరాలలో నివేదికలు పంపించినా బ్రిటిష్‌ పాలనా యంత్రాంగం ఆమోదించలేదు.

దీంతో స్వయంగా బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి 1847లో ఆనకట్ట నిర్మాణం మొదలు పెట్టారు కాటన్‌. ఎన్నో కష్టనష్టాలకోర్చి రవాణా సౌకర్యం లేని ఆ రోజులలో తన గుర్రంపై తిరిగి ఆయకట్టు ఎత్తుపల్లాలను సరిచూచుకొని కాలువలు తవ్వి చివరి ప్రాంత ఆయకట్టుకు కూడా నీరందించేలా డెల్టా వ్యవస్థను, ఆలాగే డ్రైనేజీ సదుపాయం, లాకుల వ్యవస్థ నిర్మించి కాలువలలో ప్రవహించే నీరు వృధాకాకుండా రైతులకు ఎక్కువ నీరు ఉపయోగపడేలా డెల్టాను రూపొందించిన ఘనులు.

1852లో గోదావరి ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజల హృదయాలలో అపర భగీరథుడిగా మిగిలి, ఘనకీర్తిని సంపాదించుకున్నారు. దేశచరిత్రలో తొలిసారిగా కృష్ణా, గోదావరి డెల్టాల వ్యవస్థను కాలువ ఆయకట్లు, డ్రైనేజ్‌ పద్ధతిలో నిర్మించి మార్గదర్శకులైనారు. గోదావరి ప్రాంతానికి చెందిన వీణం వీరన్న 1847లో కాటన్‌ దగ్గర సహాయ ఇంజినీర్‌గా పనిచేసి కాటన్‌కు తోడుగా ఉండి ఆయన కార్యక్రమాలను అమలు చేసిన తొలి తెలుగు ఇంజినీర్‌గా చరిత్రలో నిలిచిపోయినారు.

1840లోనే కృష్ణానదిపై ఆనకట్ట ప్రతిపాదనలు బ్రిటీష్‌ ప్రభుత్వానికి పంపించి సిఫార్సు చేయడమే కాకుండా ధవళేశ్వరం బ్యారేజ్‌ పూర్తయిన తర్వాత కృష్ణా ఆనకట్టను నిర్మించారు కాటన్‌. అందుకే గోదావరి, కృష్ణా ప్రాంత ప్రజలు దేవాలయాలకు వెళ్లినపుడు మొదటిగా అన్నం పెట్టినవాడే దేవుడిగా భావించి కాటన్‌ మహాశయుణ్ణి తలచుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రాంతాన్ని అన్నపూర్ణగా, రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చడంలో కాటన్‌ కృషి మరువలేనిది. 1858, 1863, 1867 సంవత్సరాల్లో కాటన్‌ బ్రిటిష్‌ ప్రభుత్వ అభ్యర్థన మేరకు గంగానదిపై, ఒరిస్సాలోని ముఖ్యనదులపై ఆనకట్టలు నిర్మించే అమోఘమైన సలహాలు ఇచ్చారు. 

ఈ కాలంలోనే హిమాలయాల నుండి కన్యాకుమారి వరకూ భారతదేశంలోని అన్ని నదులను అనుసంధానం చేసి యావత్‌ భారతదేశాన్ని సస్యశ్యామలం చేసే వినూత్న నివేదికలను మ్యాప్‌లను తయారుచేసి ఆ విధంగా జలరవాణాను కూడా ప్రోత్సహించాలని ఆనాడే ఆకాంక్షించారు. రవాణా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లోనే కాటన్‌ వందలాది మైళ్ళు గుర్రంపై తిరిగి ఈ మహాయజ్ఞాన్ని పూర్తిచేసారు. కారు చౌకగా లభించే జలరవాణా ప్రాధాన్యతను గుర్తించి దానికి అనుగుణంగా వ్యవస్థను రూపొందించిన మహానుభావుడు. ఈ ప్రాంత ప్రజలు తినే తిండిలో, తాగే నీటిలో, ఈ ప్రాంత అభివృద్ధిలో వెల్లివిరిసిన నాగరికతలో ఆయనే కనబడతాడు. రైతు వ్యవసాయానికి అనుకూలంగా కృష్ణా, గోదావరి డెల్టాలను ఆధునీకరణ చేసి నీటి వృధాను తగ్గించి, కాటన్‌ మహాశయుని ఆశయాలను కాపాడి, మన ముందు తరాలను అందించడమే ఆయనకు మనమర్పించే నివాళి.


- కొవ్వూరి త్రినాథరెడ్డి 
వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రైతు విభాగం 
మొబైల్‌ : 94402 04323

Advertisement
Advertisement